ప్రైవేటుపై పోరాటమే ‘కాలంపై కవాతు’

పాలకులే ప్రైవేటు యజమానులైన వేళ ‘నేటి వ్యవస్థలో ఎన్ని అవస్థలో’… ఉన్నం వెంకటేశ్వర్లు రాసిన ‘కాలంపై కవాతు’ కవితాలోచనం చదివితే స్పష్టమవుతుంది.
ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలు కొంతమంది పిడికిళ్ళలో బిగిసుకుపోయి కనీస అవసరాలకు సైతం దూరమవుతున్న మెజారిటి ప్రజలు ఆకలి చావులు చస్తున్న కాలమిది. టెక్నాలజీ వారి హస్తగతమై ఉత్పత్తి కేంద్రాలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా పర్యావరణం విషపూరితమై పశుపక్షాదులు, క్రిమికీటకాలు సైతం శాశ్వతంగా నాశనమవుతున్న కాలమిది. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగం కేవలం కొతమంది లాభార్జన కోసమే అన్నట్టు మార్చుకున్నారు. మిగితా వ్యవస్థంతా ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నదీ నేటి ప్రపంచ ప్రైవేటు దళం… ఇలాంటి పరిస్థితుల్లో వెలువరించిన ఈ కవితాలోచనంలో అనేక కవితలు ప్రైవేటు వల్ల ఎదురవుతున్న కష్టాలు, జరుగుతున్న నష్టాలు, వాటిపై కవి లేవనెత్తిన చురకత్తుల్లాంటి ప్రశ్నలు పాఠకులను ఆలోచింప చేస్తాయి.
‘తప్పదు – కాలంపై కవాతు’ అంటూ రాసిన తన మొదటి కవితలోనే యుద్ధం అంటే రెండు పక్షాలమధ్య జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పక్షమే ఏక పక్షంగా దాడి చేస్తోంది… అందుకే …’సామాన్యుడిపై కార్పొరేట్‌ చేసే తిమింగలాల దాడి/ కార్పొరేట్లు మోసే పాలక బోయీల దాడి/ ఈ యుద్ధంలో జీవన విధ్వంసం ఉంది’… అంటాడు కవి. అందులోనే ‘ఇదిలాగే సాగితే ఆకలి బాంబులకు రాలే ప్రాణాలెన్నో/ కనపడకుండా ఏ వార్తల్లో లేకుండా కూలే జీవాలెన్నో… అంటూ దానికి విరుగుడుగా ‘ ఇప్పుడు కాలం ఇచ్చే పిలుపే మనిషికి కష్టాలకు మలుపు’ అంటాడు.
రెండవ కవితలో ఎంగిలాకు ఎగిరి వచ్చి ఒక సామాజిక శాస్త్రవేత్తకు విసిరే సవాళ్ళు ఒకవైపు కొత్త కిక్కెక్కిస్తాయి. మరోవైపు తల గోక్కునేలా తికమకపరుస్తాయి. సైంటిస్టుకు వల్లకాని ఈ చిక్కు ప్రశ్నకు కాలంపై కవాతు చేయడం మార్క్సిజం నేర్పిస్తుంది… అనే సూచన చేయడం కవి గొప్పతనం. ‘మెతుకు భారత యుద్ధం’ అనే కవితలో నిరుద్యోగ సమస్య ఎంతగా పీడిస్తుందో చూడొచ్చు. ‘ఆలోచి(వదిలే)ద్దామా’? లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు చేసి కొన్ని పతకాల పేర్లతో ప్రజలను మభ్యపెట్టడం, నిరుద్యోగులను బుజ్జగించడం… ఎలాగుంటుందో చూడొచ్చు. మొత్తంగా 54 కవితలున్న ఈ సంకలనంలో ఇంకా శ్రమ దోపిడి ఎలా జరుగుతుంది? మార్క్సిజం ఏం నేర్పుతుంది? అనే వాస్తవిక భావ తాత్పర్యాలనిచ్చే కవితలు పాఠకులను మళ్ళీ మళ్లీ చదివించేలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి రచనలు రచయిత నుంచి రావాలని ఆశిద్దాం…
– మహేష్‌ దుర్గే , 8333987858