చిత్ర పరిశ్రమ ఇలాంటివి సహించదు

The film industry will not tolerate such thingsరాజకీయ లబ్ది కోసం చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తులపై, వారి జీవితాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఇకపై సహించేది లేదని తెలుగు చిత్ర పరిశ్రమ స్పష్టం చేసింది. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్‌ గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ ఇండిస్టీ విల్‌ నాట్‌ టోలరేట్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
త్వరితగతిన వార్తల్లో వైరల్‌ అయ్యేందుకు సినీ పరిశ్రమ సభ్యులను సాప్ట్‌ టార్గెట్‌గా చేసి మాట్లాడటం సిగ్గు చేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలతో దాడులు చేయడం చిత్ర పరిశ్రమ నుంచి ఏకతాటిపై వ్యతిరేకిస్తున్నాం. – చిరంజీవి
రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులో భాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. – వెంకటేష్‌
ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి.
– మహేష్‌బాబు
వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. బాధ్యతా రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం.
– ఎన్టీఆర్‌
ఇది అవమానకర చర్య. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లాగకూడదు. – రవితేజ
సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. – అల్లు అర్జున్‌
హుందాతనాన్ని నిలబెట్టుకోండి. గౌరవప్రదంగా వ్యవహరించండి. నిరాధార ఆరోపణలు సహించ లేనివి. – దర్శకుడు రాజమౌళి
ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా ఒక మహిళ గురించి చెడుగా మాట్లా డటం ఆమోదయోగ్యం కానిది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇలాంటి ప్రవర్తనను మేం సహించం. – వరుణ్‌తేజ్‌
rakul-preet-singhమహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. నా పేరును హానికరమైన రీతిలో మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం వదిలేయాలని కోరుతున్నాను. కళాకారులను, సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచాలి. రాజకీయ విమర్శల కోసం, న్యూస్‌ హెడ్‌లైన్‌ల కోసం అర్థం లేని అంశాలలోకి మమ్మల్ని లాగకండి.
– రకుల్‌ ప్రీత్‌సింగ్‌