సమన్వయంతో పని చేసినప్పుడే లక్ష్యం సాధ్యం

– జిల్లాను ముందుంచడానికి ఇంజనీర్లు, అధికారులు కష్టపడాలి
– కలెక్టర్‌వినయ్‌ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
మన ఊరు – మనబడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం చేపట్టిన పనులు జిల్లా స్థాయి అధికారులు, ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్య మవుతుందని జిల్లా కలెక్టర్‌ టీ.వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో మన ఊరు – మన బడి, మనబస్తి-మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పెండింగ్‌ పనులపై పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, విద్య, మౌలిక వసతులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖల ఈఈలు, డిఈలు, ఏఈలు, ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజు మన ఊరు-మనబడి పనులకు సంబంధించిన ప్రగతి రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో నల్లగొండ జిల్లాను ముందంజలో ఉంచడానికి ఇంజనీర్లు, అధికారులు కష్టపడి పనిచేయాలన్నారు. పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పనుల వివరాలను భౌతికంగా గ్రౌండ్‌ చేసి ఆన్‌లైన్‌లో విధిగా నమోదు చేయాలని సూచించారు. పనుల ప్రగతి గురించి ఎప్పటికప్పుడు డీఈఓకు సమాచారం అందించాలని తెలిపారు. 30 లక్షలలోపు పనులు పూర్తి అయిన దగ్గర చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. 30 లక్షలకుపైగా ఉన్న పనులకు సంబంధించిన గ్రౌండింగ్‌ చేసి ఎంబీ ఎందుకు రికార్డు చేయడం లేదని ఇంజనీర్లను, అధికారులను ప్రశ్నించారు. మరోసారి అలా జరగకుండా చూడాలని సూచించారు. టెండర్లు, ఎంఓయూలు, రిజల్యూషన్‌ గ్రౌండింగ్‌, అగ్రిమెంట్లు, ఫోటో క్యాప్చర్‌, అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లయితే పనులు ప్రారంభమై కొనసాగుతాయని వివరించారు. అంతేగాక వెంటనే ఎఫ్‌టీవోలు జనరేట్‌ చేయాలని తెలిపారు. పనులు పూర్తయిన చోట కలరింగ్‌ పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్భు గుప్తా, డీఈవో బిక్షపతి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జిజెవియన్‌. ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.