ఉధృతంగా రైతన్నల పోరాటం

ఉధృతంగా రైతన్నల పోరాటం– పంజాబ్‌ లో నాలుగు రోజులుగా పట్టాలపై బైటాయింపు
– 54 రైళ్లను రద్దు చేసిన అధికారులు
న్యూఢిల్లీ/పాటియాలా : పంజాబ్‌లో రైతన్నల పోరాటం ఉధృత రూపు సంతరించుకుంటోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టం, వ్యవసాయోత్పత్తుల సేకరణ తదితర డిమాండ్లతో గత ఫిబ్రవరిలో రైతు, కార్మిక సంఘాలు చలో ఢిల్లీ మార్చ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో వేలాది మంది రైతన్నలను పోలీసులు అప్పట్లో అడ్డుకున్నారు. ఇదే సందర్భంలో పలువురు నేతలను, రైతులను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది. వీరిలో కొందరు రైతులను ఇప్పటికీ విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిట్‌కల్‌) వివిధ రూపాల్లో ఆందోళనలను సాగిస్తోంది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడంతో హర్యానా సరిహద్దుకు సమీపంలో పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్‌ను ఈ నెల 17న రైతులు దిగ్భందించారు. వందలాది మంది రైతులు రైల్వే పట్టాలపై బైటాయించారు. వీరి ఆందోళన శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో రైల్వే అధికారులు అంబాలా – లూథియానా – అమృత్‌సర్‌ మార్గంలో 54 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. అన్నదాతల నిరసనల కారణంగా ఈ నెల 17 నుంచి దాదాపు 380 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. అయితే తమ ఉద్దేశం ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం కాదని, దేశంలో అన్నం పెట్టే రైతన్నను కారాగారాల్లో బంధించిన బిజెపి ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకేనని సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కెఎంఎం) నాయుకులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఇతర ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని శ్రమజీవుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. హర్యానా ప్రభుత్వం దిగివచ్చి తమ ముగ్గురు రైతు నాయకులను విడుదల చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌) నేత శర్వాణ్‌ సింగ్‌ పందేర్‌ తెలిపారు. దేశంలో రైతన్న పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధమైన హామీతో సహా తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎస్కేఎం (నాన్‌ పొలిటికల్‌) మరియు కెఎంఎం ఈ ఏడాది ఫిబ్రవరి 13న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ చేపట్టారు. కార్మిక, కర్షకుల పాదయాత్రను భద్రతా దళాలు అడ్డుకోవడంతో పంజాబ్‌, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్దే అన్నదాతలు వివిధ రూపాల్లో తమ ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.