– ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి
– వాణిజ్య ఆహార పంటగా సాగు చేస్తున్న రైతులు
– క్వింటాలుకు రూ.8వేలకు పైగానే..
– నారాయణపేట జిల్లాలోనే 70,365 ఎకరాల్లో సాగు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వాణిజ్య, ఆహార పంటగా సాగయ్యేది కంది పంట. ఈ ఏడాది ఆశాజనకంగా ఉంది. దేశంలోనే పేరెన్నిక గల తాండూరు కంది నారాయణపేటలో సాగవుతోంది. దిగుబడి, కొనుగోలు ధరలు పెరగడంతో రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా.. క్వింటాలుకు రూ.8వేలకు పైగా ధర మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారు. ఒక్క నారాయణపేట జిల్లాలోనే 70,365 ఎకరాల్లో సాగు చేశారు. కంది పంటను లాభదాయకంగా సాగు చేస్తే.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి తీయొచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈసారి అధిక వర్షాల వల్ల ఖరీఫ్‌లో ఇతర పంటలకు జరిగిన నష్టాన్ని కంది పంట తీర్చడం రైతులకు ఊరట ఇచ్చే అంశంగా ఉంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, దామరగిద్ధ, కోస్గి, మద్ధూరు, దౌల్తాబాద్ ప్రాంతాల్లో సాగయ్యే కంది మంచి నాణ్యమైన పంటగా పేరున్నది. ఈ కంది విత్తనాన్ని మహారాష్ట్ర బదనాపూర్ నుంచి మన పూర్వీకులు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. ఈ ప్రాంత నేలలు ఈ విత్తనానికి అనుకూలంగా ఉంటాయి. నారాయణపేట జిల్లాలో 70,365 ఎకరాల్లో 44148 మంది రైతులు సాగు చేస్తుండగా, కొడంగల్‌లోనే 18000 ఎకరాలు, దామరగిద్ధ 16000, నారాయణపేట 14000 వేల ఎకరాలు సాగు చేశారు. ఊట్కూర్, నర్వ, మక్తల్‌లో మరో 22 వేల ఎకరాలలో కంది పంటను వేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 11345 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 7063, వనపర్తి జిల్లాలో 6630 ఎకరాలు, గద్వాల జిల్లాలో 43364 ఎకరాలు సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి 20 శాతం సాగు పెరిగింది.
పెరిగిన దిగుబడి
ఈసారి కంది పంట దిగుబడి బాగా పెరిగింది. సాధారణంగా ఎకరాకు మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేది కాదు. ఈసారి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఏటా సెప్టెంబర్‌లో వర్షాలు ఉండవు. బోరు బావుల ద్వారా నీరు పారించేవారు. ఈసారి నవంబరు వరకు వర్షాలు రావడంతో కందికి అనుకూలంగా మారింది. గతేడాది క్వింటాలుకు రూ.5 వేలు ఉంటే ఈసారి రూ.8 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఊట్కూరు మండలం ఎడవల్లిలో ఓ రైతు ఐదు సాళ్లకు ఐదు సంచుల కంది పంట తీశారంటే దిగుబడి ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తోంది.
అధిక దిగుబడులిచ్చే కంది పంటను సాగు చేయాలి
కంది సాగు చేసే రైతులు మంచి దిగుబడి ఇచ్చే మహారాష్ట్రకు చెందిన బదనాపూర్ విత్తనాలు వాడాలి. ముఖ్యంగా సాలు సాలుకు ఎడం పెంచి విత్తనం వేయాలి. విత్తనం వేసిన 65 రోజుల తర్వాత పై తలలు కత్తిరించాలి. జానెడుకు ఒక మొక్క ఉండేవిధంగా విత్తుకోవాలి. పూత దశలో 319 ఎకరాకు కేజీ స్ప్రే చేసి తెగుళ్ల నుంచి కాపాడుకోవాలి. రైతులు కంది పంటపై దృష్టి సారించి అధిక దిగుబడి వచ్చేలా కృషి చేయాలి.
జాన్ సుధాకర్, డీఎఓ నారాయణపేట
పంట దిగుబడి పెరిగింది
ఈసారి కంది పంట దిగుబడి పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్‌లో వర్షాలు పడటంతో నీటి సమస్య తగ్గింది. మార్కెట్‌లో కందికి ఆశించిన స్థాయిలోనే ధర ఉన్నా.. పంట చేతికి వచ్చిన తర్వాత ధర పతనం అయ్యే అవకాశాలున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి.
పుట్టి రాజు, దామరగిద్ద, నారాయణపేట