అతి చిన్న వయస్కుడికే ఆస్కార్‌ అందించిన చిత్రం

The film that gave Oscar to the youngestకొన్ని సినిమాలు మనిషికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని గొప్ప అనుభూతులను మిగులిస్తాయి. కొన్ని మనకే అర్ధం కాని చాలా ప్రశ్నలకు, మనం భయపడి మనసు అట్టడుగున మూసి పెట్టిన జీవిత వాస్తవాలను వెలికితీసి అంతులేని ఆలోచనలకు బీజం వేస్తాయి. అత్యంత అలజడిని కలిగించిన గొప్ప చిత్రాలలో సినీ అభిమానిగా నేను మరచిపోలేని చిత్రం ‘ఆర్డినరీ పీపుల్‌’. అంతా గొప్పగా ఆనందంగా కనిపించే కుటుంబాలలోని భయంకరమైన వాస్తవ నిజాలను వాటి మధ్య నిరంతరం నలిగిపోయే వ్యక్తుల మానసిక సంఘర్షణను అర్ధవంతంగా ప్రస్తావించగలిగిన అతి తక్కువ చిత్రాలలో ఇది ఒకటి.

అమెరికాలో ఓ అత్యంత సంపన్నమైన కుటుంబ కథ ఇది. జారెట్స్‌ ది అందమైన కుటుంబం. అందమైన ఇల్లు, గొప్ప జీవితం, ఒకరి పై ఒకరికి ఎంతో ప్రేమ ఉన్న చక్కని కుటుంబం అది. చూసేవారికి వారి జీవితం పట్ల ఈర్ష్య కలుగుతుంది. పైగా ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం కావడాన జీవితంలో మనిషికి కావలసిన అన్ని సుఖాలు, సౌకర్యాలు వారికి అందుబాటులో ఉంటాయి. దేనికీ కష్టపడవలసిన అవసరం లేని అదష్టవంతులుగా నలుగురూ గొప్పగా ప్రస్తావించుకుంటూ ఉంటారు.
ఒక రోజు ఆ దంపతుల టీనేజ్‌ కుమారులు ఇద్దరూ పడవ ప్రమాదానికి గురి అవుతారు. ఇద్దరిలో పెద్దవాడు బక్‌ చురుకైన వాడు, అందగాడు, శారీరికంగా శక్తిమంతుడు. ఇతను ప్రమాదంలో మరణిస్తాడు. ఆ ఇంటి సభ్యులకు ఇది అతి పెద్దదెబ్బ. రెండవ కుమారుడు కాన్రాడ్‌కి అన్న పై ఎంతో ప్రేమ. అతని దష్టిలో అన్న హీరో. కాని ఈ ప్రమాదంలో అన్న చనిపోయి తాను బతికి ఉండడం అతను తట్టుకోలేడు. మనసికంగా కృంగిపోతాడు. ఆ సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఇది ఆ కుటుంబానికి మరో దెబ్బ. సమయానికి కాన్రాడ్‌ని గమనించిన అతని తండ్రి కాల్వెన్‌ బిడ్డను సరైన సమయానికి హాస్పటల్‌కి తీసుకెళ్లడంతో అతను చావు నుండి బయట పడతాడు. ఓ నాలుగు నెలలు సైకియాట్రి హాస్పిటల్‌లో ఉండి తర్వాత ఇంటికి వస్తాడు.
కథ ప్రారంభం ఈ పై సంఘటనలన్నీ జరిగిపోయిన తరువాత మొదలవుతుంది. బెత్‌ కాన్రాడ్‌ తల్లి. ఆమె జరిగిన విషాదాలన్నీ మరచి మామూలుగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంటిని కడిగిన ముత్యంలా పెడుతుంది. దైనిక జీవితంలో ప్రతిదీ పద్ధతిగా పొందికగా జరిగిపోతూ ఉంటుంది. ఇంటి అలంకరణ నుండి ప్రతి రోజు తినే భోజనం దాకా ఏదీ తక్కువ కాకుండా అతి చక్కని ప్రణాళికతో ఆమె జరిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏ విభేదాలు లేకుండా అతి మామూలుగా వారి సంసారం సాగుతూ ఉంటుంది. కాని కాన్రాడ్‌ ఆ క్రమబద్దమైన జీవితంలో కూడా తీవ్ర అభద్రతకు గురవుతుంటాడు. అతనికి ఆశించిన ప్రేమ, దగ్గరితనం దొరికీ దొరకనట్లు ఉండడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాడు. ఎక్కడ ఏం తేడా ఉందో వెతికినా అర్ధం కాదు. కాని ఏదో సరిగ్గా లేదన్న అలజడి అతన్ని నిత్యం బాధిస్తూ ఉంటుంది. తండ్రి సహాయంతో డా|| బర్గర్‌ అనే సైకియాట్రిస్ట్‌ని కాన్రాడ్‌ కలుస్తూ ఉంటాడు. మొదట అతనికి డాక్టర్ని కలవడం ఇష్టముండదు. కాని స్నేహితులు, కుటుంబం ఏదీ తనది కాదని అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఆ ఒంటరితనం తట్టుకోలేక తప్పని పరిస్థితులలో డాక్టర్‌ సహాయం తీసుకుంటాడు.
కాల్విన్‌ భార్యను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ కాన్రాడ్‌కి దగ్గరవడానికి కష్టపడుతూ ఉంటాడు. కొడుకుని మందలిస్తే అతను మరోసారి బలహీనపడతాడేమో అని రోజువారి పనులలో కాన్రాడ్‌ చూపే అలసత్వాన్ని భరిస్తూ అతన్ని అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు.
బెత్‌కు మొదటి కొడుకుపై ఎంతో ప్రేమ. అతని మరణం ఆమెలోని తల్లి హదయాన్ని చిదిమేస్తుంది. మొదటి కొడుకు చనిపోవడం, రెండవ కొడుకు ఆ ప్రమాదంలో బతికి బైటపడడం కాన్రాడ్‌పై ఆమెకే తెలియని కోపాన్ని నింపుతుంది. ఇది ఆమెకే తెలియకుండా కాన్రాడ్‌తో ఆమె ప్రవర్తించే విధానంలో బైట పడుతూ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌ చేయనన్న కొడుకు ప్లేట్‌ను తీసేసి ఆ ఆహారాన్ని సింక్‌ లో పడేయడం, అతనితో ఫొటో దిగవలసిన సమయంలో ఇష్టపడకపోవడం, కాన్రాడ్‌కి అన్నీ అమరుస్తూనే భర్త కొడుకుని కోపగించవల్సిన సమయాలలో కూడా అతి ప్రేమను ప్రదర్శిస్తున్నాడని అసహనానికి గురి కావడం, ఇలాంటి సంఘటనల వల్ల ఆ ప్రమాదంలో తాను ప్రాణంగా ప్రేమించిన పెద్ద కొడుకు మరణాన్ని బతికి బైట పడిన చిన్న కొడుకుపై కోపంగా ఆమె మార్చుకున్నదని ప్రకటితమవుతుంది.
ప్రమాదం గురించి కాన్రాడ్‌లో కూడా అభద్రతా భావం ఉంటుంది. తన కళ్ల ముందే అన్న నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే తాను అతన్ని రక్షించలేకపోయానని, అన్న కొట్టుకుపోయినా తాను దొరికిన పడవను ఆధారం చేసుకుని బతికే ప్రయత్నం చేశానని అతనికి గుర్తుకు వచ్చిన ప్రతిసారి తీవ్ర అలజడికి గురవుతాడు. ఈ అలజడే అతని ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం. కాని తన మనసులోని అలజడిని బైట పెట్టుకోవడం అతనికి చేతకాదు. అన్న చనిపోయి తాను బతికి ఉన్నానన్నభావన అతన్ని నిత్యం లోలోన తినేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో తల్లి దగ్గర ఇంకా దగ్గరితనాన్ని కోరుకుంటాడు. కాని బెత్‌ ఈ విషాదాన్ని తీసుకున్న విధానం మరోలా ఉంటుంది. ఆమెను పెద్ద కొడుకు మరణం ఎంతలా కుదిపేస్తుందంటే, ఇక ఆమె హృదయం ఎవరినీ ప్రేమించలేని స్థితికి చేరుకుంటుంది. పైకి అన్నీ మామూలుగా చేస్తున్నా తనను తాను ఈ సున్నితమైన అనుభూతుల నుండి దూరం జరిపేసుకుంటుంది. బైటపడని ఆమెలోని దు:ఖం కాన్రాడ్‌పై కోపంగా మారుతుంది. ఇది కాన్రాడ్‌కి మాత్రమే అర్ధం అవుతూ ఉంటుంది. తల్లి తనను మునుపటిలా ప్రేమించలేదని అతనికి అర్ధం అయి ఇంకా కుచించుకుపోతూ ఉంటాడు.
కాన్రాడ్‌ మంచి ఈతగాడు. కాని అన్న మరణం, తరువాత అతనిలో ఆవహించిన ఒంటరితనం, అపరాధ భావం ఈత పట్ల విముఖతగా మారుతాయి. దీనితో అతను కోచ్‌ ఎంత ప్రోత్సహిస్తున్నా వినకుండా ప్రాక్టీస్‌కు వెళ్ళడం మానుకుంటాడు. ఒకసారి తనతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మరో స్నేహితురాలిని కలుసుకుంటాడు. ఆమె ఎంతో ఆనందంగా స్వేచ్చగా ఉండడం చూసి తాను అలా ఉండలేకపోతున్నానని బాధపడతాడు. సైక్రియాటిస్ట్‌తో జరిపే సంభాషణలో తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తన క్లాస్‌మేట్‌తో స్నేహం అతనికి కాస్త ఊరట కలిగిస్తుంది.
ఇంట్లోని వాతావరణం కొడుకులోని అలజడి కాల్విన్‌ని ఆలోచనలలో పడేస్తుంది. భార్యను లోతుగా గమనిస్తాడు. తాను కొడుకుకు దగ్గరవాలని ప్రయత్నిస్తున్న సందర్భాలలో భార్య ప్రదర్శించే కోపం అసహనం అతన్ని ఇబ్బంది పెడతాయి. చిన్న కొడుకు ఎప్పుడూ లోతుగా ఆలోచించే వాడని, అతనికి కొడుకు చిన్నప్పటి సంఘటనలు గుర్తుచేస్తూ ఉంటాయి. మనసులో అలజడిని స్పష్టపరుచుకోవడానికి అతనికి కూడా సైక్రియాటిస్ట్‌ అవసరం ఏర్పడుతుంది. కొడుకు వెళ్ళే డాక్టర్‌ దగ్గరకే తానూ వెళ్ళి అతనితో తన మనసులోని అలజడిని, తనకున్న అనుమానాలను పంచుకుంటాడు. అక్కడ అతనికి తమ జీవితంలోని లోటు అర్ధం అవుతుంది. తాము విషాదాన్ని కప్పి ఉంచుకునే ప్రయత్నంలో ఒకొకరం ఒకోలా ప్రవర్తిస్తున్నామని, సరయిన సంభాషణ తమ మధ్య జరగట్లేదని అర్ధం అవుతుంది. తాము కలిసి ఉంటున్నా, తమలో ఒకరి పట్ల మరొకరికి నమ్మకం లేదని, అదే తమలోని సంఘర్షణకు కారణం అన్నది అతనికి స్పష్టంగా అర్ధం అవుతుంది.
కాన్రాడ్‌కి తాను సంతోషంగా ఉందని అనుకున్న స్నేహితురాలు కారెన్‌ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. అతను విపరీతమైన అలజడికి లోనవుతాడు. అర్ధరాత్రి డాక్టర్‌కి ఫోన్‌ చేసి తాను భరించలేని స్థితిలో ఉన్నానని మాట్లాడాలని చెప్పినప్పుడు, అతని గొంతులోని భయం, వేదన అర్ధం చేసుకున్న డాక్టర్‌ అతని కోసం అర్ధరాత్రి క్లీనిక్‌కి వస్తాడు. తనలోని అలజడి నిజాయితీగా బయటకు రాకపోతే తాను కూడా ఎక్కువ రోజులు జీవించలేనని తెలుసుకున్న కాన్రాడ్‌ డాక్టర్‌ దగ్గర తన మనసులో ఆ ప్రమాదం కారణంగా ఏర్పడిన అపరాధ భావాన్ని బైట పెట్టుకుంటాడు. అన్న నీళ్ళలో కొట్టుకుపోతే తాను చూస్తూ తనను తాను కాపాడుకోవడం తనను తినేస్తుందని తెలుసుకుంటాడు. అప్పుడు డాక్టర్‌ అతనితో… అన్న కంటే అతనే బలవంతుడయి ఉండవచ్చని, అందుకే అతను జీవించగలిగాడని ఆలోచించమని చెబుతాడు. తమ మనసులో ఏర్పడ్డ అభిప్రాయాల ఆధారంగా అన్ని సంఘటనలను చూడకూడదని, అందరూ అనుకున్నట్లు బక్‌ బలవంతుడు కాకపోయి ఉండవచ్చని అందుకే ఆ నీళ్ళల్లో తనను తాను కాపాడుకోలేకపోయాడని దీన్ని అంగీకరించలేక మరో విధంగా ప్రమాదాన్ని విశ్లేషించుకుని కాన్రాడ్‌ తనకు తాను అన్యాయం చేసుకుంటున్నాడని డాక్టర్‌ వివరించి చెబుతాడు. తల్లిలోని సంఘర్షణను కూడా కాన్రాడ్‌ అర్ధం చేసుకునే స్థితికి చేరుకుంటాడు.
ఇంత్లో బెత్‌, కాల్విన్‌ల మధ్య ఇదే విషయం మీద వాదన మొదలవుతుంది. ఎవరినీ ప్రేమించలేని స్థితికి బెత్‌ చేరిందని ఆమెతో అంటాడు కాల్విన్‌. అది విన్న బెత్‌ నిర్ఘాంత పోతుంది. ఇల్లువదిలి వెళ్లిపోతుంది. కాన్రాడ్‌, కాల్విన్‌ ఇద్దరూ తమలోని విషాదాన్ని సరయిన పంథాలో పంచుకుంటుండగా చిత్రం ముగుస్తుంది.
ఇటువంటి కథతో మన దేశంలో సినిమా తీయగలగడం ఎంతో కష్టం. దాన్ని ప్రజలు మెచ్చడం అంతకన్నా కష్టం. ఇలాంటి సినిమాల అవసరం మనకు చాలా ఉంది. కాని మన సినిమా సంస్కృ‌తి ఇటువంటి చిత్ర నిర్మాణాలకు దూరం. ఏదేమైనా, ఈ సినిమా కలిగించే అలజడి మాత్రం మనకు ఎంతో అవసరం. చుట్టూ ఉన్న బంధాల వలన మనలో కలిగే అశాంతికి జవాబులు వెతుక్కోవడంలో ఈ కథనం ఉపయోగపడుతుంది. నిజంగా మన కుటుంబంలో మనం ప్రదర్శించుకునే ప్రేమలు, అభిమానాలలో ఎంతో డొల్లతనం ఉంటుంది. కుటుంబ ప్రేమల్లో ఎన్ని విషయాలనో కప్పి పుచ్చుకుని జీవిస్తాం. సరైన సంభాషణ మన మధ్య జరగదు. మాట్లాడవల్సిన విషయాలను వదిలి ఏవో మాట్లాడుకుంటాం. పరిపూర్ణంగా జీవిస్తున్నాం అనుకుంటూ అసంపూర్ణమైన జీవితాల నడుమ నిత్యం యుద్ధం చేస్తూ ఉంటాం. మన మనసు నిజం చెప్పకుండా ఉండాలని దానిలోని నిజాలను అదిమి పెట్టి పైకి అబద్దాలను నటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటాం.
తన కిష్టమైన కొడుకు చనిపోవడంతో బెత్‌ ఆ ప్రమాదంలో బైటపడిన రెండవ కొడుకు పై కోపాన్ని పెంచుకుంటుంది. కానీ ఆ కోపం అదే విధంగా బైటపడితే అది తల్లిగా తప్పవుతుందని ఆమె నిరంతరం ఆ కోపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తుంది. కాని అది బైట పడుతూనే ఉంటుంది. పైకి ఒకలా నటిస్తూ మరో పక్కన తన కోపాన్ని బైట పెట్టుకోలేక ఆమె వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. దీని వలన కాన్రాడ్‌ నలిగిపోతూ ఉంటాడు. బెత్‌ తన విషాదానికి చికిత్స చేసుకునే ప్రయత్నం చేయదు. గాయపడిన మనసుకు చికిత్స అవసరం. కాని ఆ గాయాన్ని కప్పి మామూలుగా జీవించడానికి చేసే ప్రయత్నం ఒక అసహజమైన స్థితికి తీసుకెళుతుంది. ఆ అసహజ స్థితి మన చుట్టూ ఎన్నో కుటుంబాలలో ఉంది. ఆ స్థితిలోనే అందమైన కుటుంబాలు చాలా నివసిస్తూ ఉంటాయి. ఈ అసహజ స్థితికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఈ కుటుంబంలో ఆ స్థితికి కారణం పెద్ద కుమారుడి మరణం. మన చుట్టూ ఉన్న కొన్ని కుటుంబాలలో ఇలాంటి స్థితికి కారణం మరొకటి కావచ్చు. కాని మానవ సంబంధాల మధ్య ఏర్పడే దూరం గురించి సరయిన పద్ధతితో, కుటుంబీకుల మధ్య చర్చ జరగడం అవసరం. అది జరగకపోవడం వలన పెరిగే దూరం ఆ బంధాల నడుమ ఏర్పడే అశాంతి వారిని ఒంటరి చేస్తుంది. అందుకే అందంగా కనిపించే బంధాల నడుమ ఒంటరిగా మిగిలే వ్యక్తుల సంఖ్య నాగరిక ప్రపంచంలో ఎక్కువ. దీన్ని పరిష్కరించకుండా ప్రశాంతమైన నగరాలను నిర్మించలేం.
ఈ చిత్ర కథ సంక్లిష్టమైనది. కాని దీన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు హాలివుడ్‌ ప్రఖ్యాత నటుడు రాబర్డ్‌ రెడ్ఫోర్డ్‌. అప్పటిదాకా నటుడిగా విశ్వరూపం చూపిన ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ఇది. కాన్రాడ్‌ పాత్రలో నటించిన టిమోతి హట్టన్‌ ఇరవై ఏళ్ళ వయసులోనే ఉత్తమ సహాయక నటుడిగా ఆస్కార్‌ పొంది చరిత్ర సష్టించాడు. ఈ సినిమాకు ఈ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లేకు ఆస్కార్‌ అవార్డులు లభించాయి. కాల్విన్‌ పాత్రలో డొనాల్డ్‌ సథర్లాండ్‌, సైకియాట్రిస్ట్‌గా జడ్‌ హిర్చ్‌, గొప్ప నటనను ప్రదర్శించారు. కాని బెత్‌ పాత్రలో నటించిన మేరీ టైలర్‌ మూర్‌ ఆ పాత్రలో జీవించిన విధానం చారిత్రాత్మికం. టీవీ నటి అయిన ఆమె ఈ పాత్రలో చూపిన భావాలు మనసును కదిలిస్తాయి. మనలోని నిజమైన భావాలను దాచి పెట్టుకుని పైకి మామూలుగా జీవించే వ్యక్తులు పడే నరకాన్ని ఆమె నటనలో చూసి తీరవలసిందే.

– పి.జ్యోతి, 98853 84740

The film that gave Oscar to the youngest