ఫ్రెంచి వామపక్ష కూటమి-ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యక్రమం!

ఫ్రెంచి వామపక్ష కూటమి-ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యక్రమం!ఈ మధ్య యూరోపియన్‌ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పచ్చి మితవాద శక్తులు చెప్పుకోదగ్గ రీతిలో విజయాలు సాధించాయి. ఈ నేపధ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ఫ్రెంచి పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించాడు. ఈ ఎన్నికల్లో మితవాద శక్తిగా ఉన్న లీపెన్‌ను ఢ కొనడానికి వామపక్ష పార్టీలలో నాలుగు న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, గ్రీన్‌ పార్టీలతోబాటు ఫ్రాన్స్‌ అన్‌బౌడ్‌ (ఇది జీన్‌ లూక్‌ మెలెం కన్‌ నాయకత్వంలో ఉంది) ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమి ఏర్పాటు ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినట్టిది. 1930 దశకంలో ఫ్రాన్స్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ అనే కూటమి ఏర్పడింది. అప్పటికి యూరప్‌లో పెను ప్రమాదంగా ముందుకొచ్చిన ఫాసిజాన్ని, ముఖ్యంగా జర్మనీలో అధికారాన్ని చేజిక్కించుకున్న నాజీ హిట్లర్‌ ఫాసిజాన్ని ఎదిరించడానికి ఈ ఫ్రంట్‌ అప్పట్లో ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు నయా ఫాసిజం యూరప్‌లో పెద్ద ప్రమాదంగా ముందుకొస్తున్న సందర్భంలో ఈ న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ (ఎన్‌పిఎఫ్‌) ఏర్పడింది.
ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా బరిలో ఉన్నవారిలో మాక్రాన్‌ సూటిగానే నయా ఉదారవాద విధానాలను బల పరుస్తున్నాడు. అతడి పార్టీకి విజయావకాశాలు బాగా తగ్గిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తీవ్ర మితవాద శక్తిగా ఉన్న లీ పెన్‌ పార్టీ ఆర్థిక విధానాలమీద ఎటువంటి స్పష్టతా ఇవ్వకుండా దాటవేస్తోంది. ఇప్పటికి ఆ పార్టీ గుత్త పెట్టుబడిదారీ వర్గానికి కొంత అనుకూలంగా ఉంది. ”సరైన తరుణంలో” అది బహిరంగంగానే గుత్త పెట్టుబడితో జట్టు కడుతుంది. మూడవ శక్తిగా ఉన్న ఎన్‌పిఎఫ్‌ తన ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యక్రమాన్ని స్పష్టంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం ఉక్రెయిన్‌ యుద్ధం విష యంలో అమెరికాకు అనుకూల వైఖరిని తీసుకుంది. కూటమి భాగస్వాములైన సోషలిస్టులను కలుపుకు పోవలసి వున్నందున ఈ రాజీ అవసరం అయింది. అదే విధంగా గాజాలో జరుగుతున్న ఊచకోత విషయంలో కూడా మరో భాగస్వామి అయిన మెలెం కన్‌ భావాలకు అనుగుణంగా వ్యవహరిం చింది. ఇలా కొన్ని అంశాలలో రాజీపడినప్పటికీ, నయా ఉదారవాదం విషయంలో మాత్రం స్పష్టంగా పూర్తి వ్యతిరేక వైఖరిని తీసుకుంది.
నెలవారీ కనీస వేతనాన్ని పెంచడం, ఆహార దినుసులు, పెట్రోలు, గ్యాస్‌, విద్యుత్తు వంటి నిత్యావసరాల ధరలపై సీలింగ్‌ విధించడం, ఈ మధ్య మామ్రాన్‌ పెంచిన రిటైర్మెంట్‌ వయో పరిమితిని 64 నుండి తగ్గించడం (దీని వలన ప్రభుత్వం చెల్లించవలసిన పెన్షన్ల బడ్జెట్‌ పెంచాలి), పర్యావరణ రక్షణకు, పౌర సేవలకు కేటాయింపులు భారీగా పెంచడం వంటి ప్రతి పాదనలు ఎన్‌పిఎఫ్‌ కార్యక్రమంలో ఉన్నాయి. వీటన్నింటికీ అయ్యే అదనపు ఖర్చును ఎన్‌పిఎఫ్‌ జాగ్రత్తగా అంచనా వేసి లెక్కలు కట్టింది. ఆ అదనపు ఖర్చు కోసం ద్రవ్యలోటును పెంచకుండా అదనపు వనరుల సమీకరణకు ప్రతిపాదనలు చేసింది. తద్వారా యూరోపియన్‌ యూనియన్‌ ద్రవ్యలోటుపై విధించిన నియంత్రణకు లోబడి నడుచుకోవచ్చు. అదనపు వనరుల కోసం సంపద పన్నును మళ్ళీ ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించింది (దీనిని మాక్రాన్‌ గతంలో రద్దు చేశాడు). వివిధ రకాల పన్నుల వసూళ్లలో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రతిపాదించింది.వారసత్వంగా సంపదను పొందేవారు ఒక పరిమితికి మించి ఆ సంపదను పొందకుండా ఉండేలా సీలింగు విధించాలని, ఆ సీలింగుకు మించి ఉన్న సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించింది.
ఇదంతా నయా ఉదారవాదానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉంది. ఇన్నేళ్లుగా నయా ఉదారవాదం ప్రబోధిస్తున్న విష యాన్ని పరమ సత్యంగా ప్రధాన స్రవంతి మీడియా ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ ప్రచారం ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదు. భారతదేశంతో సమా యావత్‌ ప్రపంచమంతటికీ ఈ ప్రచారం సాగింది. ఒక సందర్భంలో (కరోనా అనంతర కాలంలో) అన్ని దేశాలూ కార్పొరేట్‌ పన్ను కనీసం 25 శాతం విధించాలన్న ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీనికి కారణం ఉంది. పెట్టుబడులను ఆకర్షించడం కోసం దేశాలు పోటీ పడి కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ వచ్చాయి. పన్ను ఎక్కువగా ఉంటే పెట్టుబడులు తమ దేశానికి రావన్న ఆందోళన దీనికి కారణం. కాని దాని ఫలితంగా కార్పొరేట్‌ పన్ను రేటు మొత్తంగానే తగ్గిపోయింది. ప్రభుత్వాలకు రాబడి తగ్గిపోయింది. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి అన్ని దేశాలూ కూడబలుక్కుని కార్పొరేట్‌ పన్ను కనీసం 25 శాతం ఉండేలా నిర్ణయించాలని ప్రతిపాదన వచ్చింది. కాని ఈ ప్రతిపాదన మీద చాలా దేశాలు రకరకాలుగా అడ్డుపుల్లలు వేశాయి. చివరకి కనీస కార్పొరేట్‌ పన్ను 15 శాతం ఉండేందుకు అంగీకారం కుదిరింది. ఐతే చాలా దేశాల్లో అప్పటికే అంతకన్నా ఎక్కువ పన్ను ఉంది. బడా కార్పొరేట్లమీద అదనపు పన్నులు విధించడానికి ప్రభుత్వాలు ఎంత వెనకాడుతున్నాయో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఇది నయా ఉదారవాదం పర్యవసానం. ఇటువంటి పరిస్థితిలో ఎన్‌పిఎఫ్‌ బడా సంపన్నుల మీద అదనపు పన్నులు విధించాలని ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక సంపద పన్ను విధించే విషయంలో ఎక్కువగా చేస్తున్న వాదన ఒకటుంది. ఈ సంపద పన్నును అమలు చేయడం చాలా కష్టం అని, దాని ద్వారా వచ్చే ఆదాయం కన్నా ఆ పన్ను వసూలు కోసం ఏర్పాటు చేసే యంత్రాంగానికి అయే ఖర్చు ఎక్కువ అని ఆ వాదన అంటుంది. భారతదేశంలో గతంలో ఉన్న సంపదపన్ను విధానాన్ని మార్చివేయడాన్ని సమర్ధించుకోడానికి ఈ వాదననే ముందుకు తెచ్చారు. సంపద పన్నును అరకొరగా వసూలు చేయడం, దాని ఫలితంగా వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని చూపించి అసలు సంపదపన్ను వసూలు చేయడమే దండగ అని చెప్పి ఏకంగా సంపద పన్నునే రద్దు చేయడం వాళ్ల వ్యూహం.
ఎన్‌పిఎఫ్‌ ఇప్పుడు ప్రతిపాదించినట్టే గతంలోనూ వేరు వేరు రాజకీయ కూటములు సంపదపన్ను విధించాలన్న ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయి. అమెరికాలో గత అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బెర్నీ శాండర్స్‌, ఎలిజబెత్‌ వారెన్‌ సంపద పెరిగే కొద్దీ దాని మీద విధించే పన్ను రేటును పెంచాలన్న ప్రతిపాదనలు చేశారు. అమెరికన్‌ పాలకవర్గం వారిద్దరూ డెమాక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్ధులుగా నామినేట్‌ కాకుండా చూసుకుంది. ఆ కారణంగా వారి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఈ మధ్య ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటీ, అతడి బృందం భారతదేశంలో సంపద పన్నును తిరిగి ప్రవేశ పెట్టాలని సిఫార్సు చేశారు. ఈ బృందం ప్రపంచ అసమానతల గణాంకాలను నిత్యం పర్యవేక్షిస్తూ వాటిని తగ్గించడానికి సూచనలు చేసే సంస్థను నడుపుతోంది (వరల్డ్‌ ఇనీక్వాలిటీ డేటాబేస్‌). ఇటువంటి ప్రతిపాదనను ఇక్కడి వామపక్షాలు ఎప్పటినుంచో చేస్తూనే వున్నాయి.
ఎన్‌పిఎఫ్‌ ప్రతిపాదించిన విధంగా వారసత్వ పన్ను వ్యవస్థను సమూలంగా మార్చడం ఏ ప్రజాస్వామ్య దేశానికైనా చాలా అవసరం.నిజానికి ఈ మార్పు పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. కొన్ని ప్రత్యేక లక్షణాలు, నైపుణ్యాలు కలిగివున్నవాళ్ళకి అందుకు ప్రతిఫలంగా సంపదను సమకూర్చు కునే హక్కు ఉండాలే తప్ప ఆ ప్రత్యేకతలతో, నైపుణ్యాలతో నిమిత్తం లేకుండా కేవలం సంపన్నులకు సంతానంగా జన్మించినందు వల్ల ఆ తల్లిదండ్రుల సంపదపై హక్కు పొందడం న్యాయం కాదు అన్నదే పెట్టుబడిదారీ సిద్ధాంతం. అంతేకాదు, వారసత్వ పన్ను అనేది సంపదపన్ను వసూలు పక్కాగా అమలు జరగడానికి తోడ్పడుతుంది. ఈ రెండు రకాల పన్నులనూ అమలు చేసినప్పుడే పన్నుల చట్రం నుండి ఆ అతి ధనవంతులు తప్పించుకోలేరు. కాని ఈ మధ్య ఒక కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వారసత్వ పన్ను ప్రతిపాదనను చేస్తే (వామపక్షాలు ఎప్పటినుంచో చేస్తున్నాయి) ఆయన మీద మొత్తం మన మీడియా యావత్తూ విరుచుకు పడిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆ ప్రతిపాదనను దారుణంగా వక్రీకరించి హిందూ స్త్రీల తాళిబొట్లను లాగేసుకుని ముస్లింలకు అప్పగించడానికే కాంగ్రెస్‌ ఈ ప్రతిపాదన చేసిందంటూ ప్రచారానికి దిగాడు! ఎన్‌పిఎఫ్‌ ప్రతిపాదనలో కేవలం వారసత్వ పన్ను విధించడం మాత్రమే కాదు, వారసత్వంగా సంక్రమించే సంపద మీద కూడా సీలింగు విధాంచాలని ఉంది. ప్రస్తుత పరిస్థితిలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.
ఇక పౌర సేవల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు పెంచాలన్న ప్రతిపాదన కూడా చాలా ప్రాముఖ్యత కలిగి వుంది. విద్య, వైద్యం వంటి రంగాలను ప్రయివేటీకరించడం వలన కలుగుతున్న హాని అంతా ఇంతా కాదు. ఇది మన దేశపు స్వంత అనుభవం. ఐతే ఈ రంగాలలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం నయా ఉదారవాదానికి ఎంతమాత్రమూ అంగీకారం కాదు. ఈ రంగంలో ప్రయివేటు కార్పొరేట్లకు అపార లాభాలు వస్తున్నాయి. నిజానికి మన దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగకుండా కొనసాగడానికి ఈ రెండు రంగాలనూ ప్రయివేటీకరిచండమే కారణం. తమ బిడ్డల విద్య కోసం, కుటుంబ సభ్యుల వైద్యం కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు చాలా ఎక్కువ.
ఇక నిత్యావసరాల ధరలపై సీలింగు విధించాలనే ప్రతిపాదన కూడా ముఖ్యమైనది. సామాన్య ప్రజల్ని ఇది ధరాభారం నుండి కాపాడుతుంది. కాని ఇది పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకం. నిజానికి పెట్టుబడిదారీ విధానం ధరలు తగ్గాలంటే డిమాండ్‌ తగ్గాలని, అందుకోసం ప్రజల కొనుగోలు శక్తి తగ్గాలని వాదిస్తుంది. మరింత నిరుద్యోగాన్ని పెంచితే అటు వేతనాలూ తగ్గి, ఇటు డిమాండూ తగ్గి ధరలు వాటంతట అవే తగ్గిపోతాయన్నది పెట్టుబడిదారీ సిద్ధాంతం. దీనికి భిన్నంగా నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని వామపక్షాలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్‌ ఇప్పుడు ఒక సంపన్న పెట్టుబడిదారీ దేశం ఫ్రాన్స్‌లో ప్రతిధ్వనిస్తోంది.
నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం ఏమీ లేదంటూ చాలా కాలంగా పనికిమాలిన ప్రచారం సాగుతూనే వుంది. ఇప్పుడు ఎన్‌పిఎఫ్‌ ప్రతిపాదించిన కార్యక్రమం దానికి పూర్తిగా భిన్నంగా, ఒక కొత్త దనాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఫ్రాన్స్‌లోని బూర్జువా మీడియా, కొందరు రాజకీయవేత్తలు, నయా ఉదారవాదాన్ని సమర్ధించేవారు మొదలు, పచ్చి మితవాదులు-అందరూ విరుచుకు పడుతున్నారు. ఈ కార్యక్రమం గనుక అమలులోకి వస్తే ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ యావత్తూ సర్వనాశనం అయిపోతుందంటూ ప్రజల్ని భయపెట్టే కథనాలు ప్రచారం చేస్తున్నారు. కాని ఇప్పటివరకూ ఒపినియన్‌ పోల్స్‌లో ఎన్‌పిఎఫ్‌ 26 నుండి 28 శాతం వరకూ ప్రజల మద్దత్తు పొందుతున్నట్టు, పచ్చి మితవాది లీ పెన్‌ పార్టీకి 31 శాతం మద్దతు ఉన్నట్టు, మాక్రాన్‌ పార్టీకి 20 శాతం కన్నా తక్కువ మద్దతు ఉన్నట్టు తేలింది.
ఫాసిజాన్ని ఓడించడానికి తమ నడుమ ఉన్న అన్ని విభేదాలనూ పక్కనబెట్టి ఫ్రెంచి వామపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. మెలెంకన్‌తో దీర్ఘకాలంగా శత్రుత్వ వైఖరి కలిగివున్న సోషల్‌ డెమాక్రటిక్‌ పార్టీ నాయకుడు గ్లక్స్‌మన్‌ ఆ వైఖరిని విడనాడి ఎన్‌పిఎఫ్‌కు మద్దతు ప్రకటించాడు. ఒకవేళ ఎన్‌పిఎఫ్‌ గనుక గెలిస్తే తనకే ప్రధాని పదవి దక్కాలని పట్టు పట్టబోనని మెలెంకన్‌ ప్రకటించాడు. ఈ విధంగా తమ తమ పదవీ కాంక్షల్ని, సైద్ధాంతిక విభేదాలను సైతం పక్కనబెట్టి పచ్చి మితవాద శక్తులకు అధికారం దక్కకుండా చేయాలన్న పట్టుదలను వారంతా ప్రదర్శించడం గొప్ప విషయం.
నయా ఉదారవాద చట్రం పరిధిని అతిక్రమించి ఒక కొత్త మార్గాన ఆర్థిక వ్యవస్థను నడిపించాలన్న దృక్పథంతో రూపొందిన కొత్త కనీస ఉమ్మడి కార్యక్రమం అంతకన్నా గొప్పవిషయం. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే, ఒక సంపన్న పెట్టుబడిదారీ దేశంలోనే నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నా యం ఈ విధంగా తలెత్తడం కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌