దేశంలో తొలి ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ మాతా, శిశు సంరక్షణ కేంద్రం

The first government super specialty in the country Maternal and Child Care Centre– గాంధీ ఆస్పత్రిలో ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో తొలి ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ మాతా, శిశు సంరక్షణ కేంద్రం గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. 200 పడకలతో కూడిన ఈ ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదివారం ప్రారంభించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 200 పడకలు గర్భిణులు, 100 పడకలు శిశువుల కోసం ఉన్నాయని తెలిపారు. వీటికి తోడు సూపర్‌ స్పెషాలిటీ కింద మరో 200 పడకలతో మొత్తం 500 బెడ్లకు చేరింది. దీంతో పాటు ఆధునిక డైట్‌ కిచెన్‌ను, 33 నియోనాటల్‌ అంబులెన్సులను మంత్రి ప్రారంభించారు.
మరింత తగ్గనున్న మాతా, శిశు మరణాలు
కొత్తగా వచ్చిన సూపర్‌ స్పెషాలిటీ మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, 33 నియోనాటల్‌ అంబులెన్సులతో తల్లులు, పిల్లల మరణాల సంఖ్య మరింత తగ్గుతుందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్లిష్ట నవజాత కేసులను మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. దీన్ని నివారించేందుకు 33 జిల్లాల్లో 33 నియోనాటల్‌ అంబులెన్సులను అందుబాటులో పెడుతున్నట్టు తెలిపారు. దీంట్లో ఆక్సిజన్‌తో పాటు అన్ని సదుపాయాలుంటాయని వివరించారు. గాంధీలో నూతన ఆరోగ్య కేంద్రంతో పాటు నిమ్స్‌, అల్వాల్‌ టిమ్స్‌లో ఒక్కో ఆస్పత్రిలో 200 పడకల చొప్పున సూపర్‌ స్పెషాలిటీ మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు రానున్నాయని వెల్లడించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎక్కువ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తల్లులు, పిల్లలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. గర్భిణులకు డయాలసిస్‌ సేవలున్నాయని చెప్పారు. గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్‌ వ్యాధులతో బాధపడే తల్లులకు, పిల్లలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలందుతాయని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌తో పాటు పలు రకాల చర్యలతో ఇప్పటికే మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. దేశంలోనే అతి తక్కువగా తల్లులు, శిశువుల మరణాలున్న మూడో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
త్వరలో సంతాన సాఫల్య కేంద్రం
పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలను త్వరలో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. వీటితో పాటు గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సెంటర్‌ ను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. క్వాలిటీ మేనేజ్మెంట్‌, హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్మెంట్లో తొలిసారిగా గాంధీ ఆస్పత్రికి ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ రావడం పట్ల మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీలు వాణీదేవీ, బేగ్‌, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.