భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డు నిధులు కార్మికుల సంక్షేమానికే! బీమా కంపెనీల లాభాల కోసం కాదు!!

Building Welfare Board funds for the welfare of workers! Not for profit of insurance companies!!తెలంగాణ ప్రభుత్వం మరియు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా పదకొండు రకాల పథకాలు అమలవుతున్నాయి. ప్రమాద, సహజ మరణం, పాక్షిక అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కట్టబెట్టి బోర్డు బాధ్యతల నుండి వైదొల గాలనే ప్రయత్నం చేయడం కార్మికరంగానికి అన్యాయం చేయడమే. ఆగస్టు 21న ఇన్సూరెన్స్‌ కంపెనీలకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 27 వరకు గడువు పెట్టి 28న టెండర్లు ఓపెన్‌ చేసి ఆ తరువాత అమలు చేస్తున్నట్లు టెండర్‌ నోటీసు ద్వారా ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలను 15.9 లక్షల మంది భవన, ఇతర నిర్మాణ కార్మికులకు,పది వేల మంది గిగ్‌ వర్కర్స్‌కు కూడా వర్తింపచేస్తు న్నట్లు పేర్కొంది. బీమా కంపెనీలకు వెల్ఫేర్‌ బోర్డు స్కీంలను అప్పగించడం మూలంగా కార్మికులకు వచ్చే అదనపు లాభం ఏమిటి? బెనిఫిట్స్‌ ఏమైనా పెరుగుతాయా? కొత్త సంక్షేమ పథకాలు ఏమైనా అమల్లోకి తెస్తు న్నారా? వెల్ఫేర్‌ బోర్డు ఏర్పడింది కార్మికుల సంక్షేమం కోసమే, కానీ బోర్డు నిధులు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు దోచిపెట్టి వారి లాభాలు పెంచడం కోసం కాదు. కార్మికులకు ఏ ప్రయోజనాలు లేనప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పజెప్పడమెందుకు? ప్రభుత్వమే వెల్ఫేర్‌ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
బీమా కంపెనీలకు ఎందుకు?
రాష్ట్రంలో అనేక పోరాటాల ఫలితంగా 2009లో వెల్ఫేర్‌ బోర్టు ఏర్పడింది. ప్రమాద మరణానికి రూ.6 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష, దహన సంస్కరణల ఖర్చు రూ.30 వేలు, శాశ్వత అంగవైకల్యం రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం రూ.4 లక్షలు, ప్రసూతి సహాయం రూ.30 వేలు, వివాహ కానుక రూ.30 వేలు, చనిపోయిన వారిని సొంత గ్రామానికి తీసుకుపోవడానికి వాహన కిరాయి, హాస్పిటల్‌ ఖర్చులు తదితర సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు కొంత అండగా ఉన్నాయి. ఇంకా 60 ఏండ్ల వయస్సు పైబడిన వారికి పెన్షన్‌, కార్మికుల పిల్లలు చదువుకోవడం కోసం స్కాలర్‌షిప్‌లు, గృహవసతి, కార్మిక అడ్డాల్ల్లో షెడ్ల నిర్మాణం, మంచినీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, కర్నాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం లేదు. ఉన్న స్కీమ్‌లకు నిధులూ పెంచడం లేదు. 2009 నుండి ఇప్పటివరకు పాత స్కీమ్‌లే అమలు చేస్తున్నారు, ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాల్లో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణ కార్మికులకు రక్షణగా ఉన్న వెల్ఫేర్‌ బోర్డు స్కీంలు బీమా కంపెనీలకు ఇవ్వడం, ఈ కొద్దిపాటి సహాయం కూడా కార్మికులకు అందకుండా కాకులను కొట్టి గద్దలకు వేసిన చందమే అవతుంది.
రాష్ట్రంలో 25,71,880 మంది కార్మికులు వెల్ఫేర్‌ బోర్డులో పేరు నమోదు చేసుకుంటే 15.9 లక్షల మంది మాత్రమే బోర్డులో అర్హత ఉన్నట్లు సర్కార్‌ లెక్కలు. మిగతా 10.50 లక్షల మంది కార్మికులకు ఎందుకు వర్తించవు? వారిని రెన్యువల్‌ చేయకుండా ఎందుకు అధి కారులు నిర్లక్ష్యం చేశారు. 2009లో మ్యానువల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి, ఇప్పుడు డిజిటలైజ్‌ చేస్తూ వారి పేర్లు కంప్యూ టర్‌లో లేవని, వారికి నష్ట పరిహారాలు, సంక్షేమ పథకాలు అందించడం లేదు. బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులందరినీ రెన్యువల్‌ చేయిం చుకోవాలని గుర్తుచేయాల్సిన బాధ్యత కార్మిక శాఖ అధికార్లకు లేదా? మ్యాన్యువల్‌ చేసిన పేర్లు కంప్యూటర్‌లోకి ఎక్కించాల్సింది ఎవ్వరు. కార్మిక అధికార్ల తప్పులకు కార్మికులను బలిచేస్తారా? ఇప్పుడు రెన్యువల్‌ కాలేదనే పేరుతో 10.50 లక్షల మంది కడుపుకొట్టి, కొద్దిమందికి కొన్ని స్కీంలు మాత్రమే అమలు చేసి, మిగతా స్కీంలకు ఎగనామం పెట్టడం కోసమే ఇన్సూరెన్స్‌ కంపెనీలకా! భవన నిర్మాణ కార్మికులతో ఎలాంటి సంబంధాలు లేని గిగ్‌ వర్కర్స్‌ను బోర్డులో ఎలా మెర్జ్‌ చేస్తారు? వారికి ఎక్కడ నుండి ప్రీమియం చెల్లిస్తారనేది స్పష్టత లేదు. భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొట్టి బడా కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల లాభాలు పెంచడం కోసమేనా? ప్రభుత్వ అధికారులకు వచ్చే కమీషన్ల కోసమే వెల్ఫేర్‌ బోర్డును బీమా కంపెనీలకు కట్టబెడుతున్నారు తప్ప, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు.
బోర్డు నిధులు దుబారా
1996 భవన, ఇతర నిర్మాణ కార్మిక కేంద్ర చట్టం నిబంధనల ప్రకారం వెల్ఫేర్‌ బోర్డు అడ్త్వెజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించి వారి ఆమోదంతోనే నిధులను ఖర్చు చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అడ్వైజరీ కమిటీని నియమించ కుండానే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు దుబారా చేసింది. తెలంగాణ ఏర్పడిన నాటినుండి 2024 జూలై వరకు రూ.5 వేల 65 కోట్లు సెస్సు ద్వారా బోర్డులో జమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి మన రాష్ట్రానికి రావల్సిన వాటా రూ.450 కోట్లు బ్యాంకులో మూలుగుతున్నాయి. గత పదేండ్లగా బోర్డు నుండి అన్నిరకాల నష్టపరిహారాలు, 3,02,687 మంది కార్మికులకు, రూ.1613.5281 కోట్లు మాత్రమే కార్మికుల కోసం ఖర్చు చేశారు. ఇతర శాఖలకు బదిలీ చేసినవి అన్నీ కలిపి రూ.2,649.3286 కోట్లు. కార్మికుల కోసం ఖర్చు చేసిన నిధులకంటే ఇతర శాఖలకు బదిలీ చేసినవే రెండింతలు. బోర్డు నుండి ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు రూ.4262.8767 కోట్లుగా లెక్కలు చూపుతున్నారు. నిధులు పుష్కలంగా ఉన్న కార్మికుల సంక్షేమం మరిచి అడ్డగోలుగా నిధులు దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడింది. కరోనా సమయంలో సివిల్‌ సప్లై శాఖకు రూ. 1,005 కోట్లు, బీసీ బంధు కోసం బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ.500 కోట్లు, సిఎస్‌సి వైద్య పరీక్షల పేరుతో రూ.300 కోట్లు, ఐటిఐ పేరుతో రూ.325 కోట్లు, ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.92 కోట్లు, వృత్తి నైపుణ్యం పెంచు టకు రూ.300 కోట్లు, చలివేంద్రాల నిర్వహణ, ఆఫీస్‌ సుందరీకరణ పేరుతో వేల కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా అడ్డ దారిలో ఇతర శాఖలకు దారి మళ్లించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది.
బోర్డే ముద్దు – కంపెనీలు వద్దు
ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక వెల్ఫేర్‌ బోర్డు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగిస్తే భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, లేబర్‌కార్డులో చిన్న అచ్చు తప్పులు వెతికి కార్మికులకు అందకుండా చేసే ప్రమాదముంది. ప్రస్తుతం అందు తున్న పదకొండు రకాల సంక్షేమ పథకా లను నాలుగు స్కీంలకు తగ్గిస్తారు. బోర్డులో ఉన్న నిధులు మొత్తం కాజేసి, బోర్డునే దివాళా తీయించి, వెల్ఫేర్‌ బోర్డు ఉనికే ప్రమాద కరంగా మారుతుంది. స్కీంలు ఇప్పించడం కోసం మధ్యవర్తులు, కొత్తరకం బ్రోకర్లు తయారవుతారు. అనేక కొత్త రూల్స్‌ రూపొందించి కార్మికులను కొత్తగా నమోదు చేయ కుండా, రెన్యువల్‌ చేయకుండా కార్మికులకు నష్టపరిహారాలు అంద కుండా చేస్తారు. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఇంత నష్ట దాయకంగా ఉన్న ఇన్సూరెన్స్‌ కంపె నీలకు ఇవ్వాలనే ఆలోచనను ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెల్ఫేర్‌బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలి. అడ్వైజరీ కమిటీని నియమించి, అక్రమంగా వివిధ శాఖలకు దారి మళ్లించిన వేల కోట్ల నిధులు తిరిగి బోర్డులో జమ చేయాలి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరణలో భాగంగా మిషన్‌ మోడ్‌ ప్రాజెక్ట్‌ పేరుతో అన్ని రాష్ట్రాల్లో వెల్ఫేర్‌ బోర్డులలో ఉన్న నిధులను ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు దోచిపెట్టడం కోసం ఎంఎంపిని తీసుకువచ్చే ప్రయ త్నం చేసింది. భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్త సమ్మె పోరాటంతో వెనక్కు తగ్గింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఇవ్వలేదు. మన తెలంగాణను ప్రయోగశాలగా అమలుకు పూనుకుంటున్నది. కేంద్రం విధానాలకు నిరసనగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ, పోరాడి సాధించుకున్న వెల్ఫేర్‌ బోర్డు రక్షణకు కార్మిక సంఘాలన్నీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జెఏసి)గా ఏర్ప డ్డాయి. సెప్టెంబర్‌ 23న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపు నిచ్చాయి. లేబర్‌ కమిషనర్‌ కార్యాయలం వద్ద జరిగే ధర్నాలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొని కార్మికుల సత్తా చాటాలి.

– వంగూరు రాములు, 9490098247