తొలి రోజు ఆసీస్‌దే!

– ట్రావిశ్‌ హెడ్‌ అజేయ శతకం
– స్టీవ్‌ స్మిత్‌ అజేయ అర్థ సెంచరీ
– ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 327/3
ఐసీసీ అల్టిమేట్‌ టెస్టులో ఆస్ట్రేలియా శుభారంభం!. తొలి రోజు ఆటలో కంగారూలు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ట్రావిశ్‌ హెడ్‌ ధనాధన్‌ అజేయ సెంచరీతో కదం తొక్కగా.. స్టీవ్‌ స్మిత్‌ సహజ శైలిలో రెచ్చిపోయాడు. ట్రావిశ్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ నాల్గో వికెట్‌కు అజేయంగా 251 పరుగులు జోడించటంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత పేసర్లలో సిరాజ్‌, షమి, శార్దుల్‌ వికెట్‌ తీసుకున్నారు.
అశ్విన్‌ అవుట్‌ : భారత ట్రంప్‌కార్డ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ది ఓవల్‌ పిచ్‌ చివరి రెండు రోజులు స్పిన్‌కు అనుకూలించే సూచనలు ఉన్నప్పటికీ అశ్విన్‌కు నిరాశ తప్పలేదు. నలుగురు సీమర్లు, ఓ స్పిన్నర్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ ఓటేసింది. ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌లో నలుగురు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లు ఉండటంతో అశ్విన్‌ను తీసుకుంటారని అంచనా వేశారు. ది ఓవల్‌ పిచ్‌ రెండు రోజుల్లో కాస్త పొడిగా మారే అవకాశం ఉందని, ఆ పరిస్థితుల్లో అశ్విన్‌ గొప్పగా ఉపయోగపడేవాడని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు!. అజింక్య రహానె నేరుగా తుది జట్టులోకి రాగా.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ తెలుగు తేజం శ్రీకర్‌ భరత్‌ చోటు దక్కించుకున్నాడు.
నవతెలంగాణ-కెన్నింగ్టన్‌
ట్రావిశ్‌ హెడ్‌ (146 బ్యాటింగ్‌, 156 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (95 బ్యాటింగ్‌, 227 బంతుల్లో 14 ఫోర్లు) కదం తొక్కారు. ట్రావిశ్‌ హెడ్‌ అజేయ సెంచరీ, స్మిత్‌ అజేయ అర్థ శతకంతో రాణించటంతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. 85 ఓవర్లలో 3 వికెట్లకు 327 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. భారీ స్కోరు దిశగా సాగుతోంది. ట్రావిశ్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌లు నాల్గో వికెట్‌కు అజేయంగా 251 పరుగులు జోడించారు. డెవిడ్‌ వార్నర్‌ (43, 60 బంతుల్లో 8 ఫోర్లు), మార్నస్‌ లబుషేన్‌ (26, 62 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి (1/77), మహ్మద్‌ సిరాజ్‌ (1/67), శార్దుల్‌ ఠాకూర్‌ (1/75) వికెట్లు తీసుకున్నారు.
మంచి ఆరంభం!
టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పచ్చిక పిచ్‌పై వికెట్ల వేటకు సిద్ధమైన రోహిత్‌సేనకు ఉదయం సెషన్లో రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్‌ (43), ఉస్మాన్‌ ఖవాజ (0) వికెట్లతో తొలి సెషన్లో భారత్‌ మంచి ఆరంభం దక్కించుకుంది. ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్లోనే మహ్మద్‌ సిరాజ్‌ ఓవర్లో ఉస్మాన్‌ ఖవాజ డకౌట్‌గా నిష్క్రమించగా.. ప్రమాదకర డెవిడ్‌ వార్నర్‌ను శార్దుల్‌ సాగనంపాడు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించారు. తొలి సెషన్లో 23 ఓవర్లలో ఆస్ట్రేలియా 73 పరుగులు చేసింది.
లబుషేన్‌ అవుటైనా..
లంచ్‌ విరామం అనంతరం మహ్మద్‌ షమి మెరుపు బంతితో మార్నస్‌ లబుషేన్‌ (26) ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 76 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడింది. ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌తో జతకట్టిన ట్రావిశ్‌ హెడ్‌ ఇన్నింగ్స్‌ గమనాన్ని మార్చివేశాడు. వచ్చీ రాగానే బౌండరీలు రాబట్టిన హెడ్‌.. బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. హెడ్‌ దూకుడుతో ఈ సెషన్లో ఆసీస్‌ వేగంగా పరుగులు రాబట్టింది. తొమ్మిది ఫోర్లతో 60 బంతుల్లోనే హెడ్‌ అర్థ సెంచరీ సాధించాడు. టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 170/3తో పటిష్టంగా కనిపించింది. రెండో సెషన్లో 94 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయింది. ఇక్కడే ఆస్ట్రేలియా తొలి రోజు ఆధిపత్యం దిశగా అడుగులు వేసింది.
ఇద్దరు దంచేశారు : మూడో సెషన్లో ట్రావిశ్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ అదరగొట్టారు. బంతి పాత బడటంతో మరింత దూకుడుగా ఆడారు. స్మిత్‌, హెడ్‌ను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏడు ఫోర్లతో 144 బంతుల్లో స్మీవ్‌ స్మిత్‌ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 106 బంతుల్లోనే ట్రావిశ్‌ హెడ్‌ శతకం సాధించాడు. క్రీజులో కుదురుకున్న హెడ్‌ బౌండరీ బాదేందుకు ఏ అవకాశాన్ని వదులుకోలేదు. దీంతో పరుగుల ప్రవాహం ఆగలేదు. ఈ సెషన్లో ఆస్ట్రేలియా 157 పరుగులు పిండుకుని.. ఒక్క వికెట్‌ సైతం కోల్పోలేదు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : డెవిడ్‌ వార్నర్‌ (సి) భరత్‌ (బి) శార్దుల్‌ 43, ఉస్మాన్‌ ఖవాజ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 0, మార్నస్‌ లబుషేన్‌ (బి) షమి 26, స్టీవ్‌ స్మిత్‌ నాటౌట్‌ 95, ట్రావిశ్‌ హెడ్‌ నాటౌట్‌ 146, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327.
వికెట్ల పతనం : 1-2, 2-71, 3-76.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 20-3-77-1, మహ్మద్‌ సిరాజ్‌ 19-4-67-1, ఉమేశ్‌ యాదవ్‌ 14-4-54-0, శార్దుల్‌ ఠాకూర్‌ 18-2-75-1, రవీంద్ర జడేజా 14-0-48-0.