– మూసీ ప్రక్షాళన ముమ్మాటికీ అవసరమే
– ఖరీఫ్‌కి, రబీకి తేడా తెలియదా..
– కేటీఆర్ మాటలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు : హరీశ్‌రావు వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కామెంట్స్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతులకు బేడీలు వేసిన వాళ్ళు ఇవ్వాళ మాట్లాడుతున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి విమర్శించారు. నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న వాళ్లు నేడు మీసాలు తిప్పుతున్నారన్నారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖరీఫ్‌కు, రబీకి తేడా తెలియని వారు మాట్లాడితే ఎలా.. అని ప్రశ్నించారు. ప్రజల మీద సానుభూతి ఉంటే సలహాలు సూచనలు చేయండని, స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక మాట, దేశంలో మరో మాట మాట్లాడి.. బిడ్డను జైలు నుంచి విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ పాలన భేషుగ్గా ఉండటంతో బీఆర్‌ఎస్ వాళ్లకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయని అన్నారు. ఇవ్వాళ హరీశ్ రావు పర్యటనే ఓ జోక్ అని ఎద్దేవా చేశారు. నాగలి పట్టి దున్నిన మోహలా మీవి.. అని ప్రశ్నించారు. మీ బతుకులు కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ కాదా అని అన్నారు. మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. ఓడిపోయి ఏమి చేయాలో తెలియక ఇలాంటి జోకులు వేస్తున్నారా అని అన్నారు. నిద్రాహారాలు మాని రేవంత్ పని చేస్తున్నారని తెలిపారు. మీకు రాష్ట్ర ప్రయోజనాల మీద కమిట్‌మెంట్ ఉందా అని, మీ రాజ్యసభ సభ్యులు ఏ స్కీమ్ తెచ్చారని ప్రశ్నించారు. పువ్వాడ అజరుకు ఏమీ కనబడవని, దమ్ముంటే తనతో కలిసి నడవాలని, తాను తిరిగిన ఊళ్ళు నువ్వు తిరిగావా అని నిలేశారు. నకిలీ విత్తనాలతో సుజాతనగర్‌లో రైతులు ఇబ్బందులు పడితే రైతుకు రూ. 6,500 ఇప్పించానని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను రాష్ట్ర బహిష్కరణ చేయాలని తెలిపారు.
కొత్తగూడెంలో ఫ్రీ కండిషన్ ఎయిర్‌పోర్ట్ రానుందన్నారు. ఆ రోజుల్లోనే కార్గో ప్లెయిన్ కూడా అడిగామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో అడవి అనేది లేకుండా పోయిందన్నారు. వైరాలో రైతులకు పంటలపై అవగాహన కోసం హాస్టల్ కట్టించాలని అనుకున్నామన్నారు. కొత్తగూడెం రైల్వే భూములను మనం తీసుకొని వాళ్లకు వేరే భూమివ్వాలని నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఏడాది స్థంభాద్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని అన్నారు. మత్స్యకారుల పండుగ రోజున పాలేరులో ఉత్సవాలు జరుపబోతున్నట్టు చెప్పారు. నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపం అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ మంత్రిని కోరినట్టు చెప్పారు. కేటీపీఎస్ ఆ స్టేజీకి వచ్చిందంటే తన కృషి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం పాల్వంచ స్పాంజ్ ఐరన్‌ను మూసివేసిందని తెలిపారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడి మళ్ళీ తెరిపించాలని పోరాటం చేస్తామని చెప్పారు. కేటీఆర్ మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, కాళేశ్వరం మొత్తం డొల్ల అంటే బీఆర్‌ఎస్ నేతలు ఒప్పుకుంటారా.. అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన ముమ్మాటికీ అవసరమేనని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.