సార్వత్రిక సమ్మె విజయవంతం

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో కార్మిక సంఘాలు ఆద్వర్యంలో శుక్రవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. తెలంగాణ టిఎస్ ఆర్టీసి బస్సులు నడపక పోవడం తో అశ్వారావుపేట  బస్ స్టాండ్ లో రద్దీ తగ్గింది. హమళీ లు విధులు బహిష్కరించి సమ్మెలపాల్గొన్నారు.ఆశాలు,అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు సంఘీభావం ప్రకటించి బహిరంగ మద్దతు పలికారు.ఈ సందర్భంగా సమ్మె కారులను ఉద్దేశించి సీపీఐ(ఎం ) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు కార్మికులు రైతాంగం అనేక విధాలుగా నష్టపోయారని రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన  అన్నారు. కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన నేపథ్యంలో మూడు రోడ్ల కూడలిలో గల మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ప్రజా పంథా (మాస్ లైన్) జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో పుల్లయ్య మాట్లాడుతూ దేశ సమైక్యతకు సమగ్రతకు విఘాతం కలిగించే అనేక చట్టాలు మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని,కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చడం ద్వారా పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను అప్పనంగా దోచి పెట్టేందుకు కార్మిక కోడ్ లను తెచ్చింది అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన, కనీస వేతనం రూ. 26 వేలు ఉండాలని అనేక కమిటీలు ప్రతిపాదనలు పెట్టినా నరేంద్ర మోడీ మాత్రం రోజు కూలి రూ. 176 లు  ఉండాలని జీవో తీసుకువచ్చిందని అన్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ధరలతో మోడీ తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏ కార్మిక కుటుంబం బ్రతక లేదని అన్నారు.స్కీం వర్కర్లు వేతనాలు పెంచాలని ఈ పది సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా ఈ బడ్జెట్లో గత సంవత్సరం కంటే నిధులు తగ్గించారు అన్నారు.కార్మిక చట్టాలు పకడ్బందీ అమలు చేయాలని,కార్మిక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,కలిసి వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ,ఆందోళన నిర్వహిస్తున్న రైతంగంపై నిర్బంధాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సీపీఐ(ఎం )ప్రజా పంథా నాయకులు సలీం,రామకృష్ణ, కల్లయ్య, బుచ్చి రాజు,పిట్టల అర్జున్,రాధా కృష్ణవేణి భారతి, యామిని,వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.