యుద్ధం, దేశభక్తి మాటున మనుషులు పాలుపంచుకునే పైశాచిక మారణ హోమం. పాలకులు తమ స్వార్ధం కోసం మరో దేశాన్ని ముట్టడిస్తే, ఆ అధికారి స్వార్ధం, పదవీ కాంక్ష కోసం కొందరు సామాన్యులు దేశభక్తి పేరుతో సైనికులుగా తయారు చేయబడతారు. వీరి నరనరాలలో దేశభక్తిని నింపి వారిని పావులుగా వాడుకుంటారు పాలకులు. చాలా సందర్భాలలో తుపాకి ఎవరి మీద ఎందుకు ఎక్కుపెడుతున్నామో అర్ధం కాని అయోమయంలోనే ఉంటారు సైనికులు. యుద్ధం వారిని మనుష్యులుగా ఉండనివ్వదు. వారిలోని సున్నితత్వాన్ని చంపి, వారిని బండరాళ్లుగా మార్చేస్తుంది. ఇదంతా త్యాగం, దేశాభిమానం, ధర్మం, కర్తవ్యం లాంటి భావాల మాటున జరుగుతుంది.
యుద్ధం గురించి సైనికుల గురించి వీరగాధలను ప్రచారం చేసే వ్యవ్యస్థలో నూనుగు మీసాల యువకులు ఏదో సాధించాలనే ఆశతో యుద్ధంలో అన్నీ మరిచి పాలుగొంటారు. తరువాత ఒక్కొక్కటిగా వారిలోని మానవ లక్షణాలు చచ్చిపోతుంటే తాము తమకే పరాయివారయిపోతుంటే ఆ వాతావరణంలో ఇమడలేక, తమను తాము మిగుల్చుకోలేక నరక యాతన పడతారు. అందులోనుండి బైటపడి సాధారణ జీవితం గడపాలనే కోరిక ఉన్నా పిరికివారిగా ముద్రపడిపోతుందనే భయం, సాధారణ జీవితాన్ని జీవించలేమన్న సత్యం వారిని ఒంటరివారిని చేస్తుంది. మళ్లీ యుద్ధభూమి వైపుకే వారు వెళ్ళవలసి వస్తుంది.
ఈ నగ సత్యాలను నిజాయితీగా ‘ఆల్ క్వాయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ అనే పేరుతో 1929 లో నవలగా రాసారు జర్మన్ రచయిత ఎరిక్ మారియా రెమార్క్. ఆ నవల ఆధారంగానే 1930లో అదే పేరుతో యూనివర్సల్ స్టూడియోస్ లూయిస్ మైల్ స్టోన్ దర్శకత్వంలో సినిమాగా తీసింది. యుద్ధవ్యతిరేకత జర్మనీ పట్ల అభ్యంతరకరమైన సంభాషణలు ఉన్నాయని ఈ సినిమాను హిట్లర్, అతని నాజీ పార్టీ జర్మనీలో నిషేధించింది. ఆస్ట్రేలియా, ఇటలీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలు కూడా ఈ సినిమాను కొంతకాలం నిషేధించాయి. అయినా ప్రపంచంలోని గొప్ప సినిమాలలో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఆ తరువాత ఇదే సినిమాను మళ్లీ ఇంగ్లీషులోనే రెండు సార్లు తీసారు. అప్పుడూ వాటికి కొన్ని అవార్డులు వచ్చాయి. కాని ఈ 1930 లో తీసిన సినిమా మాత్రం ఓ క్లాసిక్‌గా సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఉత్తమ చిత్రానికి అప్పట్లో ఔట్ స్టాండింగ్ ప్రొడక్షన్ కేటగిరీలో బహుమతి ఇచ్చేవారు. అలా ఉత్తమ చిత్రంగా ఒక అవార్డు, ఉత్తమ దర్శకుడిగా లుయిస్ మైల్ స్టోన్ మరో ఆస్కార్ అవార్డును ఈ సినిమాతో గెలుచుకున్నారు.
కథా నేపథ్యం జర్మనీలోనిది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో జర్మనీలోని ఓ పాఠశాల క్లాసురూంలో ప్రొఫెసర్ కాంటోరెక్ యుద్ధం గురించి, దేశం కోసం ప్రాణాలు అర్పించగల వీరత్వం గురించి, అందులోని గొప్పతనం గురించి పిల్లలకు బోధిస్తాడు. అతని మాటలు అప్పుడే కౌమారదశలోకి ప్రవేశిస్తున్న పిల్లల మెదళ్లపై ప్రభావం చూపిస్తాయి. ఉత్తేజితులయిన వారంతా యుద్ధంలో చేరిపోయి అలాంటి వీరత్వం నిండిన జీవితాన్ని అనుభవించాలని, ఏదో సాధించేయాలని నిశ్చయించుకుంటారు. వారందరికీ నాయకుడు పాల్ బామర్ అనే యువకుడు. తల్లిదండ్రుల కన్నీటి మధ్య అందరూ సైన్యంలో తమ పేర్లు నమోదు చేసుకుంటారు. శిక్షణ కోసం వీరంతా సైనిక పాఠశాలలో చేరతారు. అక్కడ సర్జంట్ హిమ్మెల్ స్టాస్ వీరికి శిక్షణ పేరుతో నరకం చూపిస్తాడు. దాన్ని తట్టుకుని నిలబడలేక నీరసపడిపోతారంతా. సైన్యంలోని కఠిన వాస్తవికత వారికి మెల్లిగా అర్ధం అవుతుంది.
శిక్షణ పూర్తి కాక ముందే వీరిని దళానికి పంపేస్తారు అధికారులు. అక్కడ ముందే యుద్ధంలో పాలు పంచుకుంటున్న సీనియర్లు వీరి రాకను ఇష్టపడరు. సరైన తిండి లేక ఆ యువకులు తమ దగ్గరున్న వస్తువులను ఇచ్చి అబగా దొరికిన తిండి తింటారు. మర్యాదస్తుల ఇంట పెరిగిన వాళ్లంతా ఆకలితో ఆ తిండి తింటూ తమ పరిస్థితి అర్ధం కాక అయోమయంలో పడిపోతారు. అక్కడ జరిగిన యుద్ధంలో ఓ యువకుడు చనిపోతాడు. చావును అంత దగ్గరగా చూసి మిగతావారంతా విపరీతంగా భయపడతారు. నిరంతరం బాంబుల మధ్య తుపాకీ చప్పుళ్ల మధ్య ఉండవలసి రావడంతో మరో యువకుడు భయపడిపోయి, ఆందోళన పెరిగిపోయి పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తీవ్రంగా గాయపడి అసుపత్రి పాలవుతాడు. అక్కడే భయంతో చనిపోతాడు.
యుద్ధంలో ఆ రోజు విరామం తరువాత భోజనం కోసం వచ్చిన వారంతా తమ దళంలో సైనికులు తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. చాలామంది చనిపోయారని వారికి అర్ధం అవుతుంది. కాని తమ తోటి సైనికులు చనిపోయిన బాధ కన్నా ఆ రోజు తమకు చనిపోయినవారి భోజనం కూడా దొరికిందని, ఎక్కువ తినవచ్చని వారంతా సంతోషిస్తారు. మిత్రుడు చనిపోయిన బాధ కన్నా అతని బూట్లు తనకు దొరికినందుకు సంతోషిస్తాడు మరో యువకుడు. ఇంత అభావంగా, స్వార్ధంగా తామెప్పుడు తయారయ్యామో పాల్‌కి అంతుపట్టదు. వారికి కఠినమైన శిక్షణ ఇచ్చిన హిమ్మెల్ స్టాస్ కూడా భయంతో యుద్దభూమిలో పిరికిగా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోతారు ఆ యువకులు. అతను వీరి కళ్ళముందే భయంతో చనిపోతే… ఆ బోధించిన వీరత్వం, గొప్పతనంలో నిజం ఎంతో అర్ధం కాని అయోమయంలో, ఆలోచనలో పడిపోతారు ఆ యువకులు. అక్కడి కఠిన వాస్తవానికి, తామూ ఊహించుకున్న జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసం చూసి వారంతా తట్టుకోలేకపోతారు. పాల్ ఓ ఫ్రెంచ్ సైనికుడిని కత్తితో పొడిచి గాయపరుస్తాడు. యుద్ధం మధ్యలో ఆ సైనికుడితోనే ఓ గోతిలో రాత్రంతా గడపవలసి వస్తుంది. మెల్లగా చావుకు దగ్గరవుతున్న ఆ సైనికుడిని, తనను క్షమించమని వేడుకుంటాడు పాల్. తానెప్పుడు హంతకుడిలా మారిపోయాడో అతనికి అర్ధం కాదు. కొంచెం కొంచెంగా ప్రాణాలు వదిలేస్తున్న ఆ శత్రువును చూసి చలించిపోతాడు పాల్. తాను చేసిన పనిలో గొప్పతనం ఏం ఉందో అతనికి అర్ధం కాదు.
పాల్, అతని స్నేహితుడు ఆల్బర్ట్ యుద్ధంలో గాయపడతారు. ఆల్బర్ట్ కాలు పోగొట్టుకుంటాడు. చనిపోతాడనుకున్న పాల్ కోలుకుంటాడు. సెలవు పై అతన్ని ఇంటిని వెళ్ళడానికి అనుమతిస్తారు. యుద్ధం గురించి ఏవో గొప్పగా ఊహించుకుంటున్న మిత్రులను, బంధువులను చూసి అతను ఆశ్చర్యపోతాడు. తాను చదివిన పాఠశాలకు వెళితే అక్కడ టీచర్ యువకులకు యుద్ధం గురించి చెప్పడం విని, అతనికి తన పాత రోజులు గుర్తుకు వస్తాయి. ఆ పిల్లల మనసులో ఎటువంటి ఉత్తేజం ఉబుకుతుందో అతనికి అర్ధం అవుతుంది. వారితో సంభాషించమని టీచర్ చెబితే యుద్ధ వాస్తవికతను వివరించాలని ప్రయత్నిస్తాడు. కాని అతని మాటలు వారికి నచ్చవు. పైగా పిరికిపంద అని ముద్ర వేసి అంతా అతన్ని గేలిచేస్తారు.
అక్కడ ఉండలేనని పాల్‌కి అర్ధం అవుతుంది. లీవు పూర్తి కాకుండానే మళ్ళీ యుద్ధంలోకి వెళ్లిపోతాడు. కాని తన దళానికి చేరాక తాము సైన్యంలోకి చేరినప్పటికంటే కూడా చిన్న వయసున్న పిల్లలు ఆ దళంలో కొత్తగా చేరడం చూస్తాడు పాల్. అతని స్నేహితులందరూ మరణించారని, కొందరు తీవ్రంగా గాయపడ్డారని వింటాడు. దళంలో ఉన్న ఏకైక మిత్రుడు కాట్ కూడా తుపాకి గుండుకు బలవుతాడు. అతన్ని రక్షించడానికి పాల్ ప్రయత్నిస్తాడు కాని కాట్ మరణిస్తాడు. దు:ఖంతో పాల్ వెనుతిరుగుతాడు. పక్కనే దేన్నీ పట్టించుకోకుండా కొందరు డాక్టర్లు పేకాట ఆడుతూ కనిపిస్తారు. ఎవరి మరణమూ వారికి పట్టదు. రోజూ వందల చావులు చూస్తూ ఉండడంతో బండబారిపోయిన యువకులు వారంతా. యుద్ధ వాతావరణంలో మనిషిలా బతకాలని ప్రవర్తించే పాల్ చివరకు ఓ తుపాకి గుండుకు నేల కొరుగుతాడు. అతను, అతని స్నేహితులు ఉత్సాహంతో సైన్యంలో చేరడానికి వస్తున్న సీన్ మరోసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది.
యుద్ధం పైశాచిక చర్య. కాని దాని మాటున ఎంతో ఉత్సాహాన్ని, ఆదర్శాన్ని చూపిస్తూ యువతరాన్ని ఈ మారణహోమానికి సిద్ధం చేస్తుంది అధికార యంత్రాంగం. ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో అర్ధం కాని పరిస్థితిలో చేతిలో తుపాకి పట్టుకుని తమ లాంటి యువకులనే హత్య చేస్తూ అసలు దాని అర్ధం ఏంటో తెలియని స్థితిలో సైనికులు జీవిస్తుంటారు. దేశం కోసం ప్రాణాలివ్వడం గొప్ప భావనే కాని ఇక్కడ దేశం అంటే ఎవరు? యుద్ధం ఎందుకు అన్న ప్రశ్నలుంటాయి. ఇంతమంది ప్రాణాలు ఒడ్డి సాధించిన విజయంలోని ఆనందానికి నిజంగా అర్ధం ఉంటుందా? మరి ఈ యుద్ధం పేరుతో నలిగిపోయిన కుటుంబాలు, చిదిమి వేయబడిన జీవితాలకు అర్ధం ఏంటి? ఇంత మంది యువకులు తమలోని మానవీయతను యుద్ధం పేరుతో పోగొట్టుకుని చివరకు ఏం సాధిస్తారు? ఆ సాధించినది ఎవరి కోసం అనే ప్రశ్నలను సూటిగా వేస్తుంది ఈ కథ.
పుస్తకంగా కూడా ఈ కథ సంచలనం సృష్టించింది. జర్మనీలో వచ్చిన ఈ నవల అప్పట్లోనే 22 భాషలలోకి అనువాదం అయింది. పుస్తకం ప్రారంభంలో, రచయిత రీమార్క్ ఇలా రాశాడు… ”ఈ పుస్తకం ఎవరినో ఆరోపిస్తూ, ఎవరి భావజాలాన్నో ఒప్పుకుంటూ లేదా ఓ సాహస రచనగా మాత్రం నేను చేయలేదు. ఎందుకంటే మరణం, దానితో ముఖాముఖిగా నిలబడే వారిది సాహసం కాదు. దీన్ని రాసింది ఒక తరం మునుషుల గురించి చెప్పడానికి, వారు యుద్ధ భూమిలో తుపాకి గుళ్ల నుండి తప్పించుకున్నప్పటికీ, యుద్ధం ద్వారా నాశనం చేయబడ్డారు. ఈ పుస్తకంలో నేను సైనికుల ధైర్యసాహసాల కథలపై దష్టి పెట్టలేదు. కేవలం యుద్ధ వాతావరణంలో ఆక్కడి పరిస్థితులను దష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసాను. సైనికులు తమను తాము ఇందులో చూసుకుంటారు. యుద్ధాల మధ్య ఏకస్వామ్యం, ఫిరంగి కాల్పులు, బాంబు పేలుళ్ల మధ్య నిరంతర ముప్పుతో సాగిన సమయం, ఆహారం కోసం వారి పోరాటం, యువ సైనికులకు సరైన శిక్షణ లేకపోవడం, సైనికుల జీవితాలు, మరణాలలో యాదచ్ఛిక అవకాశం ప్రధాన పాత్ర అవడం, ఇలాంటి భయంకరమైన నిజాలను ఈ కథలో వివరించడం జరిగింది.
ఇదే ఆలోచనతో రబీంద్రనాధ్ ఠాగూర్ ‘నాషనలిజం’ అనే ఓ పెద్ద వ్యాసం రాశారు. అందులో ఠాగూర్ ఐరోపాలో అవలంబించిన జాతీయవాదం యొక్క ఇరుకైన నమూనాను ఖండించారు. ఇది యుద్ధం, సామ్రాజ్యవాదం, మానవుల నైతిక లొంగుబాటుకు దారితీసింది అని స్పష్టంగా చెపుతారు ఠాగూర్. మానవత్వం యొక్క నైతిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చలేని జాతీయవాదం క్షేమకరం కాదని యుద్ధాన్ని, మారణ హోమాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం మాత్రమే అని బలంగా నినదించారు ఠాగూర్. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఆ యువ సైనికుల మనసులోని అంతర్మధనం, వారి మొహంలోని అయోమయం గమనిస్తున్నప్పుడు, రబీంద్రనాధ్ ఠాగూర్ వ్యాసం గుర్తుకు వచ్చి తీరుతుంది. యుద్ధాన్ని వీరత్వంగా చెప్పుకునే వారికి గొప్ప కనువిప్పు ఈ సినిమా.
పాల్‌గా లూయిస్ ఫెడ్రిక్ ఆయిర్స్ అద్భుతంగా నటించారు. చివరి సీన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు పాల్ దాక్కున దిబ్బ పైకి ఓ చిన్న సీతాకోక చిలుక వచ్చి వాలుతుంది. దాన్ని పట్టుకోవడానికి చేయి చాస్తాడు పాల్. అతని చేతి కదలిక శత్రువులు గమనిస్తారు. అటువైపుకి తుపాకి పేలుస్తారు. ఒక్క గుండుతో మౌనంగా నేలకొరుగుతాడు పాల్. అతను సీతాకోకవైపు చాపిన చేయి అలాగే నిస్తేజంగా వాలిపోతుంది. ఎంత మంది యువకుల కలలను యుద్ధం చిద్రం చేసిందో చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దృశ్యీకరణ ఉండదేమో. చూసే ప్రేక్షకులకు దర్శకుడు చెప్పాలనుకున్నదంతా ఈ ఒక్క సీన్‌తో అర్ధమవుతుంది. పాల్ చాపిన ఆ చేయి నిస్తేజంగా వాలిపోతున్నప్పుడు కలిగించే ఆ చిన్న నొప్పి అనుభవిస్తేనే అర్ధం అవుతుంది.
2022లో కూడా సినిమాగా రీమేక్ అయిన ఈ కథకు నాలుగు అకాడమీ అవార్డులు లభించాయి. కాని ఉత్తమ చిత్రం కేటగిరిలో మాత్రం కేవలం నామినేషన్ మాత్రమే లభించింది. 1930లో వచ్చిన సినిమాకు లభించిన ఉత్తమ చిత్రం ఆస్కార్ అవార్డు అపురూపమైనది. అందుకే ఇప్పటికీ ఈ సినిమా ఓ క్లాసిక్‌గా ప్రస్తావనకు వస్తుంది.
– పి.జ్యోతి, 98853 84740