ముఖాన్ని అందంగా ఉంచుకోవడానికి అందరూ చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దానితో పాటు కాళ్లని కూడా అందంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు నెయిల్ ఫాలిష్ వేయడమే కాదు, అవి అందంగా కనిపించడానికి, మురికి లేకుండా ఉంచుకోవాలి. అందుకోసం పెడిక్యూర్ తప్పనిసరి.. పార్లర్‌కు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టడం కంటే ఇంట్లోని చిన్న చిన్న చిట్కాలతో వాటిని అందంగా మలుచుకోవచ్చు. అవేంటంటే…
ఇంటి వద్ద పెడిక్యూర్ చేసుకోవాలంటే మొదట మీ కాళ్లకు ఉండే నెయిల్ పాలిష్ తీసేయండి. ఆ తర్వాత బకెట్‌లో పావు వంతు వేడి నీళ్లు తీసుకోండి. అందులో కొంచెం ఉప్పు వేయండి. అలాగే 10 చుక్కల నిమ్మ రసం లేదా ఆరెంజ్ జ్యూస్ వేయండి. మీరు కావాలనుకుంటే నిమ్మ లేదా ఆరెంజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ పాదాలను ఆ బకెట్‌లో ఉంచండి.
మీ పాదాలను ఓ పావుగంట పాటు ఆ బకెట్‌లోనే ఉంచండి. ఆ తర్వాత బ్రష్‌తో పాదాలను రుద్దండి. బలంగా కాకుండా మెల్లగా రుద్దాలి. దీని కోసం కొన్ని రాళ్లు కూడా దొరుకుతాయి. ఆ రాళ్లను ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
కాళ్లు రుద్ది కడిగిన తర్వాత శుభ్రమైన టవల్‌తో తుడవండి. మళ్లీ ఓ సారి శుభ్రమైన నీటితో పాదాలు శుభ్రం చేసుకోండి. కాళ్ల మీద ఉండే మట్టిని తొలగించడం ద్వారా క్రిములను కూడా పారదోలవచ్చు. గోళ్లు కట్ చేయాలంటే నెయిల్ కట్టర్ వాడాలి. బ్లేడ్ లాంటివి వాడొద్దు.
గోళ్లు కట్ చేసే ముందు వాటిని శుభ్రం చేయాలి. గోళ్లు బాగా దగ్గరగా కట్ చేయవద్దు. గోళ్లలో మట్టి ఉంటే దాన్ని కాటన్‌తో తొలగించాలి. పాదాలు, గోళ్ల మీద క్రీమ్‌తో మసాజ్ చేయాలి. అది చర్మం లోపలికి ఇంకేంత వరకు మసాజ్ చేస్తూనే ఉండాలి.
కాలి మడమను చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. అవసరమైతే మరికొంత క్రీమ్ అప్లై చేయాలి. మసాజ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కింద నుంచి పైకి మసాజ్ చేయాలి. మడమకు కూడా మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో కాళ్లు తుడుచుకోవాలి. అంతా పూర్తయిన తర్వాత మళ్లీ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు.