ఉమ్మడి కరీంనగర్‌ బరిలో దిగ్గజాలు

– వరుస విజయాలు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం
– అందరి దృష్టి ఈ జిల్లాపైనే!
‘రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ప్రభుత్వం మాదే’నంటూ బీఆర్‌ఎస్‌ రంగంలోకి దిగగా.. ఈసారి తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ధీమాతో ఉంది. మధ్యలో ఏ చిన్న అవకాశమైనా దొరక్కపోదా? అన్న ఆశలో బీజేపీ ఎదురుచూస్తోంది. ఈ మూడు ప్రధానపార్టీల్లో సీనియర్లుగా, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వారిలో కొందరు కీలక నేతలు, అందులోనూ ఒకరిద్దరు సీఎం స్థాయి వారు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బరిలోకి దిగారు. మూడు నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ దిగ్గజాల పొలిటికల్‌ జర్నీ.. వారు పోటీ చేస్తున్న ప్రస్తుత స్థానాలను పరిశీలిద్దాం.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డికి 1983 నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. 1983, 1989, 1996 (ఉప ఎన్నిక), 1999, 2004, 2014లో ఆరుసార్లు విజయం సాధించిన ఈయన మధ్యలో 1985, 1994, 2009, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్‌ అభ్యర్థిగానే రంగంలోకి దిగుతున్న జీవన్‌రెడ్డికి ప్రత్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌ పోటీ పడుతున్నారు. ఈయన తన ఐదేండ్ల పాలనపైనా, బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసంపైనే నమ్మకంతో ఉన్నారు.
 మంథని నియోజకవర్గం నుంచి దుద్దిళ్ల శ్రీపాదరావు వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబు ఈసారీ అదే స్థానం నుంచి పోటీకి దిగారు. 1983 నుంచి 89వరకు మూడు సార్లు తన తండ్రి ఎమ్మెల్యేగా ఉండగా.. 1999 నుంచి 2018వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన శ్రీధర్‌బాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీగా పేరొందారు. ప్రస్తుతం ఈయనకు ప్రత్యర్థిగా 2014లో తనపై గెలిచిన పుట్టమధు బీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ పోటీపడుతున్నారు.
2009లో ఎంపీగా పని చేసిన పొన్నం ప్రభాకర్‌ ఆ తరువాత వచ్చిన ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోయారు. అయితే అన్నిసార్లూ పోటీ చేసిన కరీంనగర్‌ స్థానాన్ని వదిలిన పొన్నం ఈసారి బీసీ సామాజిక తరగతి ఓట్లు ఎక్కువగా ఉన్న హుస్నాబాద్‌ నుంచి పోటీకి దిగారు. వరుస విజయాలతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒడితెల సతీష్‌బాబు ప్రత్యర్థిగా ఉన్నారు.
బీజేపీలో ముగ్గురు సీనియర్లు..
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఈటల రాజేందర్‌ 2021(ఉప ఎన్నిక)లో బీజేపీలో చేరి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈయనకు ప్రత్యర్థులుగా బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒడితెల రాజేశ్వర్‌రావు ఫ్యామిలీ నుంచి ప్రణవ్‌బాబు పోటీ పడుతున్నారు. బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో తెరమీదకు వచ్చిన ఈటల రాజేందర్‌.. గెలుపు ఇక్కడ అంత సులువు కాదనే చెప్పొచ్చు.
మరోవైపు 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ ఈసారి కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. అయితే, ప్రత్యర్థిగా ఉన్న గంగులను ఢకొీట్టే స్థాయిలో సంజయ్ ప్రచారం, వ్యూహమూ లేదనే చెప్పొచ్చు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఈసారి కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి 2009 మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కె.విద్యాసాగర్‌రావు ఈసారి తనయుడు డాక్టర్‌ సంజయ్ని బరిలోకి దింపారు. డాక్టర్‌గా, సౌమ్యుడిగా పేరున్న సంజయ్ కోరుట్లలో లుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు దిగ్గజాలు..
82009లో సిరిసిల్ల నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌ వరుసగా నాలుగుసార్లు (2009, 2010, 2014, 2018) ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈయనకు ప్రత్యర్థులుగా బలమైన నేతలెవరూ పోటీలో లేకపోవడం ప్రతిసారీ కలిసొస్తుండగా.. ఈసారి కూడా అదే సీన్‌ రిపీట్‌ అయింది. బీజేపీ నుంచి అక్కడి ప్రజలకు పరిచయం లేని వరంగల్‌కు చెందిన రాణి రుద్రమారెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అభ్యర్థినే ప్రకటించలేదు. సీఎం కేసీఆర్‌ తరువాత కేటీఆర్‌యే సీఎంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు.
 కరీంనగర్‌లో కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన గంగుల కమలాకర్‌ 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మంత్రిగానూ పని చేస్తున్నారు. అయితే, ఈయనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి ప్రతిసారీ తలపడుతున్న బండి సంజరు వరుసగా ఓటమి చవి చూస్తున్నారు. ఈసారి కూడా సంజరు పోటీకి దిగినా.. గంగుల స్పీడ్‌కు తగ్గ ప్రచారమేమీ ప్రారంభించలేదు. మరోవైపు ఇక్కడా ఇంకా కాంగ్రెస్‌ అభ్యర్థి ఫైనల్‌ కాకపోవడం గమనార్హం.
2004 నుంచి వరుసగా 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఆరు సార్లు ధర్మపురి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ ఓటమెరుగని నేతగా కొప్పుల ఈశ్వర్‌ ఎది గారు. ప్రస్తుతం ఆయన మంత్రిగానూ ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతోనే గెలిచిన కొప్పులకు ఈసారి కూడా ప్రత్యర్థిగా లక్ష్మణ్‌ దిగారు. ‘కొప్పుల’ గెలుపు కష్టమేనన్న సంకేతాలు బీఆర్‌ఎస్‌లో ఆందోళన కలిగిస్తోంది.