– జగన్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మోడీకి భయపడుతున్నారు
– ఆ భయంతోనే వామపక్షాలకు బీఆర్‌ఎస్ దూరం
– చొక్కాలను మార్చినట్టు నేతలు పార్టీల మార్పు
– పినరయి విజయన్‌పై కేసులు సరికాదు
– బీజేపీని ఓడించడమే లక్ష్యం
– భువనగిరిలో మాకు మద్దతిస్తే..
– మిగతా 16 చోట్ల కాంగ్రెస్‌కు మద్దతు:సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ చౌరస్తాలో శనివారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి అధ్యక్షతన ‘బీజేపీని ఓడిద్దాం-ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుదాం’ నినాదంతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ప్రేమ కంటే బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. గడిచిన పదేండ్లలో కనీవిని ఎరుగని రీతిలో ధరలు పెరిగాయి కానీ వేతనాలు పెరగలేదన్నారు.
బీఆర్‌ఎస్ గడిచిన పదేండ్లలో కనీస వేతనం చట్టం మార్చలేదని రాఘవులు విమర్శించారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మూడు నల్ల చట్టాలు మళ్లీ వస్తాయని, కార్మికుల హక్కులను కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ జైలుకు పంపిస్తారని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక ఉద్యమాలు మరింత అవసరం అని చెప్పారు.
ఫుడ్ కార్పొరేషన్‌ను రద్దు చేస్తే రేషన్ బియ్యం కూడా అందవన్నారు. మైనార్టీల హక్కులను బీజేపీ కాలరాస్తోందన్నారు. బీజేపీ భయంతో బీఆర్‌ఎస్ కమ్యూనిస్టులను దూరం చేసుకున్నదన్నారు. ‘అయితే జేబులోకి.. లేదంటే జైలుకు’ అని కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు.
కమ్యూనిస్టులు అంటేనే పోరాటం అని చెప్పారు. ‘న్యూస్ క్లిక్’ వెబ్ ఛానెల్‌లో రైతుల ఉద్యమం గురించి ప్రచురించినందుకు యజమానిని జైల్లో పెట్టారని, మీడియాను ప్రశ్నించకుండా మోడీ భయపెడుతున్నారని అన్నారు.
మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తారని.. రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉంటారో ఆలోచించుకోవాలన్నారు. కేరళ సీఎం విజయన్‌పై కేసులు పెట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని.. ఆయన కూతురిపై కూడా కేసులు పెట్టారన్నారు. ఇలాంటి సందర్భంలో మనల్ని వదిలి పెడతాడనుకోవడం లేదన్నారు. కేరళ సీఎంను ఎందుకు అరెస్టు చేయడం లేదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని.. కేసులు పెట్టి జైల్లో వేయాల్సి వస్తే ముందుగా రేవంత్ రెడ్డి, సోనియా, రాహుల్ గాంధీని అరెస్టు చేయాలన్నారు. బీజేపీపై రేవంత్ రెడ్డికి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. జైలుకి వెళ్లాల్సిన లిస్టులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని అన్నారు. భువనగిరిలో తమకు కాంగ్రెస్ మద్దతు ఇస్తే మిగతా 16 చోట్ల ఆ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. జగన్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మోడీకి భయపడుతున్నారన్నారు.
సీపీఐ(ఎం) మినహా దాదాపు మిగతా పార్టీల నాయకులు చొక్కాలు మార్చినట్టుగా పార్టీలను మార్చుతున్నా రన్నారు. ఎలక్టోరల్ బాండ్లతో రూ.16 వేల కోట్లు రాగా.. ఇందులో బీజేపీకి రూ.8 వేల కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1700 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.1400 కోట్లు వచ్చినట్టు తెలిపారు. సీపీఐ(ఎం) ఒక్కటే అవినీతికి దూరంగా ఉందన్నారు.
రాష్టాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. జీఎస్టీ పన్ను మొత్తం ఢిల్లీకి వెళ్తే అందులో 30శాతం కూడా రాష్ట్రాలకు తిరిగి రావడం లేదని చెప్పారు. కేరళ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎప్పుడైనా ధర్నా చేసిందా అని ప్రశ్నించారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికతో నష్టం అన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. కార్మికులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. ఇండ్లు కట్టిస్తామని కేంద్రం పేదలను మోసం చేసిందన్నారు. అవినీతిపరులను బీజేపీలో చేర్చుకుని.. కాపాడుతోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, ఎర్ర అశోక్, చింతల యాదయ్య, వినోద, మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, జి.శ్రీనివాసులు, ఎన్ శ్రీనివాసులు, రాజశేఖర్, లక్ష్మణ్, సబితా, సృజన, ఎర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.