– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాల అమలు ఆగదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతుబంధు లాంటి పథకాలు ఆగిపోతాయని తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసారన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితువు పలికారు. గత ప్రభుత్వ హాయంలోని పథకాలు గాని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న, చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మహిళలకు రూ. 2500 పథకాలాన్ని తప్పనిసరిగా అమలు చేసి తీరుతుంది అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు సుంకేట శ్రీనివాస్, సల్లూరి గణేష్ గౌడ్, సింగిరెడ్డి శేఖర్, ఉట్నూరు ప్రదీప్, వేములవాడ జగదీష్, ఆవారి శ్రీనివాస్, అజారుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.