గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి పై అధిష్టానానిదే తుది నిర్ణయం..

– గోల్కొండ జిల్లా బీజేపీ ముఖ్య నాయకుల వెల్లడి..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గోషామాల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా అధిష్టానం ఎవరు పేరును ఖరారు చేయలేదని గోషామాల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, గోల్కొండ జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు వెల్లడించారు. ఈ మేరకు గురువారం గౌలిగూడలోని గోల్కొండ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రఘునందన్ యాదవ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండు యాదవ్ గన్ ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ బేగంబజార్ డివిజన్ కార్పొరేటర్ శంకర్ యాదవ్. గోషామహల్ డివిజన్ కార్పొరేటర్ లాల్ సింగ్ లు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో చేరే వాళ్ళకి అధిష్టానం ఎటువంటి హామీలు ఇవ్వదని, పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరే వారిని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెబుతుందని అన్నారు.అభ్యర్థిత్వంపై అధిష్టానం ప్రకటన లేకుండానే ఈ మధ్యకాలంలో పార్టీలోకి వలస వచ్చిన ఒక నేత తానే గోషామాల్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే నంటూ నిత్యం ప్రచారం చేసుకుంటున్నారే తప్ప, పార్టీ అభివృద్ధికి ఏమాత్రం సహాయ పడటం లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను గందరగోళానికి గురి చేయటం మానుకోవాలని ఆ నేతకు స్పష్టం చేశారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారినే బీజేపీ అధిష్టానం గుర్తిస్తుంది  తప్ప, పూటకో మాట మాట్లాడే పారాచూట్ నాయకులకు ఇక్కడ స్థానం ఉండదని హితవు పలికారు.బిజెపి పార్టీ అంటేనే దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు. ఇవేవీ చేయకుండా మీడియాల్లో నిత్యం కనపడి తనకు తాను ఒక గొప్ప లీడర్ గా భావించుకుంటే వారికి పార్టీలో పుట్టగతులు ఉండవని వెల్లడించారు.గోషామహల్ లో దశాబ్దాలుగా పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసి బీజేపీకి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చిన తమను సంప్రదించకుండా అధిష్టానం గోషామహల్ కు అభ్యర్థిని ప్రకటించదని స్పష్టం చేశారు. సిద్ధాంతం మేరకు పార్టీ అభివృద్ధికి కష్టపడుతున్నటువంటి వ్యక్తులనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న గ్లోబల్ ప్రచారాలను నమ్మి కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని వెల్లడించారు.ఎవరైనా పార్టీ అగ్రనేతల పేరు చెప్పుకొని మీడియాలలో ప్రచారం చేసుకుంటే చివరకు వారికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు నమ్మరునే విషయాన్ని వారు తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరైనా కార్యకర్తలు, నాయకుల ఇండ్లకి వచ్చినంత మాత్రాన, పార్టీ ఎవరి సొంతం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని  మీడియా ముఖంగా వెల్లడిస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠానికి, అభివృద్ధికి జరిగే కార్యక్రమాలపై పార్టీ క్యాడర్ అయోమయానికి గురికాకుండా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కృష్ణ. బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, రమేష్, రమేష్, వి గోపాల్, డి నరహరి, రామకృష్ణ (కట్టప్ప), బి సంతోష్, అనిల్ యాదవ్, సందీప్ సింగ్, సుధాకర్, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.