పేదల అభ్యున్నతే లక్ష్యం

the-goal-is-the-upliftment-of-the-poor– ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం
– శ్రీలంక జర్నలిస్టులతో సమాచార మంత్రి పొంగులేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నదనీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. శ్రీలంక మీడియా ప్రతినిధులు గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని కలిశారు. వీరంతా ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థ నిర్వహిస్తున్న మీడియా మేనేజ్‌మెంట్‌పై రెండు వారాల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్రానికి వచ్చిన బందానికి స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ఘనమైన సాంస్కృతిక చరిత్ర, సహజ వనరులు ఉన్నాయని అన్నారు. ఎమెర్జింగ్‌ టెక్నాలజీ రంగంలోనూ రాష్ట్రం ముందంజలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామనీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుతోపాటు రూ.500కే సిలిండర్‌ అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీలంక జర్నలిస్టులకు వివరించారు. జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో వారు పర్యటించిన ప్రదేశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ సంస్థను ఆయన అభినందిం చారు.ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ శశాంక్‌ గోయెల్‌ సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మీడియాలో కొత్త పరిణామాలు వస్తున్నాయన్నారు. ఈ అభివద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎదురవుతున్న సవాళ్లపై సందర్శకులకు శిక్షణ ఇచ్చామన్నారు. శ్రీలంక జర్నలిస్టులు తమకు లభించిన సాదర స్వాగతం, ఆతిథ్యానికి కతజ్ఞతలు తెలియజేసారు. శిక్షణా కార్యక్రమం ద్వారా తాము ఎంతో ప్రయోజనం పొందామనీ, ఇది తమకు గొప్ప అనుభవమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.