– తొలి రౌండ్లోనే షట్లర్ల పరాజయం
– కొరియా ఓపెన్ సూపర్ 500
సియోల్ (దక్షిణ కొరియా): 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం లేకుండా తిరిగొచ్చి స్టార్ షట్లర్లు నిరాశపరచగా.. వర్థమాన షట్లర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే టీమ్ ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. భారత షట్లర్లు అందరూ తొలి రౌండ్ మ్యాచ్‌లోనే పరాజయం పాలవగా భారత పోరాటం బుధవారంతో ముగిసింది. మహిళల సింగిల్స్‌లో అష్మిత చాలిహ, మాళవిక బాన్సోద్, ఆకర్షి కశ్యప్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరల్డ్ నం.53 అష్మిత చాలిహ కనీస పోరాటం చేయలేదు. వరల్డ్ నం.17 పొర్నపవీ చోచువాంగ్ చేతిలో 8-21, 13-21తో వరుస గేముల్లో చేతులెత్తేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అష్మిత ఏమాత్రం పోటీతత్వం చూపించలేదు. మరో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 15-21, 15-21తో వరుస గేముల్లో డెన్మార్క్ షట్లర్ లినె క్రిస్టోపర్సెన్ చేతిలో పరాజయం పాలైంది. వరల్డ్ నం.41 మాళవిక బాన్సోద్ మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్‌లో పోరాడి ఓడింది. వరల్డ్‌నం.18 డెన్మార్క్ షట్లర్ చేతిలో 21-18, 15-21, 17-21తో గట్టి పోటీ ఇచ్చినా ఓటమి తప్పలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆయుశ్ రాజ్ గుప్తా, శతి 7-21, 12-21తో కొరియా జోడీ చేతిలో ఓటమి చెందింది. భారత స్టార్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ జోడీ సహా పి.వి సింధు, లక్ష్యసేన్‌లు ఒలింపిక్స్ అనంతరం విరామం తీసుకున్నారు. కొరియా ఓపెన్ బరిలో నిలువలేదు. యువ షట్లర్లు పోటీలో నిలిచినా ఎవరూ తొలి రౌండ్ దాటి ముందంజ వేయలేకపోయారు.