లింగ వివ‌క్ష‌పై ‘మ‌న‌’ పోరాటం

'Our' fight against gender discriminationఅక్కడ అమ్మాయిలు తమ అన్నదమ్ముల కోసం తిండి నుండి విద్య వరకు ప్రతిదీ త్యాగం చేస్తారు. లింగ వివక్షను అడుగడుగునా అనుభవిస్తూనే ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు అత్యంత చిన్న వయసులోనే పెండ్లి చేసి పంపుతారు. అలాంటి సమాజంలో పుట్టిన అమ్మాయే మన మాండ్లేకర్‌. కానీ ఆమె మాత్రం దీనికి భిన్నంగా ఉంది. తనతోటి అమ్మాయిలు నేడు పాఠశాల విద్య పూర్తి చేసి హింసకు వ్యతిరేకంగా పోరాడేలా తీర్చిదిద్దుతుంది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…
ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘మన మాండ్లేకర్‌కు’ ఆమె పేరులోని సారాంశం ఏమిటో తెలుసుకుంది. హిందీలో ‘మన’ అంటే ‘తిరస్కరణ’ అని అర్ధం. తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆడపిల్లలను ఆమె కనకూడదని ఈమెకు ఈ పేరు పెట్టారు. తన తల్లిదండ్రులకు ఏడుగురు పిల్లలలో మన మాండ్లేకర్‌ ఐదవది. వారిలో ఇద్దరు మాత్రమే అబ్బాయిలు. ఆమె నివసించే మధ్యప్రదేశ్‌లోని అలంపూర్‌లో తన గ్రామం నుండి పట్టభద్రురాలైన మొదటి అమ్మాయి. అలాగే స్పోర్ట్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి అమ్మాయి కూడా.
తమలోని శక్తిని కనుగొని
గత ఏడేండ్లలో మాండ్లేకర్‌ తన సంస్థ టింకా సమాజిక్‌ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 76,000 మంది గ్రామీణ పిల్లలకు (వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలే) కరాటేలో శిక్షణ ఇచ్చింది. వీరిలో కొందరు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని అవార్డులను గెలుచుకున్నారు. దీని వల్ల అమ్మాయిలు తనమలోని శక్తిని కనుగొనడంతో పాటు, పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య చాలా రెట్లు పెరిగింది. అంతేకాదు మాండ్లేకర్‌ ఇచ్చిన ఈ శిక్షణతో బాల్య వివాహాల సంఖ్య కూడా తగ్గిపోయింది. ‘నేను ఎదుగుతున్నప్పుడు చేయలేనివన్నీ నా దగ్గర శిక్షణ పొందిన అమ్మాయిలు చేస్తారు’ అని ఆమె హెర్‌స్టోరీ అనే వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
తరిమికొట్టాలని
ఆమె సమాజంలోని చాలా మంది బాలికలు 14 లేదా 15 ఏండ్ల వయసులోనే వివాహం చేసుకోవల్సి వచ్చింది. అమ్మాయిలందరూ ఆ ఒత్తిడికి లొంగిపోయేవారు. కానీ పెండ్లి విషయంలో తనను బలవంతం చేస్తే తన జీవితాన్ని ముగించుకుంటానని మాండ్లేకర్‌ బెదిరించింది. గ్రామస్తులు 8వ తరగతి తర్వాత బాలికల విద్యను నిలిపివేసినప్పుడు మాండ్లేకర్‌ మాత్రం తన ఉన్నత తరగతులు కొనసాగించడానికి 9 కిలోమీటర్లు నడిచేది. కుటుంబాలలో, గ్రామంలో లైంగిక వేధింపులు విపరీతంగా ఉండేవి. వాటికి అదుపు లేకుండా పోయింది. చాలా మంది బాలికలు ఆ గాయాలతో ఒంటరితనంలోనే బతికేవారు. దీనికి భిన్నంగా మాండ్లేకర్‌ తనపై దాడి చేస్తున్న వారిని తరిమికొట్టాలని నిర్ణయించుకుంది. చాలా విజయాలు కూడా సాధించింది. అయితే ఈ విజయాలన్నీ ఎన్నో అగ్ని పరీక్ష తర్వాతనే వచ్చాయి.
భోజనాన్ని తగ్గించుకున్నాం
ఏడుగురు పిల్లలను పోషించడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న కుటుంబంలో పుట్టి పెరిగింది మాండ్లేకర్‌. ‘తిండి తినడానికి చాలా నోళ్లు ఉండేవి. అందుకే ఇంట్లోని మహిళలమైన నా తల్లి, నా అక్కచెల్లెళ్లు, నేను తినాల్సిన భోజనాన్ని తగ్గించుకున్నాం. ఆకలితో పడుకునేవాళ్లం. పాఠశాల కూడా మానేసి చిన్నవయసులోనే పెండ్లి చేసుకోవడం ద్వారా మా చదువుకు అయ్యే ఖర్చులను ఆదా చేసాము’ అని ఆమె చెప్పింది. 9వ తరగతి పూర్తి చేసిన తర్వాత మాండ్లేకర్‌ కూడా బలవంతంగా ఒక యువకుడితో నిశ్చితార్థం చేసుకోవల్సి వచ్చింది. కానీ వివాహం చేసుకున్న స్నేహితుల బాధాకరమైన కథలను విన్న ఆమె తల్లిదండ్రులతో గొడవ పడింది.
వివాహం అంటేనే భయం
‘గ్రామంలో 14 – 15 ఏండ్ల వయసు గల నా స్నేహితులు వారి అత్తమామల ఇంట్లో వారు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులను నాకు చెప్పేవారు. చిన్న చిన్న అపార్థాలు, భోజనంలో కొంచెం ఉప్పు ఎక్కువయ్యిందని విపరీతంగా కొట్టేవారు. ఇవన్నీ విన్న తర్వాత వివాహం అంటేనే చాలా భయపడ్డాను. నాకు పెండ్లి చేస్తానంటే నిరాశకు గురయ్యాను. అంతేకాదు అధిక రక్తపోటు, మూర్ఛతో అనారోగ్యానికి గురయ్యాను. దాంతో నా తల్లిదండ్రులకు నా ఇష్టాన్ని అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు’ అని ఆమె పంచుకుంది. పాఠశాల పూర్తి చేసిన తర్వాత మాండ్లేకర్‌ కాలేజీలో చేరింది. అక్కడ ఆమె మొదటిసారి కరాటే నేర్పుతున్న ఒక మహిళను కలిసింది. అప్పటి వరకు ఆమెకు స్త్రీ స్వతంత్రత గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే అదంతా ఆమెకు కొత్తగా అనిపించింది.
కోపం కట్టులు తెంచుకుంది
‘మా గ్రామంలో అమ్మాయిలు ఎల్లప్పుడూ సల్వార్‌లు ధరించి, ఆభరణాలు అలంకరించుకుని, బయటకు అడుగు పెట్టే ముందు పై నుండి కాలి వరకు తమను తాము కప్పుకునేవారు. కానీ ఇక్కడ ట్రాక్‌ ప్యాంటులో ఉన్న ఒక మహిళ కళాశాలలో నడుస్తోంది. నేను ఆమెను చూసి మొదట విద్యార్థి అనుకున్నాను. తప్పుగా భావించి ఆమెను ఎగతాళి కూడా చేసాను’ అని మాండ్లేకర్‌ గుర్తుచేసుకుంది. అప్పటి వరకు ఆమె సినిమాల్లో చూసిన దాన్ని బట్టి కరాటే అంటే పురుషులకు మాత్రమే పరిమితమైన చర్య అని భావించింది. అయితే కొన్ని తరగతులకు హాజరైన తర్వాత ఆమెతో పాటు ఆమె సమాజంలోని మహిళలు బస్సులలో, బహిరంగ ప్రదేశాలలో, వారి సొంత కుటుంబాల్లోనూ భరించిన లింగ ఆధారిత హింస గుర్తుకొచ్చి ఆమె కోపం కట్టులు తెంచుకుంది.
సంకల్పాన్ని రగిలించాయి
‘కుటుంబ సభ్యుల నుండి, పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి నుండి, రోడ్లపై నేను నిశ్శబ్దంగా లైంగిక వేధింపులను అనుభవించిన రోజులు చాలా ఉన్నాయి. ఈ విషయం గురించి మా అమ్మకు చెబితే దాని గురించి మాట్లాడవద్దని అనేది. కానీ నా కరాటే గురువు రితేష్‌ తివారీ సర్‌, లైంగిక వేధింపుల కారణంగా ఒక యువతి తన ప్రాణాలను కోల్పోయిన సంఘటనతో కరాటే నేర్పించడం ప్రారంభించానని మాతో చెప్పేవాడు. ఇటువంటి వాతావరణంలో మేము మా అనుభవాల గురించి వీలైనంత ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం’ అని మాండ్లేకర్‌ పంచుకుంది. కరాటే నేర్చుకుంటున్న సమయం మాండ్లేకర్‌లో బలం, ఆత్మవిశ్వాసం కోరుకునే సంకల్పాన్ని రగిలించాయి. కరాటే నేర్చుకోవడం ఆమె జీవితంలో ఓ అద్భుతమైన మార్పుగా అవతరించింది. శారీరక పరాక్రమాన్ని మాత్రమే కాకుండా లోతైన సాధికారత భావాన్ని కూడా అందిస్తోంది. ఎనిమిది గంటలకు పైగా రోజువారీ సాధనలో పాల్గొని కరాటేలో ప్రావీణ్యం సంపాదించింది. అంతే కాకుండా తన గ్రామం నుండి ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిగా కూడా నిలిచింది.