పోరాటం ముగిసింది

The fight is over– సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఓటమి
– చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
చాంగ్జౌ (చైనా) : చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో టీమ్‌ ఇండియా పోరాటం ముగిసింది. ప్రపంచ నం.2 జోడీ, మెన్స్‌ డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు నిరాశపరిచారు. బిడబ్ల్యూఎఫ్‌ 1000 టోర్నీలో టైటిల్‌ ఫేవరేట్స్‌గా బరిలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌.. మెన్స్‌ డబుల్స్‌ తొలి రౌండ్లోనే చతికిల పడ్డారు. వరల్డ్‌ నం.13 ఇండోనేషియా జోడీ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో అనూహ్య పరాజయం చవిచూశారు. 68 నిమిషాల మ్యాచ్‌లో 17-21, 21-11, 17-21తో భారత స్టార్స్‌ వెనుకంజ వేశారు. తొలి గేమ్‌లో విరామ సమయానికి 9-11తో వెనకబడిన సాత్విక్‌, చిరాగ్‌లు.. 12-12తో స్కోరు సమం చేశారు. కానీ ఆ తర్వాత ఇండోనేషియా జోడీ వరుస పాయింట్లు సాధించింది. అదే జోరులో 21-17తో తొలి గేమ్‌ ప్రత్యర్థి సొంతమైంది. కీలక రెండో గేమ్‌లో భారత స్టార్స్‌ పంజా విసిరారు. ఇండోనేషియా షట్లర్లను చిత్తు చేశారు. 11-2తో విరామ సమయానికి భారీ ఆధిక్యం సాధించిన సాత్విక్‌, చిరాగ్‌లు.. ద్వితీయార్థంలోనూ దుమ్మురేపారు. 21-11తో రెండో గేమ్‌ను అలవోకగా నెగ్గారు. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మనోళ్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆరంభం నుంచీ ఆధిక్యం నిలుపుకున్న ఇండోనేషియా షట్లర్లు మహ్మద్‌ ఫిక్రి, మౌలానా బగాస్‌లు ఒత్తిడిలో మెరుగైన ప్రదర్శన చేశారు. వరల్డ్‌ నం.2 జోడీపై విజయంతో ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు తేజం సిక్కి రెడ్డి, రోహన్‌ కపూర్‌లు పరాజయం పాలయ్యారు. తొలి రౌండ్లో 15-21, 16-21తో మలేషియా జోడీ చెన్‌, వీల చేతిలో ఓడారు. దీంతో ఈ ఏడాది చైనా ఓపెన్‌లో టీమ్‌ ఇండియా టైటిల్‌ వేటకు తొలి రౌండ్లోనే తెరపడింది. హెచ్‌.ఎస్‌ ప్రణరు, లక్ష్యసేన్‌లు సైతం మెన్స్‌ సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే ఓటమి చవిచూడగా.. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు ఆఖరు నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది.