– డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్సీల జనాభా ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు రూ.52,409 (18 శాతం) వేల కోట్లు కేటాయించాల్సి వుండగా కేవలం రూ.33,124 వేల కోట్లు మాత్రమే కేటాయించారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2,91,159 కోట్లు కాగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపుల చట్టం ప్రకారం దళితుల జనాభా 18 శాతం ప్రకారం నిధులు కేటాయించకుండా చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టు అంబేద్కర్ అభయ హస్తం పథకం గురించి ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదని తెలిపారు. బడ్జెట్‌ను సవరించి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన పథకాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.