ఏ కళా ప్రక్రియ కూడా అప్పటి కాలమాన పరిస్థితుల ప్రభావంతోనే నిర్మితమవుతుంది. అప్పటి సమాజాన్ని దష్టిలో పెట్టుకునే వాటిని సష్టిస్తారు రూపకర్తలు. సినిమాలు దీనికి మినహాయింపు కాదు. అయినా కొన్ని సినిమాలు నేటి, ఆ నాటి, ఆ రాబోయే నాటి తరానికి కూడా అవసరం అనిపించి అపురూపమైన చిత్రాల జాబితాలోకి చేరతాయి. అలాంటి ఓ గొప్ప చిత్రం బిల్లీ విల్డర్ దర్శకత్వంలో 1945లో వచ్చిన ”ది లాస్ట్ వీకెండ్”. 1944లో చార్ల్స్ ఆర్ జాక్సన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో నిర్మించిన చిత్రం ఇది. ఏడు అకాడమీ అవార్డులకు నామినేట్ అయి ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, నటుడు, స్క్రీన్‌ప్లేలకు నాలుగు అకాడమీ అవార్డులు అందుకున్న ఈ సినిమా మానవ సమాజానికి ఎంతో ఉపయోగపడే అతి గొప్ప చలనచిత్రం.
ప్రతి మనిషికీ బలహీనతలుంటాయి. కాని అవి అతని జీవితాన్ని నియంత్రించ కూడదు. అదే జరిగితే మనిషి పతనావస్థకు చేరుకుంటాడు. కొన్ని బలహీనతలు గొప్పగా బైటికి చెప్పుకోవచ్చు మరి కొన్ని సిగ్గుతో కప్పెట్టుకోవాలి. ఈ రెండో స్థాయి బలహీనత లున్న మనిషి సమాజంలో హీనాతిహీనంగా చూడబడతాడు. ముఖ్యంగా ఆల్కహాలిక్. అంటే మద్యానికి బానిస అయిన వ్యక్తి సమాజంలో హీనమైన స్థాయికి నెట్టివేయ బడతాడు. ఈ మందుని ఎందుకోసం సమాజం కనిపెట్టిందో కాని దీని వల్ల బాగు పడిన వారి కథల కన్నా నాశనం అయిన జీవితాల కథలనే ఎక్కువ విని ఉంటాం. అలాంటి వినాశక స్థితికి చేరువైన ఓ ఆల్కాహాలిక్ కథ ”ది లాస్ట్ వీకెండ్”.
ఓ గురువారం మధ్యాహ్నం న్యూయార్క్ లో ఉండే డాన్ బిర్నామ్ అనే ఓ ముప్పై రెండేండ్ల యువకుడు వారాంతపు సెలవులకు తన సోదరుడు విక్‌తో పాటు ఊరికి వెళ్లడం కోసం బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. డాన్ అప్పుడే మద్యం వల్ల సంక్రమించే ఓ అతి క్లిష్టమైన మానసిక శారీరికస్థితి నుంచి బయట పడతాడు. అందుకని విక్ అతనికి డబ్బు అందకుండా, ఎవరూ మందు తాగించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తనతో డాన్‌ని ఊరికి తీసుకెళ్లాలని కావలికాస్తూ ఉంటాడు. డాన్ ప్రేయసి హెలన్ వారిని కలవాలని వస్తుంది. డాన్‌కు కొన్ని బహుమతులు ఇచ్చి తాను నాటకం చూడడానికి వెళుతున్నానని తన దగ్గర రెండు టికెట్లున్నాయని చెబుతుంది. డాన్ కిటికీ అవతల తాడు కట్టి ఓ బాటిల్ దాచుకుంటాడు. తమ్ముడు కాస్త పక్కకు జరిగితే ఆ మందు తీసుకుని సూట్‌కేసులో భద్రపరుచుకోవాలన్నది అతని ఆలోచన. విక్ అతన్ని ఒంటరిగా వదలక పోవడంతో హెలన్‌తో అతన్ని నాటకానికి వెళ్లమని తర్వాతి ట్రైన్‌కు ఊరు వెళ్లవచ్చని చెప్తాడు డాన్. విక్ డాన్‌ని నమ్మడు. కాని అతన్ని మరింత కట్టడి చేస్తే మంచిది కాదని హెలన్‌తో కలిసి నాటకం చూడడానికి అయిష్టంగానే వెళతాడు. అయితే వెళ్లబోయే ముందు డాన్ దాచుకున్న సీసాను కనిపెట్టి ఆ ద్రవం పారబోసి, ఇక ఇంట్లో మందు లేదని నిశ్చింతగా వెళ్లిపోతాడు విక్.
విక్ వెళ్లాక డాన్ ఇల్లంతా వెతుకుతాడు. అతనికి డబ్బులు కాని, మందు కాని దొరకదు. విక్ పూర్తిగా ఇంట్లో అన్ని సీసాలను పారేసాడు. మందులేక అల్లాడుతున్న డాన్‌కి పనిమనిషి జీతం కోసం ఇంటికి రావడంతో కొత్త ఆలోచన వస్తుంది. ఆమెను అడిగి విక్ ఇంట్లో జీతం కోసం దాచిన డబ్బు కనిపెట్టి తీసుకుంటాడు. కాని వాటిని ఆమెకివ్వకుండా దానితో ముందు మార్కెట్‌కు వెళ్లి రెండు ఫుల్ బాటిల్లు కొనుక్కుంటాడు. ట్రైన్ సంగతి మర్చిపోయి మందు తాగడానికి తానెప్పుడూ వెళ్లే బార్‌కి వెళ్లి తాగుతూ కూర్చుంటాడు. అతను ఇంటికి వెళ్లేసరికి విక్ కోపంతో ఒంటరిగా ఊరికి వెళ్లిపోతూ ఉంటాడు. హెలెన్ అతన్ని ఆపాలని చూస్తుంది. అప్పటికే డాన్ ప్రవర్తనతో విసిగిన విక్, అతనితో పడలేనని ఒక్కడే రైలెక్కేస్తాడు. హెలెన్ డాన్‌పై ప్రేమ చావక అతని కోసం ఎదురుచూస్తూంటుంది. డాన్ ఆమెను తప్పించుకుని ఫ్లాట్‌కు చేరతాడు. రాత్రంతా తాగుతూ గడిపేస్తాడు.
మరుసటి రోజు శుక్రవారం.. పొద్దున తీవ్రమైన హాంగోవర్‌తో నిద్రలేస్తాడు డాన్. తనకు అలవాటైన బారుకు వెళతాడు. బార్ యజమాని నాట్ అతన్ని చూసి.. రాత్రి హెలన్ వచ్చి అతని గురించి వాకబు చేసిందని, ఆమె లాంటి ఉత్తమ స్త్రీ అతనితో ఎలా స్నేహం చేస్తుందని అడుగుతాడు. ఆమెకు అతనిపై ఉన్న గౌరవాన్ని కూడా నాట్ గుర్తిస్తాడు. అందుకు డాన్ అర్హుడు కాడని నాట్ నమ్మకం. హీనంగా డాన్‌ని చూస్తూ అతని అవస్థను గమనిస్తూ కావలసిన మందు పోస్తాడు. ఒక్క పెగ్‌తో ఆపే రకం కాదు డాన్. తాగుతూ తన గతాన్ని నాట్‌కు వినిపిస్తాడు.
కొన్నేండ్ల కిందట ఓ నాటకానికి వెళతాడు డాన్. నాటకంలో పాత్రలు మద్యం తాగే దశ్యాన్ని చూస్తూ అతనికి తాను విప్పిన కోటు జేబులో బాటిల్ గుర్తుకు వస్తుంది. దానితో ఆగలేక నాటకం మధ్యలోనే బైటకు వచ్చి హాలు మొదట్లో అందరి కోట్లను, హాట్లను జమ చేసుకున్న గదిముందు నిలబడి తనకిచ్చిన చీటి ఇచ్చి తన కొటు తీసుకుంటాడు. కాని అతని కోటు బదులు ఓ స్త్రీ కోటుని అతనికిస్తాడు. అది తన కోటు కాదని, తన కోటు జేబులో తనకు కావలసిన వస్తువు ఉందని, అది అవసరమని చెప్తాడు డాన్. చీటీలు మారుపడ్డాయని, అందరూ వచ్చేదాకా డాన్ వేచి చూడవల్సిందే అని లేదా రేపు వచ్చి కోటు తీసుకెళ్లమని చెప్తాడు ఆ పెద్దాయన. మందుకు బానిస అయిన అతను.. లోపల నాటకానికి వెళ్లకుండా అక్కడే మెట్ల మీదే కూర్చుండిపోతాడు డాన్.
డాన్ చదువుకునే రోజుల్లో గొప్ప క్రియేటివిటీ ప్రదర్శించేవాడు. అతను రాసిన కథలను స్నేహితులు ఇష్టంగా చదివేవాళ్లు. రచయిత అవ్వాలనుకుని చదువు మానేస్తాడు. కొడుకులోని తపన గమనించిన తల్లి ఓ టైప్‌రైటర్ కొంటుంది. కథకు ఆలోచనలు రావట్లేదని మెల్లిగా మందుకు అలవాటు పడతాడు. అది అతన్ని పూర్తిగా లోబర్చుకుంటుంది. ఇక రాయడం పక్కనపెట్టి రాత్రీపగలు మందులో మునిగి తేలుతుంటాడు. అతని ప్రతిభను నమ్మిన తమ్ముడు విక్ అన్న ఖర్చులు భరిస్తూ.. ఏదో రోజు అన్న మారతాడని ఓపికగా ఎదురుచూస్తూ ఉంటాడు.
అలాంటి సమయంలో ఇలా నాటకం కోసం వచ్చి స్టేజి మెట్లపై తన చేతికొచ్చిన కోటు యజమానురాలి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు డాన్. నాటకం అయిపోవడంతో అందరూ బైటికి వస్తారు. చివరకు తన కోటు హెలెన్ చేతిలో చూసి, అసహనంగా లాక్కుంటాడు. అలా మొదటిసారి ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. డాన్ అందగాడు, మంచి మాటకారి. అతన్ని చూసి ఇష్టపడుతుంది హెలెన్. తాను ఓ పార్టీకి వెళుతున్నానని వస్తే తీసుకు వెళతానని అంటుంది. మరో చోటుకు వెళ్లాలనుకున్న డాన్, కోటు జేబులో ఉన్న మందు సీసా కిందపడి పగిలిపోతుంది. దాన్ని హెలెన్ చూడడంతో, అది తనది కాదని, ఓ మిత్రుని కోసం తీసుకు వెళుతున్నానని బుకాయిస్తాడు. మందుకోసం తపన పడుతూ, హెలెన్ వెళ్తున్న పార్టీ ఎలాంటిదని అడుగుతాడు. కాక్టెయిల్ పార్టీ అని చెబుతుంది. అక్కడ మందు దొరుకుతుందని సంతోషంతో పార్టీకి వెళతాడు డాన్. కాని హెలెన్ ముందు తాగలేకపోతాడు. అంత నిబ్బరంగా తాగకుండా నియంత్రణలో ఉండడం అతను ఎరుగడు. హెలెన్‌ని తరచుగా కలుస్తూ.. క్రమంగా మందుకు దూరమవుతూ ఉంటాడు. అతన్ని కలవాడనికి హెలెన్ తల్లిదండ్రులను ఆ ఊరు రప్పిస్తుంది. హోటల్ చేరిన డాన్ ఆ ముసలి తల్లిదండ్రులు కూతురి భవిష్యత్తు గురించి భయపడుతూ మాట్లాడుకోవడాన్ని వింటాడు. అతనికి తన స్థితి అప్పుడు గుర్తుకు వస్తుంది. వాళ్లని కలవకుండా ఇంటికి చేరి మళ్లీ తాగుతూ రాత్రంతా గడిపేస్తాడు. అదేంటని ప్రశ్నించిన విక్‌తో తాను హెలెన్‌ని పెండ్లి చేసుకోలేనని చెబుతాడు. అతన్ని వెతుక్కుంటూ హెలెన్ ఇంటికే వస్తుంది. డాన్‌ని ఆ స్థితిలో దాచిపెట్టి, ఉద్యోగం కోసం బయటకు వెళ్లాడని హెలెన్‌కి సర్ధి చెప్పబోతాడు విక్. పైగా అక్కడ ఉన్న మందు తానే తాగుతున్నానని బుకాయించబోతాడు. తన కోసం తమ్ముడు చెప్తున్న అబద్దం డాన్ భరించలేకపోతాడు.
డాన్ గది నుంచి బయటకు వచ్చి తాను మందుకు బానిసనని, రాయాలనుకుంటూనే ఏమీ రాయలేక ఓడిపోయిన బలహీన మనస్కుడినని, తనలో రచయితను ఎప్పుడూ తాగుబోతు ఓడిస్తూనే ఉన్నాడని తనను మర్చిపోవడం మంచిదని సూచిస్తాడు. హెలెన్ మాత్రం అతనికి అండగా ఉండి, ఆ అలవాటు నుంచి దూరం చేస్తానంటుంది.
ఇది జరిగి మూడేండ్లయినా హెలెన్ తన ప్రయత్నాలు మానదు. అతన్ని వదిలి వెళ్లదు. తన కథ నాట్ కి చెప్పి ఇంటికి వెళ్లి మళ్లీ నవల రాయాలని కూర్చుంటాడు డాన్. కాని ఇంట్లో తానో బాటిల్ దాచుకున్నది గుర్తుకు వస్తుంది. దాంతో రాయడం మర్చిపోయి బాటిల్‌ని వెతుక్కోవడం మొదలెడతాడు. అదెక్కడ దాచిపెట్టాడో గుర్తుకురాదు. మందు తాగాలన్న కోరిక ఎక్కువవుతుంది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లి కావల్సినంత తాగుతాడు. బిల్ కట్టడానికి పూర్తిగా డబ్బు లేకపోతే పక్కనే ఉన్న అమ్మాయి పర్సు దొంగలిస్తాడు. అది కనుక్కుని అతన్ని బైటికి గెంటేస్తారు అక్కడివాళ్లు. అవమానంతో ఇంటికి చేరిన తర్వాత అతనికి ఇంట్లో దాచిన మందు దొరుకుతుంది. మళ్లీ దాన్ని తాగుతూ ఉండిపోతాడు.
శనివారం పొద్దున విపరీతమైన తలనొప్పితో నిద్రలేస్తాడు. తన టైప్ రేటర్ తీసుకొని తాకట్టు దుకణానికి వెళతాడు. ఏదో పండగ కారణంగా దుకాణాలు మూసేస్తారు. ఓపిక లేకపోయినా దుకాణాల కోసం వెతుకుతాడు. ఏవీ తెరిసి ఉండవు. మందు లేకపోతే చచ్చిపోతాననిపిస్తుంది అతనికి. నాట్‌ని మందు కోసం అడుక్కుంటాడు. అతని స్థితిని చూసి అసహ్యంతో ఓ పెగ్ పోస్తాడు. అంతకన్నా ఇచ్చేది లేదని వెళ్లిపొమ్మని చీదరించుకుంటాడు.
నాట్ బార్‌కి ఓ వేశ్య వస్తూ ఉంటుంది. ఆమెకు డాన్ అంటే ఇష్టం. కాని డాన్ ఆమెను పట్టించుకోడు. పైగా నీ దగ్గరకు వస్తానని ఆమెకు ఆశ కల్పించి, ఆమె వేరే విటులని కాదని చెప్పాక వెళ్లడు. అలా ఆమెను ఏడిపిస్తాడు. కాని ఇప్పుడు డబ్బు కోసం ఆమె తలుపు తడతాడు. ఆమె నాట్‌ని చూసి కోపంతో తిడుతుంది. ఆమెకు ముద్దు పెట్టి తనకు డబ్బు కావాలని అడుగుతాడు. తనను తాను మందు కోసం వేశ్యకు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడిన డాన్ అసహాయ స్థితి, ప్రేక్షకుల మనసులని అసహ్యంతో నింపేస్తుంది. ఈ సన్నివేశం చూసి భరించడం కొంచెం కష్టమే.
ఆ వేశ్య డాన్ స్థితికి జాలిపడి, డబ్బు ఇస్తుంది. అది తీసుకుని వెళ్లబోతూ తూలి కింద పడిపోతాడు. ఆదివారం ఉదయం హాస్పిటల్‌లో ఆల్కాహాలిక్ వార్డులో కండ్లు తెరుస్తాడు. అక్కడ మగ నర్సు బిమ్ అతని స్థితిని చూసి, అతనికున్నది ఓ పెద్ద రోగమని అతనికి ట్రీట్మెంట్ అవసరమని చెప్తాడు. కాని డాన్ వినిపించుకోడు. అర్ధరాత్రి తోటి పేషంట్ల అరుపులను అతను భరించలేకపోతాడు. పక్క బెడ్ పేషంట్ చేసే గొడవను చూస్తూ.. డాక్టర్లు బిజీగా ఉన్నప్పుడు అదనుచూసి డాక్టరు కోటు దొంగలించి హాస్పిటల్ నుంచి పారిపోతాడు డాన్.
సోమవారం పొద్దున బార్ ఓనర్‌ను బెదిరించి బలవంతంగా ఓ బాటిల్ తస్కరించి ఇంటికి చేరి తాగుతూ ఉండిపోతాడు. హాస్పిటల్‌లో నర్స్ చెప్పినట్టుగానే డెలిరియమ్ స్థితికి చేరుకుంటాడు. తన చుట్టు గుడ్లబూబలు, ఎలుకలు కిచకిచలాడుతున్నట్టు ఒకదానినొకటి తిని రక్తాలు కారుతున్నట్టు అతనికి దశ్యాలు కనిపిస్తాయి. దీంతో విపరీతమైన భయానికి గురయి అరవడం మొదలెడతాడు. ఆ అరుపులకు కింద ఉన్న ఇంటి ఓనరు, హెలెన్‌కు ఫోన్ చేసి విషయం చెబుతుంది.
హెలెన్ ప్రతిరోజు ఆ ఇంటి ముందు డాన్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఫోన్ చేస్తూనే ఉంటుంది. కాని డాన్ ఆమెను తప్పించుకు తిరుగుతుంటాడు. ఫోన్లు ఎత్తడు. ఇంటి ఓనర్ ఫోన్‌తో ఆమె పరుగున డాన్ ఇంటికి వస్తుంది. మారు చెవితో తలుపు తెరిపించి లోపలకు వెళ్లి ఇల్లు సర్ది అతనికి పరిచర్యలు చేసి నిద్రపుచ్చి, ఆ రాత్రి అక్కడే ఉంటుంది.
మంగళవారం ఉదయం నిద్రలేవగానే డాన్ హెలెన్ కోట్ తీసుకుని తనఖా పెట్టడానికి బయలుదేరతాడు. హెలెన్ అతన్ని వెంబడిస్తుంది. అతను కోటు ఇచ్చి.. అంతకు ముందు తాకట్టు పెట్టిన తుపాకిని తీసుకుని వెళ్లాడని తెలిసి తిరిగి ఇంటికి పరుగెత్తుకుని వస్తుంది. డాన్ తమ్ముడుకి ఉత్తరం రాసి.. ప్రాణం తీసుకోవాలనుకుంటుండగా హెలెన్ గదిలోకి వస్తుంది. గొప్ప సంయమనం పాటిస్తూ అతనితో మాట్లాడడం మొదలెడుతుంది. ఇక్కడ ఆ ఇద్దరి మధ్య జరిగే సంభాషణను ఎంతో సహజంగానూ పర్ఫెక్ట్‌గానూ రాసారు రచయిత. ఆ సీన్ చాలా గొప్పగా ఉంటుంది. హెలెన్ పాత్రను ఎంతో ఉదాత్తంగా మారుస్తుంది. ఎంత బాలెన్స్‌గా హెలెన్ వ్యవహరిస్తుందంటే ఏ సైకాలజిస్టూ అంతకన్నా గొప్పగా డాన్‌ను ట్రీట్ చేయలేరేమో అనిపించేటంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది చిత్రీకరణ, నటుల నటన కూడా. అతన్ని ఆపడానికి గ్లాసులో ఉన్న కొంతమందు ఇచ్చి తాగమని హెలెన్ డాన్‌ను బతిమాలుతుంది. ఇదేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్న డాన్‌తో నువ్వు తాగిపడి ఉన్నా, బతికే ఉన్నావనుకోవడం నువ్వు ప్రాణాలతో లేవనుకోవడం కన్నా బావుంటుంది అని జవాబిస్తుంది హెలెన్.
డాన్ తాను జీవించి ఉండి ప్రయోజనం లేదని అంటుండగానే నాట్ వచ్చి డాన్ పోగొట్టుకున్న టైప్ రైటర్‌ను తిరిగి ఇచ్చి వెళతాడు. ఇదే సంకేతంగా చూసి జీవితాన్ని మళ్లీ మొదలెట్టమని రాయడం గురించి ఆలోచించమని అడుగుతుంది హెలెన్. ఈ గడిచిన ఐదు రోజుల్లో అతను అనుభవించిన బలహీన క్షణాలనే కథగా మార్చి రాయమని చెబుతుంది. చేతిలోని సిగరెట్టుని మిగిలి ఉన్న విస్కీలో పారేసి టైప్ రైటర్ ముందు కూర్చుంటాడు.
సినిమాలో మద్యానికి బానిసయిన వ్యక్తి పడే బాధ, అతను ఎన్ని విధాలుగా నాశనం అవగలడో, ఎలా తనను తాను దిగజార్చుకో గలడో ఒకో మెట్టు అతను మనిషిగా దిగి మగంగా మారుతున్నప్పుడు దాన్ని హాలులో కూర్చుని చూస్తున్నవాళ్లు భరించలేరు. మనసు పెట్టి ఈ సినిమాను చూస్తే ఎవరూ మందుకు బానిస అవలేరు. దొంగతనం చేసి తన్నులు తింటున్న డాన్, బార్ ఓనర్‌ని కాస్త పోయమని దేబీరించి అడుగుతున్న డాన్, తాను ఒకప్పుడు చీదరించుకున్న వేశ్యకు ముద్దుపెడుతూ డబ్బులు కావాలని బతిమాలుకుంటున్న డాన్, ఈ మూడు సన్నివేశాలు ఈ సినిమాను మర్చిపోనివ్వవు. మందును ప్రేమించే మందు బాబులందరూ చూడాల్సిన సినిమా ఇది.
ఈ సినిమా తీసిన తర్వాత లిక్కర్ కంపెనీలు అన్ని కలిసి మళ్లీ యాంటీ లిక్కర్ గ్రూపులు ఈ సినిమా ప్రభావంతో ప్రొహిబిషన్ తీసుకురావచ్చని పారమౌంట్ సంస్థను సినిమా రిలీజ్ చేయవద్దని బెదిరించాయట. ఫిలిం నెగిటివ్ కొని కాల్చేయాలనీ ప్రయత్నించాయట. తమ వ్యాపారం దెబ్బ తింటుందనే కదా ఇటువంటి సినిమాలు ఈ రోజుకీ తీయనివ్వవు ఏ పెద్ద కంపెనీలు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లోనూ తాగుడు అనే వ్యసనం మీద ఇంత గొప్పగా చర్చించగల సినిమా మరొకటి వచ్చే సూచనలు లేవు. అందుకే ఇది ఎప్పటికీ దాచి ఉంచుకోవలసిన సినిమా.
ఈ సినిమాలోని ఆల్కాహాలిక్ వార్డ్ సీన్ నిజంగా హాస్పీటల్‌లో చిత్రీకరించినదేనట. ఈ సినిమా ఒక్కదానికే ఆ హాస్పిటల్ ఆ వార్డులో చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చిందట. పైగా డాన్ పాత్రలో నటించిన రే మిలాండ్ ఈ సినిమా కోసం ఒక రాత్రంతా ఆ వార్డులో అలాంటి పేషంట్ల మధ్య గడిపాడట. మందు అనే వ్యసనంలో పడి నియంత్రణ కోల్పోతే ఏ స్థితికి మనిషి చేరతాడో అర్ధం చేసుకోవడానికి ఈ హాస్పిటల్ సన్నివేశాలు ఎంతో ఉపయోగపడతాయి.
ఈ కథను ఇంత హద్యంగా రాసిన రచయిత జీవితాంతం ఆల్కాహాలిజంతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అతని మరణం ఆత్మహత్య అనే అనుమానాలున్నాయి. ఏదేమైనా ఆల్కాహాలిక్‌గా ఆయన పడిన నరకాన్ని నవలగా రాసారు చార్ల్స్ జాక్సన్.
కాన్స్ ఫెస్టివల్ మొదలయిన మొదటి ఏడాది గ్రాండ్ ప్రిక్స్ బహుమతి అందుకుంది ”ది లాస్ట్ వీకెండ్’. అలా ఆస్కార్ ఉత్తమ చిత్రంగానూ, కాన్స్ గ్రాండ్ ప్రిక్స్ బహుమతిని కూడా అందుకున్న మొదటి చిత్రంగా చరిత్రకెక్కింది. ఆ తర్వాత ఇప్పటిదాకా మరో రెండు చిత్రాలకే ఈ గౌరవం దక్కింది. అలాగే డాన్ పాత్రలో నటించిన రే మిల్లాండ్ ఈ చిత్రంతో కేన్స్‌లోనూ ఉత్తమ నటుడి పురస్కారం, గోల్డన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డు సాధించి, ఒక సినిమాతో మూడు పతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్న ఏకైక వెల్ష్ నటుడిగా చరిత్ర సష్టించారు. ఇక హెలెన్‌గా నటించిన జేన్ వైమాన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ మొదటి భార్య. ఈ చిత్రం ఆమెకు ఎంతో పేరును తీసుకొచ్చింది.
పి.జ్యోతి
98853 84740