ఆట మనందరికీ తెలిసిన పదం. గేమ్, ఖేల్, ఆట ఇలా ఏ భాషలో పలికినా అందరికీ ఇట్టే అర్థమయిపోతుంది. ఆట అంటేనే ఒక పోటీ వుంటుంది. గెలుపు, ఓటములూ ఉంటాయి. ఆదిమంలో ఆహారం కోసం వేట కూడా ఆటలా సాగేది. ఆహారం దొరికితే మనిషి గెలిచినట్లు. దొరక్కపోతే తప్పించుకుపోయిన జంతువు గెలిచి బతికి బట్టకట్టినట్లు. ఆట అంటేనే కొంత సరదా ఉంటుంది. కొందరికి ఆట కూడా ప్రాణ సంకటంగా ఉండేది. బానిస సమాజాల్లో బానిసల మధ్య యుద్ధం పెట్టి ఎవరో ఒకరు చస్తే ఆనందించే ఆటను వినోదంగా చూసేవారు బానిస యజమానులు. ఇదంతా అప్పుడెప్పుడో జరిగినవి. ఇప్పటి ఆటలు వేరు. ఆధ్యాత్మికులు మాత్రం ఈ ప్రపంచం, ఇందులోని మనుషులు ప్రవర్తనలు అన్నీ దేవుడు ఆడించే ఆటలో భాగమే అంటారు. అంతవరకు ఫర్వాలేదు. ఇప్పుడు దేవుడి ఆటనూ మనుషులే ఆడటం చూస్తున్నాము. అకస్మాత్తుగా నాయకుడు దేవుడైపోయి ఆట నాదే అంటాడు. ఆడించే వాడినీ నేనేనని కొత్త అవతారమెత్తిన ఆట భలే హాస్యరసాన్ని పండిస్తుంది. రామాయణంలో పిడకల వేటలాగా, ఆటలో అరటిపండు లాగా ఇలా కొన్ని జరిగిపోతుంటాయి. వీటిని గురించి పెద్దగా చెప్పుకుని చరిత్ర జ్ఞానం పొందేదేమీ ఉండదు.
మన దేశానికే చెందిన ఆట కబడ్డీ. చిన్నతనంలో ఆటలో ఉండే మజా ఏమిటో ఆ ఆటలో కనపడేది. హాకీ, పుట్‌బాల్, బాస్కెట్ బాల్, షటిల్, బ్యాట్‌మెంటన్ ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఏ ఆటయినా ఆడటంలోనే ఒక స్ఫూర్తి, చైతన్యం ఉండేవి. శారీరక, మానసిక ఆనందానికి దోహదపడేవి. గెలుపోటములను సమంగా చూడగలిగే మానసిక స్థిరత్వాన్ని, బలాన్ని అటలు ఇస్తాయి. ఇప్పుడీ ఆటల ప్రాధాన్యతా లేదు, ఆ స్ఫూర్తీ కనిపించడం లేదు. ఇప్పుడు ఆటంటే క్రికెట్టే! క్రికెట్‌కున్న క్రేజీ మరే ఆటకూ లేకుండా పోయింది. పోనీ ఆట ఆటలాగానే ఉందా అంటే అదీ లేదు. ఆటకూ, ఆట వెనకాలకూ ఆర్థిక కోణాలే ఎక్కువైపోయాయి. ఆటల ప్రాధాన్యత ఆటగాడికి పలికిన డబ్బుతో గుర్తించబడుతోంది. టెస్టులు,వన్‌డేలు అయిపోయాక ఇరువై ఓవర్లకొచ్చిన, టీట్వంటీలు కోట్ల రూపాయల్ని కుమ్మరిస్తున్నాయి. ఇప్పుడు ఆటకు దేశము, దేశీయుడు అనే గీతలనూ చెరిపేసింది. అన్ని దేశాల ఆటగాళ్లూ, తాము వేలంలో అమ్ముడుపోయిన వారి పక్షాన ఆడతారు. మన దేశంలో ఇప్పుడీ పొట్టి టీ ట్వంటీ క్రికెట్ పెద్ద వ్యాపారాంశంగా మారింది. ఇక బెట్టింగ్ ప్రహసనమూ ఇందులో భాగమే. ఆటలో వ్యాపారం మొదలయ్యాక, ఆట స్పూర్తిపోయి లాభాలు నష్టాలు మాత్రమే మిగులుతాయి. అప్పుడు లాభం కోసం వ్యాపారం ఎంత అవినీతిమయమవుతుందో ఆటలు కూడా అవినీతిలో కూరుకుపోతాయి. ఇంతటి వ్యాపారాత్మకమైన ఆటను ఓ నెలన్నర పాటు సమయాన్ని వెచ్చించి ఉద్రిక్త భరితంగా వీక్షించిన లక్షలాది ప్రజల ఆక్రమణ కొనసాగింది. ఉల్లాస భరితమవ్వాల్సిన ఆటలు ఉద్రిక్తమవ్వడమే నేటి వైచిత్రి.
ఈ ఆటతో పాటే మన దేశంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల ఆటకూ మొదలేశారు. ఇది నూట నలభై కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రక్రియ. ఈ ఆటనూ వ్యాపారమయం చేసేశారు. ఓటుకు నోటు భేరాలూ పెట్టారు. ఓటర్లనూ గంపగుత్తగా కొనుగోళ్లు చేయటమూ జరుగుతున్నవి. అంతేకాదు ఓటరు మనోభావాలను ఉద్వేగభరితం, ఉద్రిక్త భరితం చేసే ఆటా ఆడుతున్నారు. ఆనాడు శకుని మామ పాచికల ఆటలో రాజ్యాలనే సంపాదించి పెట్టాడు కౌరవులకు. అలాంటి జూదమే ప్రజాస్వామ్య మనబడే దేశాలలోనూ ఏదో విధంగా నడుస్తూ వున్నది. ఆదినుంచీ, ఆధిపత్యము ఉన్న చోటల్లా దేవుడి భ్రమాత్మక ఆటలూ, ఆవినీతి అక్రమ బాటలూ రెండు కలిసే రంగస్థలాన్ని రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బొమ్మలనే వాస్తవ పాత్రలుగా భావించాము నాడు తోలుబొమ్మ లాటలో. ఇప్పుడు మనుషులనూ, నాయకులనే బొమ్మలు చేసి ఆడిస్తున్నారు వ్యాపారులూ ఈ ఎన్నికల ఆటలో. ప్రజలు తమ భవిష్యత్తును గురించి తీవ్రంగా ఆలోచించి ఎన్నికల రణరంగంలో పాల్గొనాల్సిన సందర్భంగా ముఖ్యంగా యువత దృష్టిని, రెండు గంటల్లో అయిపోయే టీ ట్వంటీ వైపునకు తిప్పేందుకు బహుశ ఉపయో గించారేమో అనిపిస్తోంది. పట్టణాల్లోని యువత కూడా అసలు జీవితపు ఆటలో జరుగుతున్న అన్యాయాలేమిటో తెలుసుకోవటం తథ్యం.
ఎందుకంటే, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీ చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరకటం కష్టంగా మారిందంటే, నిరుద్యోగం ఎంత తీవ్రంగా పెరుగుతోందో అర్థమవుతుంది. ఈ ఏడాదిలోనే ఐఐటి చదివిన విద్యార్థుల్లో 38 శాతం మందికి ఉద్యోగాలు దొరకనేలేదు. పీజీ చేసిన వారిలో 61 శాతం మందికి ఉద్యోగాలు లేవు. ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాల లేమి నేడు ఎదురౌతున్నది. గ్రామీణ ప్రజలయితే వాళ్లకెదురౌతున్న ఇబ్బందులకు సమాధానాన్ని ఈ ఎన్నికల ఆటలో చూపెట్టబోతున్నారన్నది విధితమవుతూనే ఉంది. ఏ ఆటలైనా తమ ఇష్టమైనట్లు ఆడటం ఎక్కువకాలం సాగదు. ఆవినీతికర, భ్రమాత్మక ఆటలు ముగిసిపోకా మానదు.