భారతదేశం ఒక వ్యవసాయ క్షేత్రం. అనాదిగా ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. రైతును ఒకప్పుడు అన్నం పెట్టె దేవుడితో సమానంగా చూసేవారు. ”రైతే రాజు” అనే నినాదం కూడా చేస్తుంటాం. కానీ నేడు ఆ రైతే ప్రభుత్వ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పెట్టిన పెట్టుబడి రాక, ప్రకతి విపత్తులకు పంట చేతికి రాక అప్పుల్లో కూరుకొని తీరని ఆవేదనలో నేటి రైతు కనబడుతున్నాడు. అలాంటి రైతును తన కలం ద్వారా భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ర్యాలీ ప్రసాద్. ‘రైతు’ అనే దీర్ఘ కవితతో మన ముందుకు వచ్చారు. ఈ దీర్ఘ కవితలోని కొంత భాగం ‘నవమల్లెతీగ’, ‘సింహపురి రైతు’ అనే మాస పత్రికల్లో ప్రచురితమయింది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదన్నాడు మహా కవి. అలాంటి సౌందర్యానికి కష్టాల మరకలు అంటితే రైతుకి ఎలా ఉంటది అని తన దీర్ఘ కవితలో చెప్పారు.
‘రైతు ఎప్పుడు కూడా తన కడుపు పైపు చూసుకోక అందరి ఆకలినీ తీర్చాలనుకుంటాడు’ అంతటి మహౌన్నతమైన వ్యక్తి ఒక రైతు కాక ఇంకెవరు ఉంటారు చెప్పండి. మట్టినే అతని ప్రపంచంగా చేసుకుంటాడు. పరీక్షలకు వెళ్లే విద్యార్థిలా ప్రకతి విపత్తులను ఎదుర్కొనేందుకు నిత్య విద్యార్థి అవుతాడు. వ్యవసాయం చేయడానికి అతనెప్పుడూ అలసిపోడు.శ్రమనే నమ్ముకొని తన చెమట చుక్కల్లో దేశ కాంతిని మెరిసేలా చేయగలడు. రైతు గురించి కవి ర్యాలీ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే పేజీ 14 లో
‘రామపాదం తాకిన రాయి
ఆడదిగా మారిందో లేదో గానీ
రైతు పాదం తాకిన మట్టి
అన్నమ్ముద్దలా మారింది’
‘మట్టిమీదంతా చెమట చల్లి ఆకుపచ్చ లోకాల్ని సష్టించే బ్రహ్మ అతడు’ , అప్పుడే పుట్టిన శిశువును మదువుగా అరచేతుల్లోకి తీసుకున్నట్లు అతి సుతారంగా పైరును గుండెలకు హత్తుకునే కల్మశంలేని అన్నవిధాత అతను. పిడికెడు బువ్వ పుట్టించడం కోసం భార్య పుస్తెల్ని పసుపుకొమ్ము జేయడానికి కూడా వెనకడుగు వేయడు. దేశానికి అన్నంపెట్టాలనే అతని ఆశయంకు బీడైపోతున్న పొలాన్ని చూసి అప్పుల శిలువ ఎక్కడైనికైనా, ఫలసాయాన్నివ్వాల్సిన కొమ్మకొమ్మకు ‘ఉరి’ ని ముద్దాడే దీన రైతు అవుతాడు. పురుగుల్ని చంపడానికి పనిచేయని ‘మందు’ రైతు ప్రాణం దగ్గర నిజాయితీని నిరూపించుకుంటుంది. ఓడిపోయి నప్పుడల్లా ఆకాశాన్ని అందుకోవాలనుకునే ఫినిక్సవు తాడు. వ్యవసాయ కురుక్షేత్రంలో వెన్నుచూపని పద్మవ్యూహపు అభిమన్యుడు అతడు. వ్యావసాయం చేసే రైతు గూర్చి చెప్పడమంటే నిరాశల్ని తనలోకి ఒంపుకొని మరణంపైపు సాగిపోయే ఆశాజీవి అనవచ్చేమో అనిపిస్తుంది.తెగులొచ్చి ముడుచుకున్న ఆకుల్లాగ మారిపోయింది వ్యవసాయం. పొయ్యిమీద అన్నంలా బ్యాంకుల అప్పులు ఇంటి బాధ్యతలు రైతుమెదడులో ఉడుకుతున్న దశ్యాలు చూస్తున్నాము. ప్రస్తుతం నేలను నమ్ముకున్న వారి గూర్చి చెప్పుతూ పేజీ 58 లో
నేలను అమ్ముకున్నవాడు
నింగిని ఎగబాకుతుంటే
నేలను నమ్ముకున్నవాడు
మట్టిలో ఇంకిపోతున్నాడు
ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. వ్యవసాయం చేయలేక ఆ నేలనే రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్ల బిసినెస్ చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. పైసాకు పైసా స్టేటస్ చూపిస్తూ దర్జాగా బతికేస్తున్నారు. అదే నేలను నమ్ముకొని దేశానికి నాలుగు మెతుకులు బువ్వ పెట్టేవారికి మాత్రం నిత్యం పేగుల్లో ఆకలిని నింపుకొని అప్పుల నది దాటడానికి తన కిడ్నీలు అమ్ముకునే పరిస్థితికి వస్తున్నాడు. తల్లి చనుబాల ధారలాంటి చెమటను పైరుకు అందిస్తూ నేలకు జీవం పొసే రైతు మాత్రం నేలలో నిరాశతో కూరుకు పోతున్నాడు. నదులైన ఇంకిపోవచ్చేమో కానీ రైతు చెమట మాత్రం నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిదంగా పేజీ 105 లో
చెప్పుల్లేని ఆ పాదాలు నేలను మరింత
దగ్గరగా హత్తుకుంటాయి
అభివద్ధి అంటున్న దేశమిపుడు
పచ్చిని పొలాలకు దూరమైంది.
ఆధునికత పేరు చెప్పి యువతను టెక్నాలజీని నేర్చుకోమని చెప్పుతూ వారిలో ఏమాత్రం కూడా వ్యవసాయం వైపు రానీయకుండా ఉద్యోగాలిస్తామని ఆశ చూపిస్తూ భ్రమల్లోకి నెట్టివేస్తున్నారు. నేటి యువతరం చాల మట్టుకు అటు ఉద్యోగాలు లేక ఇటు వ్యవసాయం చేయలేక నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. వ్యసాయం చేయడమనేది పాతతరం వారు మాత్రమే చేసేది మేము కాదు అనే ధోరణికి నేటి యువత చేరుకున్నారు. ఉద్యోగం చేయడం మంచిదే కానీ మన దేశ వెన్నెముఖలాంటి వ్యవాసాయన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం భావితరాలకు శ్రేయస్కరం కాదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతే నిర్ణయించే స్వేచ్ఛ రావాలి. వ్యవసాయం అనేది పండగల బాధ్యతతో కూడుకునేదిగా చేయాలి ప్రభుత్వాలు అందుకు సహాయ సహకారాలు అందించడమేకాదు సరిఅయిన పరివేక్షణ చెయ్యాలి. దళారుల చేతిలో నిత్యం మోసపోతున్న రైతన్నను కష్టాల నదీతీరాలను దాటి ఒడ్డుకు చేర్చమని కవి తన కవిత్వంద్వారా విన్నవించుకుంటున్నాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే అందరికి అన్నం పెట్టె రైతు సంతోషంగా వ్యవసాయాన్ని చేసేలా చూద్దాం. ”రైతే రాజు” అయ్యేలాగున దేశాన్ని నడిపిద్దాం. రైతు ఆత్మహత్యలు లేని దేశాన్ని నిర్మిద్దాం.
ఈ పుస్తకం నిండా రైతు పడే భాదలు, ఇబ్బందులు అన్ని కనిపిస్తాయి. ర్యాలి ప్రాసాద్ గారు రైతుని చక్కగా అర్థం అర్థంచేసుకున్నారని అతని కవిత్వం చదువుతుంటే తెలిసిపోతుంది. గుండె బరువెక్కే కవిత్వ పాదాలు ఇందులో మనం చూడవచ్చు. ‘రైతును గురించి రాయడమంటే మరణిస్తున్న మనిషి ఆత్మకథ రాయడమే’ అంటాడు కవి. రైతు గూర్చి దీర్ఘ కవితని రాసినందుకు ప్రసాద్ గారిని అభినందించాల్సిందే.
రైతు (దీర్ఘ కవిత)
రచయిత : ర్యాలీ ప్రసాద్,
పేజీలు : 111,
వెల : రూ. 100 /-
ప్రతులకు : 9494553425; విశాలాంధ్ర బుకహేౌస్
గాజోజి శ్రీనివాస్
9948483560