
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తొలి రోజు తెలుగు పరీక్ష జరిగింది. విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తొలిరోజు కావటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, వారి సహాయకులు కేంద్రాల వద్దకు తోడుగా వచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడిగా కనిపించింది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు. కాగా మండలంలోని మొత్తం 164 మంది విద్యార్థులకు గాను వంద శాతం విద్యార్థులు మొదటి రోజు పరీక్ష హాజరైనట్లు పరీక్షల ముఖ్య నిర్వహణాధికారి బీ. వెంకటేశ్వర్ రావు వెల్లడించారు.