పోరాటం ముగిసింది

– క్వార్టర్స్‌లో ఓడిన అమ్మాయిలు, అబ్బాయిలు
– థామస్‌ కప్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ 2024
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియా టైటిల్‌ డిఫెన్స్‌కు తెరపడింది. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మెన్స్‌ జట్టు 1-3తో పరాజయం పాలైంది. అగ్ర జట్టు చైనా అలవోక విజయంతో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మినహా మనోళ్లు అందరూ నిరాశపరిచారు. మెన్స్‌ సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 13-21, 21-8, 21-14తో లి షి ఫెంగ్‌పై మూడు గేముల్లో గెలుపొందగా.. హెచ్‌.ఎస్‌ ప్రణరు 21-15, 11-21, 14-21తో మూడు గేముల పోరులో షి యుకి చేతిలో నిరాశపరిచాడు. మెన్స్‌ డబుల్స్‌ తొలి మ్యాచ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 15-21, 21-11, 12-21తో లియాంగ్‌, వాంగ్‌ చాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 51 నిమిషాల ఉత్కంఠ పోరులో సాత్విక్‌, చిరాగ్‌లు వెనుకంజ వేశారు. మెన్స్‌ డబుల్స్‌ రెండో మ్యాచ్‌లో కపిల, సాయిప్రతీక్‌ జోడీ 10-21, 10-21తో వరుస గేముల్లో చేతులెత్తేసింది. ఐదో మ్యాచ్‌ అవసరం లేకుండానే చైనా 3-1తో క్వార్టర్‌ఫైనల్లో గెలుపొందింది. ఉబెర్‌ కప్‌లో అమ్మాయిలు సైతం నిరాశపరిచారు. క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌ చేతిలో 0-3తో ఓటమి పాలయ్యారు. టైటిల్‌ లేకుండానే స్వదేశానికి పయనమయ్యారు. వరుసగా తొలి మూడు మ్యాచుల్లోనే చేతులెత్తేసిన మనోళ్లు 0-3తో ఓటమి చెందారు. ఉమెన్స్‌ సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో అష్మిత చాలిహ 10-21, 22-20, 15-21తో మూడు గేముల పాటు పోరాడింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో అయ ఒహౌరి చేతిలో భంగపడింది. మహిళల డబుల్స్‌లో ప్రియ, శృతి మిశ్రా జంట 8-21, 9-21తో నమి, చిహరులకు వరుస గేముల్లో తలొంచగా.. మహిళల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో ఇషారాణి 15-21, 12-21తో నొజొమి ఒకుహరతో పోరాడి ఓడింది.