– ది ఎకనామిస్ట్
ఉక్రేనియన్ నాయకుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ దేశానికి రష్యాపై ఆధిపత్యం చెలాయించడానికి తగినంత మానవశక్తి లేదా వనరులు లేవనే వాస్తవం తేటతెల్లమౌతోందని ది ఎకనామిస్ట్ గురువారం రాసింది. జెలెన్‌స్కీ ప్రస్తుతం తన ”విజయ వ్యూహ” ప్రతిపాదనను ప్రచారం చేయడానికి అమెరికా సందర్శిస్తున్నాడు. ఇది పశ్చిమ దేశాలు అందిస్తున్న నగదు, ఆయుధాల సహాయ స్థాయిని పెంచుతుందని, తద్వారా కీవ్ పోరాటాన్ని కొనసాగించవచ్చని ది ఎకనామిస్ట్ పేర్కొంది. ఉక్రేనియన్ ఆర్థిక వ్యవస్థ భయంకరమైన సంక్షోభ స్థితిని ఎదుర్కొంటుందని, సైనిక సిబ్బంది సంఖ్య క్షీణిస్తున్నట్టు బ్రిటీష్ మ్యాగజైన్ వివరించింది. వాలంటీర్లను రంగంలోకి దింపుతున్న మాస్కోలా కాకుండా, కీవ్ బలవంతపు నిర్బంధంపై ఆధారపడుతున్నదని ఆ పత్రిక వివరించింది.”సైన్యంలో బలవంతంగా చేర్పించిన వారిలో చాలా మంది పోరాడటానికి పనికిరారని అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. వయసు పైబడినవారిలో చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. తాగుబోతులవుతున్నారు. సైన్యం నుంచి బయటపడటానికి స్పష్టమైన మార్గం లేదు. దీని వల్ల సైన్యంలో చేరటం చావటానికి వన్-వే టికెట్ లాగా కనిపిస్తుంది” అని ది ఎకనామిస్ట్ అంటోంది. ”యాక్టివ్ డ్యూటీలో ఉన్న 5-10 శాతం మంది సైనికులు సెలవు లేకుండా గైర్హాజరయ్యారు” అని, ”30 శాతం కంటే ఎక్కువ మంది ఉక్రేనియన్లు డ్రాఫ్ట్-డాడ్జింగ్ సిగ్గుచేటుగా భావిస్తున్నారు” అని ది ఎకనామిస్టు పేర్కొంది.
సైనిక సేవకు అర్హులైన యువకులు జెలెన్‌స్కీ రాజీలేని వైఖరికి మద్దతు ఇవ్వడానికి చాలా తక్కువ మొగ్గు చూపుతున్నారు. గురువారం ఒక ప్రత్యేక సంపాదకీయ కథనంలో, పత్రిక జెలెన్‌స్కీ తన సైనిక వ్యూహంతో ”వాస్తవికతను ధిక్కరిస్తున్నట్టు” ఆరోపించింది. అతను దానిని కొనసాగిస్తే ”ఉక్రెయిన్ మద్దతుదారులను తరిమికొట్టడంతో పాటుగా ఉక్రేనియన్ సమాజాన్ని మరింత విభజించవచ్చు” అని హెచ్చరించింది. శాంతి కోసం రాయితీలు కల్పించిన తర్వాత రష్యాపై విజయాన్ని ”సంపన్నమైన, పాశ్చాత్య దేశాల వైపు ఒరిగిన ప్రజాస్వామ్యంగా” ఉక్రెయిన్ పునర్నిర్వచించుకోవాలని ది ఎకనామిస్ట్ సలహా ఇచ్చింది. ”ఈ భయంకరమైన సత్యాన్ని స్వీకరించినందుకు ప్రతిఫలంగా, పాశ్చాత్య నాయకులు ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సామర్థ్యం, భద్రతా హామీలను ఇవ్వడం ద్వారా తన యుద్ధ లక్ష్యాన్ని విశ్వసనీయంగా మార్చుకోవాలి” అని సూచించింది.ఉక్రెయిన్‌ను తన కూటమిలోకి లాగాలనే నాటో ఉద్దేశం శత్రుత్వానికి కీలకమైన కారణాల్లో ఒకటని మాస్కో పేర్కొంది. స్థిరమైన శాంతి కోసం దాని దష్టిలో ఉక్రెయిన్ సైనిక బలం, దాని అలైన్‌మెంట్‌పై పరిమితి ఉంటుంది. సంఘర్షణ ప్రారంభదశలో శాంతి చర్చల సమయంలో కీవ్ ఆ నిబంధనలకు అంగీకరించింది. అయితే పశ్చిమ దేశాల సూచన మేరకు ఉక్రెయిన్ యు-టర్న్ తీసుకున్న విషయం జగధ్వితమే.