– సింగిల్ జడ్జి తీర్పును
– రద్దు చేసిన డివిజన్ బెంచ్
– ఎమ్మెల్యేల అనర్హత కేసులో హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ తన విధులను నిర్వహించాలని పేర్కొంటూ కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగం లోని పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మెన్‌గా స్పీకర్‌కు లభించిన అధికార విధులను తగిన సమయంలోగా పూర్తి చేయాలని కోరింది. ఐదేళ్ల శాసనసభ్యుల పదవీ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని చెప్పింది. రాజ్యాంగ నిర్ధేశాలను పరిగణనలోకి తీసుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో విధిగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఐదేండ్ల అసెంబ్లీ గడువును కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలంటూ సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోబోేవని తేల్చి చెప్పింది. రాజ్యాంగపరంగా స్పీకర్‌ది అత్యన్నత స్థాయి పదవనీ, ఆ పదవిలో విధులు నిర్వహించే వారికి కోర్టులు ఉత్తర్వులు జారీ చేయబోవని స్పష్టం చేసింది. రాజ్యాంగ బద్ధంగా స్పీకర్ రూల్ ఆఫ్ లా మేరకే విధులు నిర్వహిస్తారనీ, అయితే, పిటిషన్లపై విచారణ పూర్తి చేసే బాధ్యత ఆయనదేనని వెల్లడించింది. స్పీకర్ ముందున్న ఆ పిటిషన్ల విషయంలో కోర్టులు జోక్యం చేసుకునేందుకు రాజ్యాంగం వీలుకల్పించలేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వేర్వేరు కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం కూడా స్పీకర్‌కు కోర్టులు ఆదేశాల జారీకి ఆస్కారమే లేదని వెల్లడించింది. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కొద్ది రోజులకే కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు 78 పేజీల తీర్పును వెలువరించింది. కడియం, తెల్లంలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలనే పిటిషన్‌ను స్పీకర్‌కు ఇచ్చేందకు ప్రయత్నిస్తే ఫలితం లేకపోయిందంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లు రెంటింటిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
న్యాయ సమీక్షకు వీల్లేదు: ప్రభుత్వం
స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. కానీ, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. అడ్మినిస్ట్రేటీవ్, లెజిస్లేటీవ్, ట్రిబ్యునల్ చైర్మెన్‌గా.. స్పీకర్ పలు కీలక విధులు నిర్వహిస్తారు. స్పీకర్ ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎరబ్రెల్లి దయాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది. ఆయనకు ఆదేశాలు జారీ చేసే అధికార పరిధి కోర్టులకు లేదు. స్పీకర్‌కు కనీస గడువు ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే స్వేఛ్చ రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చింది’ అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయ వాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంద్యాల రవిశంకర్ వాదించారు.