అనగనగా ఓ అడవి ఉంది. అది చీమలు దూరని చిట్టడవి. కాకులు దూరని కారడవి. ఆకాశం వైపు చూస్తూ ఏపుగా పెరిగే పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు. వేల మైళ్ళ దూరం ఎటుచూసినా చిక్కటి అడవి. పట్టపగలే చిమ్మ చీకటి అడవి. చిత్తడి అడవి.
ఆ అడవుల్లో రోజుకు 16 గంటలు వర్షం కురుస్తుంది. అందుకే అక్కడి వాతావరణం చల్లగా, తేమగా ఉంటుంది.
రోగాలు తెచ్చే దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకాల అడవి జంతువులు, క్రూర మృగాలకు నివాసం ఆ అడవి.
అటువంటి అడవిలోకి వెళ్ళడానికి ఎవరైనా భయపడతారు. అటువంటి చోట ఓ అద్భుతం జరిగింది. అదేంటో తెలుసా.. నలుగురు పిల్లలు ఆ అడవిలో ఉన్నారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు 40 రోజులు ఉన్నారు.
వాళ్ళు అంత దట్టమైన అడవిలో ఎలా ఉన్నారు? ఎందుకు వెళ్లారు? ఎలా వెళ్లారు? ఏం తిన్నారు? ఎక్కడ నిద్రపోయారు? వాళ్ళ వయసు ఎంత? ఇలా ఎన్నెన్నో మీ సందేహాలకు సమాధానం చెబుతా వినండి.
13 ఏళ్ల లెస్లీ తన అమ్మ నాన్న, ఇద్దరు తమ్ముళ్లు చెల్లెలుతో కలిసి ఓ బుల్లి విమానంలో ఆ దట్టమైన అడవి మీదుగా ప్రయాణిస్తున్నది. ఆ రోజు వాతావరణం అస్సలు బాగోలేదు. దట్టంగా అలుముకున్న నల్లటి మేఘాలు చీల్చుకుంటూ విమానం పోతున్నది. అకస్మాత్తుగా ఆ కారడవిలో వారి విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో లెస్లీ నాన్న, పైలట్ అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లెస్లీ అమ్మ చనిపోయింది.
ఆశ్చర్యంగా చిన్న పెద్ద గాయాలతో లెస్లీ, ఆమె చెల్లెలు, తమ్ముళ్లు బతికారు.
లెస్లీ కుటుంబం ప్రయాణిస్తున్న విమానం గమ్యం చేరలేదు కదా.. ఆ విషయం దేశమంతా తెలిసింది. అప్పటికే రెండు వారాలు గడచిపోయాయి. యుద్ధప్రాతిపదికన వెతుకులాట మొదలైంది. మిలటరీ వాళ్ళు విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్నారు. ముగ్గురు పెద్దలు చనిపోయినట్లు తెలుసుకున్నారు. కానీ పిల్లల జాడ తెలియలేదు. ఆ దట్టమైన అడవి అంతా జల్లెడ పట్టడం మొదలు పెట్టారు.
పిల్లల అడుగులు, మురికైన డైపర్, సీసా, తిని పడేసిన పండ్లు, బేబీ బాటిల్, చెప్పులు వంటి కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. పిల్లలు బతికే ఉన్నారని అనుకున్నారు. 70 మంది గిరిజన స్కౌట్స్, వందకు పైగా మిలటరీ వాళ్ళు అంగుళం అంగుళం వెతుకుతున్నారు.
పిల్లలేమో ఒకేచోట లేరు. ఆకలి అవుతున్నది. దాహం అవుతున్నది. రాత్రయితే క్రూర మృగాల నుండి కాపాడుకోవాలి. అందుకే తమను తాము కాపాడుకోవడం కోసం, ఆహారం కోసం, నీళ్ల కోసం విమానం కూలిన ప్రదేశం వదిలి వెళ్లారు. ఒక చోటు నుండి మరో చోటుకు మారుతున్నారు.
ఆ పిల్లలకు 13 ఏళ్ల లెస్లీ లీడర్. ఆదివాసీ తెగకు చెందిన ఆమెకు అడవి గురించి కొద్దిగా తెలుసు. అడవిలో ఆహారం వెతకడం, ప్రమాదాలను ఎదుర్కోవడం, వాటిని తప్పించుకోవడం ఎలాగో తెలుసు. చెట్లు ఎక్కడం దిగడం వాళ్ళకి అలవాటు. చెట్ల మధ్య నుంచి పరిగెత్తడం అలవాటు. చెట్ల నుంచి రకరకాల పండ్లు కోసుకుని తినడం తెలుసు.
ఇదంతా ఆమెకు తెలియకుండానే వేటకు వెళ్ళినప్పుడు, పండు తెచ్చేటప్పుడు తమ పెద్దలు ఏమి తెస్తున్నారో గమనించేది. అడవిలో ఏం చేయొచ్చు, ఏం చెయ్యకూడదో నేర్చుకుంది. ప్రకృతిని అర్థం చేసుకుంది.
ఎందుకంటే అది వాళ్ళ అడవి. వాళ్ళు ఆ అడవి తల్లి ఒడిలో పుట్టారు. అక్కడే పెరిగారు. అడవి సంరక్షణలో ఆ ప్రకృతితో ఉన్నారు. అందుకే వారికి అడవి అంటే భయం లేదు. అదే వారిని కాపాడింది.
ఆ అడవిలో ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి జంతువు వారికి తోడుగా నిలిచింది. చెట్లు రక్షణ ఇచ్చాయి. కోతులతో మనిషికి ఉన్న సంబంధంతో లెస్లీకి తమను కాపాడుకోవడం ఎలాగో అర్థమైంది. వాటి శబ్దాలు, అడుగులు కూడా గమనించేది. హెచ్చరికలు అందుకునేది. కనిపించిన రకరకాల అడవి జంతువులు, చిరుతలు, పాములు, తోడేళ్ళ నుంచి కాపాడుకుంది. తన వాళ్ళను కాపాడుకో కలిగింది లెస్లీ.
ఆకును మడిచి పదకొండు నెలల చిన్న చెల్లికి ఆహారం అందించింది. దొరికిన విత్తనాలు తమ్ముళ్లకు తినిపించింది.
తినడానికి చిన్న పండు దొరికినా, గుక్కెడు నీళ్లు దొరికినా మొదట తన చెల్లెలు తమ్ముళ్లకే ఇచ్చింది. చివరకు మిగిలింది తాను తినేది లెస్లీ.
విషపూరితమైన ఆకులేవో, మంచివేవో లెస్లీకి బాగా తెలుసు. పారే నీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసు. శుభ్రం చేసిన నీటిని కొద్ది సేపటి తర్వాత వాడేది. ఎర్రటి తియ్యని పండ్లు, విత్తనాలు తిన్నారు. అవి వారి శరీరం డి హైడ్రేట్ కాకుండా ఆపాయి. శక్తి ఇచ్చాయి. 11 నెలల చెల్లెలిని కాపాడుకోవడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది లెస్లీ. ఆ పసిపిల్ల దొరికిన ఆహారం ఏది పడితే అది తినే వయసు కాదు. విమానం కూలిన దగ్గర వెతికినప్పుడు దొరికిన పాలపొడి లాంటి పొడి నీళ్లలో కలిపి తాగించేది. అది పట్టడానికి బాటిల్ లేదు. ఎక్కడో పడిపోయింది. అందుకే ఆకును మడిచి పాప నోట్లో పెట్టి నెమ్మదిగా పట్టింది.
కొన్ని సార్లు చెట్టుతొర్రలో దాక్కున్నారు. వారి శరీరాన్ని దోమలు, కీటకాలు కుడుతున్నాయి. అవి కుట్టకుండా కొన్ని ఆకు రసాలు తముళ్లు, చెల్లెలు శరీరానికి పూసి తాను పూసుకునేది. రాత్రిపూట అరటి ఆకులు పరుచి, విమానంలోంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ కాగితం కప్పుకుని పడుకునే ఏర్పాటు చేసింది.
అమ్మ నాన్న ప్రాణంతో లేరు. ఇక ఎప్పటికీ అమ్మ నాన్న లేరని తెలుసుకున్న లెస్లీకి బాగా దు:ఖం వచ్చింది. చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ, బాధపడితే లాభంలేదని లెస్లీకి అర్థమైంది. బతికున్న తోబుట్టువులను కాపాడుకోవడం ముఖ్యం అనుకుంది. ఆమె నుదిటిపై విమానం కూలినప్పటి దెబ్బలు బాధ పెడుతున్నప్పటికీ లెక్క చేయలేదు. తమ గాయాలకు అడవిలో దొరికే ఆకు పసర్లు పులిమింది లెస్లీ.
వాళ్ళకి అడవిలో ఉన్నామని తెలుసు కానీ అది ఎంత పెద్ద అడవో, ఎంత ప్రమాదమైనదో, తిరిగి జనంలోకి వస్తారో లేదో ఏమీ తెలియదు. చావడం బ్రతకడం గురించి ఆలోచించలేదు. తమకు ఆహారం, తాగు నీరు వేటలో ఉన్నది లెస్లీ. ఈ నలభై రోజులు అనుక్షణం 11 నెలల చెల్లిని చంకనేసుకుని, ఓ చేత నాలుగేళ్ళ తమ్ముడిని చేత పట్టుకుకుని తొమ్మిదేళ్ల పెద్ద తమ్ముడి సహాయంతో వారిని జాగ్రత్తగా కాపాడుకుంది, బతికించుకుంది లెస్లీ.
వీళ్ళు అడవిలో ఉండగానే చిన్న తమ్ముడు నాలుగవ పుట్టినరోజు వచ్చి వెళ్ళిపోయింది. చెల్లెలు మొదటిపుట్టినరోజు దాటిపోయింది.
1600 మైళ్ళలో విస్తరించిన ఆ అడవిని హెలికాఫ్టర్లు జల్లెడపట్టేవి. 170 మంది వాళ్ళ కోసం వెతుకుతున్నారు.
ఓ రోజు… ‘నేను మీ అమ్మమ్మను, మీరు భయపడకండి, మీ ధైర్యం కోల్పోకండి, మిమ్మల్ని వెతుక్కుంటూ మన వాళ్ళు వస్తున్నారు’ అని అమ్మమ్మ తమ భాషలో పంపిన సందేశం హెలికాప్టర్ నుంచి లెస్లీ పెద్ద తమ్ముడు విన్నాడు. ఆ విషయం అక్కకు చెప్పాడు. తర్వాత లెస్లీ కూడా విన్నది. హెలికాప్టర్ నుంచి వదిలిన ఆహార పొట్లం కనపడింది.
అమ్మమ్మ సందేశం వాళ్ళకి గొప్ప శక్తిని ఇచ్చింది. తమ కోసం వెతుకుతున్నారని అర్ధమై ఉన్నచోట ఉండిపోయారు. ఇప్పటి వరకు తమ కోసం వెతుకుతున్నారని లెస్లీ వాళ్లకు తెలియదు.
విమానం కూలిపోయిన చోటుకు మూడు మైళ్ళ దూరంలో చిన్న నది పక్కన పోలీస్ కుక్క మొదట పిల్లల్ని గుర్తించింది.
అప్పటికీ రెండుసార్లు వాలంటీర్లు వాళ్ళకి కొద్ది దూరం వరకు వచ్చారు కానీ ఆ దట్టమైన అడవిలో గుర్తించలేకపోయారు.
ఎలాగైతేనేం 40వ రోజు లెస్లీ వాళ్ళు దొరికారు.
తమ దగ్గరకు వచ్చిన వారిని చూసి లెస్లీ పరుగున వెళ్లి హగ్ చేసుకుంది. చెల్లిని వాళ్ళ చేతికి ఇస్తూ నేను చాలా ఆకలితో ఉన్నా, బాగా అలసిపోయి ఉన్నా అని చెప్పింది.
మిలిటరీ వాళ్ళు నలుగురు పిల్లల్ని హెలికాప్టర్‌లో తీసుకెళ్లి హాస్పిటల్‌లో చేర్పించడంతో కథ సుఖాంతం అయింది.
అడవుల్లో బతకడం అంటే పెద్ద వాళ్ళకే పెద్ద సవాల్. కానీ పిల్లలు 40 రోజులు ఉన్నారంటే అద్భుతం.
అడవి ప్రమాదకరం కాదు. మనలను రక్షిస్తుంది. అండగా నిలుస్తుంది.
అడవి అంటే పచ్చదనం ఒక్కటే కాదు. మనకు అవసరమైన ఎనర్జీ ఇస్తుంది. స్వచ్ఛమైన గాలి ఇస్తుంది. దానికి మనం ఏమీ ఇవ్వకపోయినా అది మనకు ఎంతో ఇస్తుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్పిస్తుంది.
అడవి ఒక అద్భుతం.
(అమెజాన్ అడవుల్లో తప్పిపోయి 40 రోజుల తర్వాత దొరికిన బాలల వృతాంతం నేపథ్యంలో)
– వి.శాంతి ప్రబోధ, 9866703223