భవిష్యత్‌ మనదే..

– కార్యకర్తలతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
– మీరు నిజాం వారసులైతే.. మేము చాకలి ఐలమ్మ వారసులం : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
భవిష్యత్‌ తమదేనని.. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, కేఆర్‌పీకి ప్రాజెకుట్టులిచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ భువనగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ బలంగా వుందని, కార్యకర్తలు భవిష్యత్‌ కోసం ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పాలనలో నిజాయితీ చూపాలన్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వండంటే సమాధానం లేదన్నారు. ఎన్నికల హామీలైన రైతు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో చర్చలు పెట్టాలని సూచించారు. అదానీ, కాంగ్రెస్‌ ఒక్కటే అని ఆరోపించారు. రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్లమెంట్‌లో తెలంగాణ కోసం మాట్లాడే వారు బీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రమే అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని విమర్శించారు. భువనగిరిలో పైళ్ల శేఖర్‌ రెడ్డి ఓడిపోలేదని కొంతమంది మోసం చేశారని చెప్పారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు నిజాం వారసులైతే.. తాము చాకలి ఐలమ్మ వారసులమని, జైల్లో వేస్తామంటే భయపడేవారు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంతో విర్రవీగడం మంచిది కాదని, నల్లగొండకు ఏం చేశారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటానన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో లోపాలను సరిదిద్దుకుని.. అధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు కొలుపుల అమరేందర్‌, జడల అమరేందర్‌, రచ్చ శ్రీనివాస్‌ రెడ్డి, జనగాం పాండు, ఓం ప్రకాష్‌, జడ్పిటిసి బీరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.