గురిచూసి పేల్చింది తొలి ప‌త‌కం ప‌ట్టింది

Manu Bhakarమను భాకర్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎవరిని కదిలించినా.. ఏ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను చూసినా ఆమె గురించే చర్చ. దేశ ప్రధాని నుంచి సామన్య పౌరుడి వరకు ఆమెకు సలాం చేస్తున్నవారే. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా… షూటింగ్‌ ఈవెంట్‌లో మెడల్‌ సాధించిన తొలి భారత షూటర్‌గా చరిత్ర సృష్టించి 130 కోట్ల మంది గర్వపడేలా చేసింది. 20 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరి అందరి దృష్టిని ఆకర్షించింది. విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆమె టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఆ యంగ్‌ బుల్లెట్‌ పరిచయం…

మను భాకర్‌ హరియాణాలో 2002లో ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమె తండ్రి రామ్‌కిషన్‌ భాకర్‌. వాణిజ్య నౌకలో ఛీప్‌ ఇంజనీర్‌గా చేస్తున్నారు. తల్లి ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. పాఠశాలలో చదివే సమయంలోనే టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌లో ప్రతిభ కనబరిచింది. మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందింది. ఆయా విభాగాల్లో ఎన్నో పతకాలు సాధించింది.
తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో
14 ఏండ్ల వయసులో అనుకోకుండా షూటింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది. 2016లో రియో ఒలింపిక్స్‌ ముగిసిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. తండ్రికి చెప్పి షూటింగ్‌ పిస్టల్‌ కావాలని కోరింది. ఆయన వెంటనే అంగీకరించారు. తండ్రి ప్రోత్సాహంతో జస్పాల్‌ రాణా పర్యవేక్షణలో షూటింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. 2017 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించి తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది. ఇప్పటికీ అతని కోచింగ్‌లోనే ఆడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం వేరే కోచ్‌తో బరిలోకి దిగిన ఆమె తిరిగి ఆయన్నే కోచ్‌గా ఎంచుకుంది.
పతకాల వర్షం
2017లో కేరళలో జరిగిన నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది బంగారు పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్‌ షూటింగ్‌ ఫెడరేషన్‌ ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన అర్హత రౌండ్లలో జూనియర్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 16 ఏండ్ల వయసులోనే 2018 కామన్వెల్త్‌ గేమ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. 2018 యూత్‌ ఒలింపిక్స్‌లోనూ బంగారు పతకం సాధించిన ఆమె 10 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. 2019లో జరిగిన మూడు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లలో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో బంగారు పతకాలను గెలుచుకుంది. చైనాలో జరిగిన వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగతంగా, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ స్వర్ణం సాధించింది. 2019 మ్యూనిక్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో నాల్గో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో చోటుదక్కించుకుంది. 2021 ఢిల్లీ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో బంగారు, రజత పతకాలు, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్యం సాధించింది.
టోక్యోలో కన్నీరు పెట్టుకొన్నా…
2021లో తన 19 ఏండ్ల వయసులోనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన మను తీవ్రంగా నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్‌టల క్వాలిఫికేషన్‌ మధ్యలో ఆమె పిస్టోల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఫైనల్‌కు చేరుకుండా చేసింది. పోటీ నుండి బయటకు రావాల్సి వచ్చింది. పిస్టల్‌ను రిపేర్‌ చేసే సరికి ఆమె 6 నిమిషాల సమయాన్ని కోల్పోయింది. అప్పటికే ఇతర అథ్లెట్లు ముందుకు దూసుకుపోగా.. మను రెండు పాయింట్ల తేడాతో ఓడి కన్నీటి పర్యంతమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఏ ఈవెంట్‌లో కూడా మను ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న ఆమె 2021 లిమాలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించింది. నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. ఇలా ప్రతి ఏడాది పతకాలతో మెరుస్తూనే ఉంది. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో ఆమెను సత్కరించింది.
తొలి మహిళా షూటర్‌గా…
పారిస్‌ ఒలింపిక్స్‌కు అన్ని విధాల సిద్దమై బరిలోకి దిగింది. ఆడిన తొలి ఈవెంట్‌లోనే పతకంతో మెరిసింది. షూటింగ్‌ విభాగంలో భారత్‌కు ఇది ఐదో ఒలింపిక్‌ మెడల్‌. తొలి మహిళా షూటర్‌గా మను చరిత్రకెక్కింది. 2004 అథెన్స్‌ ఒలింపిక్స్‌లో రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించగా.. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా బంగారు పతకం సాధించాడు. 2012 రియో ఒలింపిక్స్‌లో విజరు కుమార్‌ సిల్వర్‌, గగన్‌ నారంగ్‌ బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక్క మెడల్‌ కూడా రాలేదు. తాజా పారిస్‌ ఒలింపిక్స్‌లో మను కాంస్యంతో మెరిసింది. ఈ ఒలింపిక్స్‌లో మను మహిళల 25మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌తో పాటు, 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లలో పోటీపడుతోంది. టింగ్‌ ఈవెంట్‌లో మెడల్‌ సాధించిన తొలి భారత షూటర్‌గా నిలిచిన మను 130 కోట్ల మంది గర్వపడేలా చేసింది.