– రెండు, మూడు రోజులలో బదిలీల ఉత్తర్వులు
– బోనకల్ నుంచి 17 మందికి బదిలీ అవకాశం?
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులలో గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శుల బదిలీల ఉత్తర్వులు వెలవడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 580 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టింది. దీంతో అన్ని గ్రామపంచాయతీలకు గ్రామపంచాయతీ కార్యదర్శులను నియమించింది. ఇందులో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం జిల్లా కలెక్టర్‌గా ముజామ్మిల్ ఖాన్ నియామకం జరగటం చక చక జరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం అన్ని స్థాయిలలో అధికారుల బదిలీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల బదిలీలను కూడా చేపట్టాలని కొత్త జిల్లా కలెక్టర్ నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా ఐదు సంవత్సరాలు కాలపరిమితి నిండిన వారందరినీ బదిలీ చేసేందుకు కొత్త జిల్లా కలెక్టర్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుత కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ గ్రామపంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ప్రస్తుతం పని చేస్తున్న నియోజకవర్గం, నివాస నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయాలని కలెక్టర్ నిర్ణయించినట్లు సమాచారం. ఒకే నియోజకవర్గంలో నివాసం ఉన్నా, పని చేస్తున్న స్థలము ఉన్న మరొక నియోజకవర్గానికి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే అందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సంఘం వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నట్లు తెల్సింది. నియోజకవర్గం కాకుండా పనిచేస్తున్న మండలం, నివాస మండలం మినహా ఇతర మండలాలకు బదిలీ చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శుల సంఘం కలెక్టర్‌ను కోరుతుంది. ఆనాడు కొత్తగా గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టటంతో నివాస మండలం కాకుండా సుదూర మండలాలో నియమిస్తే కొత్తగా నియామకం జరుగుతున్న గ్రామపంచాయతీ కార్యదర్శులు వివిధ రకాలుగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని నివాస మండలంలో కూడా కార్యదర్శులను ఆనాటి కలెక్టర్ వీపీ.గౌతమ్ నియమించారు. నెల వేతనం కేవలం రూ. 15,000 కావడంతో సుదూర ప్రాంతాలలో నియమిస్తే ప్రధానంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ భావించి నివాస మండలాలలో కూడా నియామకాలు చేశారు. పైగా సొంత మండలం అయితే ఆ గ్రామపంచాయతీ అభివద్ధికి నిరంతరం కషి చేస్తారని అవసరమైతే నివాసం అదే మండలం కాబట్టి సమయం ఎక్కువైనా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందనే భావనతో ఆనాడు కలెక్టర్ సొంత మండలాలలో పంచాయతీ కార్యదర్శులను నియమించారు. బోనకల్లు మండలంలో ఈ ప్రయోగం దాదాపు సమర్థవంతంగానే అమలు జరిగినట్లు భావించవచ్చు. బోనకల్ మండలంలో నియమించబడిన గ్రామపంచాయతీ కార్యదర్శులలో ఎక్కువ భాగం బోనకల్ మండల నివాసులే కావటం విశేషం. వారు పనితీరు కూడా ఆనాటి కలెక్టర్ వీపీ. గౌతమ్ ఆశించినట్లుగానే జరిగింది. ప్రస్తుతం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని వారందరిని బదిలీ చేయటానికి కలెక్టర్ రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా బోనకల్ మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అయితే తూటికుంట్ల గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తాళ్లూరు గోపికి మరొక ఉద్యోగం రావడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం తూటికుంట గ్రామపంచాయతీ కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. తూటికుంట్ల గ్రామపంచాయతీ మినహాయిస్తే 16 గ్రామపంచాయతీ కార్యదర్శులకు బదిలీలు కానున్నాయి. మిగిలిన ఏడుగురుకి మాత్రమే ఐదు సంవత్సరాలు నిండలేదు. దీంతో ఈ ఏడుగురికి బదిలీ జరిగే అవకాశం లేదు. ఇందులో ముష్టికుంట్ల గ్రామపంచాయతీ కార్యదర్శి నల్లబెల్లి రఘు, బోనకల్ కార్యదర్శి దామల్ల కిరణ్, గార్లపాడు కార్యదర్శి కాశిబోయిన నాగేశ్వరరావు, చిన్న బీరవల్లి కార్యదర్శి అజరు కుమార్, రాపల్లి కార్యదర్శి చల్లా భాస్కరరావు, మోటమర్రి కార్యదర్శి వెంకట జోగారావు, గోవిందాపురం ఎల్ కార్యదర్శి బంధం వెంకటరమణ ఉన్నారు. కలెక్టర్ అనుకున్న ప్రకారం నియోజకవర్గం ప్రాతిపదికగా బదిలీలు జరుగుతాయా, గ్రామపంచాయతీ కార్యదర్శుల సంఘం కోరిన విధంగా మండలాల ప్రాతిపదికగా కలెక్టర్ బదిలీ చేస్తారా వేచి చూడవలసిందే.