పోరాటం ముగిసింది!

The fight is over!– లక్ష్యసేన్‌, సాత్విక్‌ జోడీ పరాజయం
– ఇండోనేషియా మాస్టర్స్‌ 500
జకర్తా (ఇండోనేషియా): ప్రపంచ బ్యాడ్మింటన్‌ సీజన్‌ ఆరంభం భారత షట్లర్లకు కలిసి రావటం లేదు. ఇండోనేషియా మాస్టర్స్‌ 500 టోర్నీలో భారత షట్లర్లు ఎవరూ కనీసం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోలేదు. మహిళల సింగిల్స్‌లో తొలి రోజే ఆశలు ఆవిరి కాగా.. ఇతర విభాగాల్లో ప్రీ క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరేట్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ నిరాశపరిచింది. థారులాండ్‌ షట్లర్ల చేతిలో 20-22, 21-23తో వరుసగా రెండు గేముల్లో టైబ్రేకర్లలో తడబాటుకు గురయ్యారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. 16-21, 21-12, 21-23తో జపాన్‌ స్టార్‌ కెంటా నిషిమోటో చేతిలో లక్ష్యసేన్‌ పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌లో ఓడినా.. రెండో గేమ్‌ను అలవోకగా నెగ్గిన లక్ష్యసేన్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల డబుల్స్‌లో తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్ప జంట 21-13, 22-24, 18-21తో మూడు గేముల మ్యాచ్‌లో మలేషియా అమ్మాయిల చేతిలో ఓటమి చెందారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టోలు 21-18, 15-21, 19-21తో ప్రీ క్వార్టర్స్‌లో నిరాశపరిచారు.