ఆర్థిక నష్టం తీవ్రం

– బాల్టిమోర్‌ వంతెన కూలిన ఘటనపై పలు సంస్థల అంచనా
– ఇప్పటి ప్రాణ నష్టంతో పాటు వ్యాపారాలకూ దెబ్బ
వాషింగ్టన్‌ : యూఎస్‌లోని బాల్టిమోర్‌లో గతనెల 27న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన కూలిపోయింది. పటాప్‌స్కో నదిపై ఉన్న ఈ వంతెనను నౌక ఢకొీనటంతో ఈ ఘటన చోటు చేసుకున్నది. అనంతరం, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి వైరల్‌గా మారాయి.ఈ ఘనటలో దాదాపు ఆరుగురు వరకు మరణించి ఉండొచ్చనే వార్తలు వచ్చాయి. ప్రాణనష్టమే కాదు.. పలువురు గల్లంతయ్యారు. ఈ బ్రిడ్జిపై ఆ సమయంలో ఉన్న వాహనాలూ నదిలో పడిపోయాయి. అనంతరం బ్రిడ్జిపై ఆధారపడి నడిచే వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయి. ఆర్థిక విశ్లేషణ సంస్థ ఇంప్లాన్‌ ప్రకారం.. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు వచ్చే నెలలో కార్మిక ఆదాయంలో వందల మిలియన్ల డాలర్లు నష్టపోయే అవకాశం ఉన్నది. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మార్నింగ్‌స్టార్‌ డీబీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఒక నివేదిక.. ఈ ఘటన చరిత్రలో అత్యంత ఖరీదైన సముద్ర బీమా నష్టంగా మారుతుందని అంచనా వేసింది. ఇది ఇటలీకి సమీపంలోని కోస్టా కాంకోర్డియా క్రూయిజ్‌ షిప్‌ 2012 షిప్‌బ్రెక్‌లో జరిగిన నష్టాన్ని అధిగమించొచ్చని వివరించింది. మార్నింగ్‌స్టార్‌ డీబీఆర్‌ఎస్‌ అంచనా ప్రకారం బాల్టిమోర్‌ విపత్తు మొత్తం బీమా నష్టాలు రూ. 16.67 వేల కోట్ల నుంచి రూ.33.35 వేల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తున్నది.