– హాలో ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్-1
న్యూఢిల్లీ : ఆదిత్య ఎల్-1 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను ఇస్రో శనివారం విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 127 రోజులపాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి శుక్రవారం చేరింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది.ఇక్కడి నుంచే సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (%ూ%1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపుతుంది. లాగ్రాంజ్ పాయింట్ భూమి-సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది. దాంతో ఇక్కడి నుంచే పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో మిషన్‌ను చేపట్టింది. విజయవంతంగా ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.