లింగ వేతన వ్యత్యాసం తగ్గింది

The gender pay gap has narrowed– గ్రామీణ భారతంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ప్రభావం : అంతర్జాతీయ కార్మిక సంస్థ
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం పట్ల మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. బడ్జెట్‌లో కోతలు, అమలులో ఆంక్షల పేరుతో పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు పూనుకుంటున్నది. ప్రతీ బడ్జెట్‌లోనూ, అనేక సందర్భాల్లోనూ ఈ విషయం స్పష్టమవుతున్నది. అయితే, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) మాత్రం ఈ పథకం తీరును అభినందించింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో లింగ వేతన వ్యత్యాసం తగ్గటానికి దారి తీసిందని పేర్కొన్నది. కనీస వేతన నియంత్రణలకు అనుగుణంగా పెరిగిందని వివరించింది. ఈ విషయాన్ని తన తాజా వర్కింగ్‌ పేపర్‌లో పేర్కొన్నది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగ, ఉపాధి, వేతన వ్యత్యాసాల మధ్య దృష్టిని సారిస్తుంది.
న్యూఢిల్లీ : ఐఎల్‌ఓ వర్కింగ్‌ పేపర్‌ ప్రకారం.. ఈ పథకం కారణంగా అధికారిక వేతన కార్మికులు, సాధారణ కార్మికుల మధ్య గ్రామీణ వేతనాల్లో వ్యత్యాసం తగ్గింది. ఈ సానుకూల ధోరణుల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యక్రమం ముఖ్యమైన పాత్రను పోషించింది. అయితే, క్షేత్రస్థాయిలో పథకం అమలు ఆధారంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఫలితాలు మారుతాయి. ఇటీవలి సంవత్సరాల్లో గ్రామీణ భారత వేతనాల కొనుగోలు శక్తి ప్రతికూల పోకడలను సూచిస్తున్నది. ”భారతీయ లేబర్‌ బ్యూరో ప్రచురించిన గ్రామీణ నెలవారీ వేతన సూచికతో పాటు ద్రవ్యోల్బణం సమాచారాం ద్వారా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలి సంవత్సరాలలో గ్రామీణ భారతీయుల వేతనాల కొనుగోలు శక్తిలో ప్రతికూల ధోరణులను గమనించింది. ఈ విధంగా, 2022 ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ వేతనాల్లో (అంటే, గ్రామీణ వేతనాలు ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయబడ్డాయి) ప్రతికూల వృద్ధిని తన ఆర్థిక సర్వే 2022-23లో మంత్రిత్వ శాఖ హైలెట్‌ చేసింది” అని ఐఎల్‌ఓ పేర్కొన్నది.
ఐఎల్‌ఓ వర్కింగ్‌ పేపర్‌ 58 దేశాల నుంచి వచ్చిన గణాంక ఆధారాలను పరిశీలించింది. దీని ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ఉపాధిలో ఎక్కువగా ఉన్నారు. అయితే, ఇందులో తీవ్ర శ్రమ, రక్షణ లేకపోవటం, తక్కువ చెల్లింపులు వంటివి ఉంటాయి. ”గంటల ఆధారంగా చూస్తే పట్టణాలతో పోల్చి చూస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు సగటున 24 శాతం తక్కువ చెల్లింపులు కలిగి ఉంటున్నారు. విద్య, ఉద్యోగ అనుభవం, వృత్తి పరమైన విభాగం వంటి అంశాల్లో పట్టణ-గ్రామీణ వ్యత్యాసాల ద్వారా ఈ అంతరంలో సగం మాత్రమే వివరించబడుతుంది. కనీస వేతనాలు, సమానావకాశాలను ప్రమోట్‌ చేసే సంస్థాగత, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లు గ్రామీణ-పట్టణ విభజనలో లేబర్‌ మార్కెట్‌ సంబంధిత అసమానతలను తగ్గించటానికి సహాయం చేయగలుగుతుంది” అని ఐఎల్‌ఓ వివరించింది.