– కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్
– ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కుల వివక్ష రహిత సమాజమే లక్ష్యమని దానికోసమే తమ సంఘాన్ని ప్రారంభించినట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం 26వ ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా సంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న ఆత్మగౌరవం సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాల సాధన కోసం అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక చారిత్రకవసరంగా కేవీపీస్ ఏర్పడిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష అంటరానితనంపై వందలాది గ్రామాల్లో వేలాదిమంది కార్యకర్తలతో సర్వేలు అధ్యయనాలు నిర్వహించి సుమారు 128 రకాల కుల వివక్ష రూపాలను వెలికి తీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహించి జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించిన ఘన చరిత్ర తమ సంఘానికి దక్కిందన్నారు. 2004 నుండి 2013 వరకు సుమారు 10 ఏండ్లు దళిత గిరిజన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని చట్టం చేయాలని అనేక సంఘాలను కలుపుకొని పోరాడి 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సాధించిందన్నారు. మంచిర్యాల జిల్లాలో దళితులపైన జరిగిన దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రజిలేని పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి బాధితుల పక్షాన నిలబడిందన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలుకు పోరాడుతున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని పరువు హత్యలకు అరికట్టాలని ఉద్యమాలు నిర్వహించిందన్నారు. చర్మకారులు, డప్పు కళాకారులు సమస్యలు సాధన కోసం ఉద్యమించిందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు ప్రసాద్, రామయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టికనంద్, కార్తీక్, నాయకులు తిరుపతి, మనోహర్, నిఖిల్, శ్రావణీ, శ్రీకాంత్, రాజు, మంజుల పాల్గొన్నారు.