బాలిక – భవిత?

బాలిక - భవిత?నేడు జాతీయ బాలికా దినోత్సవం. ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ మన ప్రధాని నినాదం. పేరు గొప్ప, ఊరు దిబ్బకు ఇంతకుమించిన ఉదాహరణ మరేదీ ఉండదు. ప్రభుత్వ లెక్కలే దీనికి రుజువు. అభివృద్ధిలో ఎంతో ముం దంజలో ఉన్నామని ఢంకా బజాయించి చెప్పుకుంటున్నా అమ్మాయిల పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అమ్మాయంటే అమ్మకు ప్రతి రూపం, సమాజంలో సగం అంటూ గొప్పలు చెప్పుకునే మన దేశంలో ఇప్పటికీ ఆచా రాలు, సంప్రదాయాలు వారి తలరాతను నిర్దేశిస్తూనే ఉన్నా యి. నేడు దేశంలో అమ్మాయిల బతుకే ప్రశ్నార్ధకమయింది.
భారతదేశంలో ఏటా సుమారు కోటి ఇరవై లక్షల మంది బాలికలు జన్మిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. కానీ వారిలో పదిహేనేండ్లు వచ్చేసరికి సుమారు ముఫ్పై లక్షల మంది చనిపోతున్నారు. దీనికి బాలికల మీద ఉన్న చిన్న చూపే ప్రధాన కారణం. లింగ సమానత్వం లేనిదే దేశంలో అభివృద్ధి, సామాజిక మార్పు సాధ్యంకాదంటూ ఓ వైపు ప్రచారం చేస్తూనే అమ్మాయిలపై వివక్ష చూపిస్తు న్నారు. ఫలితంగా లింగ సంబంధ సూచీలో 2019లో మొత్తం 129 దేశాలకుగాను భారత్‌కు 95 వ స్థానం దక్కింది. లింగ వివక్ష కారణంగా యాభై వేల మంది బాలి కలు పుట్టక ముందే మరణిస్తున్నారు.
దేశంలో ప్రతి 1000 మంది మగవారికి సుమారు 940 మందే స్త్రీలు ఉన్నారు. గత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముఫ్పై లక్షల మంది బాలికలకు పదమూ డేండ్లలోపే వివాహాలు చేస్తున్నారు. వీరిలో 26.8 శాతం మంది బాలికలకు బలవంతంగా వివాహాలు జరుగుతు న్నాయి. చిన్న వయసులో పెండ్లి చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాగే వారిపై శారీరక, మానసిక, లైంగిక వేధింపులు నానాటికీ పెరిగి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, ఢిల్లీలో బాలి కలు ఎక్కువగా లైంగిక దోపిడీకి గురవుతున్నారు. 2022 లో తెలంగాణలో ప్రతిరోజూ ఐదుగురు మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు, ముగ్గురు లైంగిక వేధింపులకు గురవుతు న్నారని చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ (క్రై) విడుదల చేసిన ‘ఆడ పిల్లల కీలక ఆందోళనలపై స్థితి నివేదిక – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌’ పేర్కొంది. బాగా తెలిసినవారు, నమ్మకమున్న వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
మరో అతిపెద్ద సమస్య బాలికల అక్రమ రవాణా. పౌ రులుగా ఎదగాల్సిన వారు కొన్ని ముఠాల చేతుల్లో బానిస లుగా మారిపోతున్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే లోపే వారి జీవితాలు నలిగిపోతున్నాయి. వారి ఆనందాన్ని, ఆశ లను కొన్ని శక్తులు చిధిమేస్తున్నాయి. బాలికలను అమ్మడం, విదేశాలకు తరలించడం, మాదకద్రవ్యాల రవాణాలో వాడుకోవడం వంటివి చేస్తున్నారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకారం అపహరణకు గురైన బాలికల్లో 28శాతం మంది పద్దెనిమిదేండ్ల లోపు వారే. ఈ అక్రమ రవాణా బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుంచి ఎక్కువగా సాగుతోంది. బాలల అక్రమ రవాణాకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. పిల్లల భద్రతపై గానీ, వారికి కల్పించాల్సిన సదుపాయాలపైన గానీ దృష్టి పెట్టడంలేదు.
అలాగే అమ్మాయిలు ఎక్కువ శాతం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. రక్తహీనతతో అల్లాడుతు న్నారు. 6-13 ఏండ్ల వయసున్న బాలికలు ఆర్ధిక సమస్య లతో చదువు మానేస్తున్నారు. ఐదేండ్ల లోపు బాలికలు 38శాతం వివిధ కారణాల వల్ల మనో వైకల్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక అక్షరాస్యత శాతం చూస్తే మహిళల అక్షరాస్యత శాతం 68.4 శాతంగా ఉంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రకారం దాదాపు 2.5 కోట్ల మంది చిన్నారులు ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న బాలి కలు ఏ ప్రభుత్వ పథకంలోనూ పాలుపంచుకోవడం లేదని తేలింది. అలాగే దేశంలో 15-18 ఏండ్ల వయసు గల కౌమారదశలో ఉన్న బాలికలలో 39.4 శాతం మంది ఏ విద్యా సంస్థకు హాజరు కావడం లేదు. వీరిలో 65 శాతం మంది బాలికలు ఇంటి కార్యకలాపాలు లేదా భిక్షాటన చేసు కుంటూ బతుకుతున్నారు. ఇది నేడు మన దేశం లో బాలికల దుస్థితి.
బాలికల పట్ల పాలకులు ఇంత వివక్ష చూపు తున్నా దేశం పరువును అన్ని రంగాల్లో నిలబెడు తుంది మాత్రం ఆడపిల్లలే. తినడానికి సరైన తిండి లేకపోయినా దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మేరికోమ్‌లు మన దగ్గర ఎందరో ఉన్నారు. అలాం టి అమ్మాయిలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే తమ సత్తా చాటుకుంటారు. ఇప్పటికైనా పాలకుల ఆలోచనా విధానం మారాలి. అధికారం కోసం కా కుండా సమాజంలో మార్పు కోసం కృషిచేయాలి. లింగ సమానత్వం కోసం భ్రూణహత్యలు, పౌష్టికా హార లోపాలు, అనారోగ్యం, అవిద్య, బాల్యవివా హాలు, బాలికల అక్రమ రవాణా వంటి సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో పనిచే యాలి. జాతీయ బాలికా దినోత్సవం అంటే కేవలం ఓ పండుగగా కాకుండా పాలకులు దీన్ని బాధ్యత గా భావించాలి. నినాదాలను కేవలం ఉపన్యాసాలకే పరి మితం చేయకుండా ఆచరణలో పెట్టాలి. అప్పుడే బాలికల భవిత బాగుపడుతుంది.