– ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందనీ, ఈ విషయం తెలిసే ఛాలెంజ్‌గా ఆర్థికశాఖను ఎంచుకున్నానని ఆ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనీ, దాన్ని సరిదిద్దాల్సిన గురుతర బాధ్యత తనతో పాటు ఆ శాఖ అధికారులందరిపై ఉన్నదని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో శనివారంనాడాయన ఆ శాఖఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాలు, అప్పుల గురించి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకష్ణారావు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంపద సృష్టించి, దాన్ని ప్రజలకు పంచడం కోసం ఆదాయ వనరుల అన్వేషణ కోసం అధికారులు తమ మేధస్సును ఉపయోగించాలని చెప్పారు. ఉద్యోగులుగా కాకుండా రాష్ట్రాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసినప్పుడు అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత, తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించానన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకే కాంగ్రెస్‌పార్టీ ఆరు గ్యారెంటీల అభయహస్తాన్ని మ్యానిఫెస్టోలో ప్రకటించామన్నారు. ఇండ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నత చదువులు చదివిన కొలువులు రాకపోవడంతో పెళ్లిళ్లలో క్యాటరింగ్ సప్లయర్స్‌గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశానని చెప్పుకున్నారు. ఉచితాలను ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదనీ, మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామనే భావించాలని అన్నారు. దానివల్ల జీడీపీ పెరుగుతుందని వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, సెక్రటరీ టీకే శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి తదితరులు పాల్గొన్నారు.