ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు

సంతోష్‌ శోభన్‌ హీరోగా, రాశీ సింగ్‌, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మించిన ఈ చిత్రంతో రైటర్‌ అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సంతోష్‌ శోభన్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో కళ్యాణ మండపం మీద క్లైమాక్స్‌ ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్కడకు హీరో వచ్చి హీరోయిన్‌కి, ఆమె ఫాదర్‌కి కలిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడు. కానీ.. అక్కడొకడు మిగిలిపోతాడు. వాడి పరిస్థితేంటో తెలీదు.. ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని అప్పులు చేశాడో..బట్టలు ఎలా కొనుకున్నాడో?.. అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాడిపై దర్శకుడు అభిషేక్‌ చేసిన సినిమానే ‘ప్రేమ్‌ కుమార్‌’. వందేళ్ల భారతీయ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్‌, ఎన్నో సినిమాలు వచ్చాయి. ఓ ఆర్టిస్ట్‌ లైఫ్‌లో ఇప్పటి వరకు చెప్పని కథో, ఎవరు చేయని పాత్రను ఎలివేట్‌ చేయటం అనేది పూర్తిగా కొత్తగా ఉంటుంది. ప్రేమ్‌ కుమార్‌ అనే యువకుడు అతి తెలివి. అది వాడికి పనికి రాదు. దురదష్టవంతుడు. ఏది స్టార్ట్‌ చేసినా వర్కవుట్‌ కాదు. చివరకు అనేక రిస్కులు చేసి పెళ్లి చేసుకుంటాడు. అభిషేక్‌ కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా చేశాడు. తర్వాత దర్శకుడు కావాలని అనుకున్నప్పుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. డైరెక్టర్‌గా ముందు తను నన్ను నమ్మాడు. అలాగే నాకు కథతోపాటు క్యారెక్టర్‌ బాగా నచ్చింది. పైగా ఇందులో కామెడీ బాగా ఉంది. ఎప్పటికప్పుడు భిన్నమైన సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రైట్‌ థియేట్రికల్‌ సక్సెస్‌ రాలేదు. నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. కానీ ఈ సినిమా ఆ కొరతను తీరుస్తుందని అనుకుంటున్నాను. ఇందులో నా బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. జంధ్యాల, వంశీ, ఇవివి.. స్టైల్‌లో ఆకట్టుకుంటుందనుకుంటున్నాను. ప్రస్తుతం యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మరో సినిమా ఉంటుంది. త్వరలోనే వీటి వివరాలు చెబుతాను.
పెళ్లి పై సినిమాలు చేస్తుంటే మీ పెళ్లి గురించి ఇంట్లో అడగటం లేదా అనేది చాలా మంది అడుగుతున్నారు. అయితే మా ఇంట్లో దీనికి భిన్నంగా నెక్ట్స్‌ సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పటికైతే పెళ్ళి ఆలోచన అస్సలు లేదు. పెళ్లి బట్టలు చూస్తుంటే డిప్రెషన్‌ వచ్చేస్తుంది.. పెళ్లి తతంగం వద్దనిపిస్తుంది. చేసుకుంటే రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటాను (నవ్వుతూ).