అది 2000, సెప్టెంబర్ 19… ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం… ఒలింపిక్స్ బహుమతి ప్రధానోత్సవ వేదికపై పాతికేండ్ల అచ్చ తెలుగు అమ్మాయి సగర్వంగా నిలబడింది. భారతదేశం మొత్తం ఆమె గురించే చర్చించుకుంటోంది. దానికి కారణం ఒలిపింక్స్‌లో దేశానికి పతకం తెచ్చిపెట్టిన మొదటి భారతీయ మహిళ ఆమే కావడం. అలా ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగి ఆ వేదికపై కాంస్యం అందుకుంది. ఆమే ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి. ఈ రోజు ఒలింపిక్స్ డే సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో…
మల్లీశ్వరి 1975లో శ్రీకాకుళం జిల్లాలోని వూసవానిపేటలో జన్మించారు. తల్లి శ్యామల, తండ్రి మనోహర్. తండ్రి వ్యాపారరీత్యా వీరు ఆముదాలవలసలో స్ధిరపడ్డారు. వీరి కుటుంబానికి క్రీడలంటే ఎంతో అభిమానం. ఈమెకు నలుగురు అక్కలు. వీరంతా వెయిట్ లిఫ్ట్‌ంగ్‌లో శిక్షణ తీసుకున్నారు. తల్లి శ్యామల క్రీడల్లో తన బిడ్డలను ఎంతో ప్రోత్సహించేవారు. తండ్రి ఫుట్‌బాల్ ప్లేయర్. అటువంటి కుటుంబంలో పుట్టిన మల్లీశ్వరి 12 ఏండ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్‌ను ప్రారంభించారు.
కోచ్ తిరస్కరించారు
ఆట మొదలుపెట్టిన కొత్తలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే పాతకాలపు పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టారు. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆకర్షితురాలయ్యారు. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలంశెట్టి అప్పన్న ఆమెను తిరస్కరించారు. ఆమెలోని పట్టుదల చూసిన తర్వాత అవకాశం కల్పిం చారు. తల్లి శ్యామల మల్లీశ్వరికీ ఎంతో అండగా నిలబడ్డారు.
అంచనాలు లేవు
సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకున్నారు. అయినా సరే ఒలింపిక్స్ పతకంపై ఆమెకు అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌లో మన ప్లేయర్లు తడబటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించింది. అయితే మల్లీశ్వరి వెయిట్ కేటగిరికి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండాపోయింది. 1993, 94, 95, 96లలో వరుసగా నాలుగేండ్ల పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకున్నారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించారు. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరికి మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించారు. అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరిలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొనకపోగా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేండ్లు అవుతుంది. దాంతో మళ్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని అందుకుని భారతీయ తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
అసలైన మార్పు
80ల్లో మన దేశ క్రీడాకారిణులు మంచి ఫలితాలు సాధించడం మొదలుపెట్టారు. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికలపై రాణించారు. అయితే మల్లీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే మహిళలకు అన్ని క్రీడల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ‘ఒలింపిక్స్‌లో సైనా, సింధు, మెరీకోమ్ వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్ దిగ్గజం అంజూ జార్జ్ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది. సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫొగాట్ ప్రకటించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినపుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించి ట్రైనింగ్‌లో మాకు మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిం దనడంలో సందేహం లేదు’ అంటూ కొనియాడారు.
మొదటి వైస్ చాన్స్‌లర్‌గా…
తోటి వెయిట్‌లిఫ్టర్ రాజేశ్‌త్యాగిని వివాహం చేసు కున్న తర్వాత ఆమె హరియాణా లోని యమునా నగర్‌లో స్థిరపడ్డారు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అక్కడే ఓ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా కొంత కాలం పని చేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లో ఈమె ప్రదర్శనకు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ప్రారంభిం చిన స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొదటి వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విజయ ప్రస్థానం
1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్ లిచెనిడ్ తారానెంకో గుర్తించి సరైన సూచన చేశారు. దాంతో బెంగళూరులోని సారు కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది. అక్కడ చేరిన తర్వాత జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలయింది. అప్పటి
నుండి వరుస అవకాశాలు అందిపుచ్చుకొని వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో సంచలన ప్రదర్శనలతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకున్నారు. 12 ఏండ్ల వయసులో తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగింది.
– సలీమ