సాయుధ పోరాట లక్ష్యం ఇంకా మిగిలేవుంది…

The goal of armed struggle remains...సెప్టెంబరు 17న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సభలు, ఇతర కార్యక్రమాలు జరపడానికి సన్నద్ధం అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యదినంగా విస్తృతంగా వేడుకలు జరపాలని పిలుపు నిచ్చింది. విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిధిగా బహిరంగసభను నిర్వహించనున్నది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదేరోజు ఎన్నికల శంఖారావంగా భారీ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ సభలో సోనియాగాంధీ తదితర నాయకులు పాల్గొంటారని ప్రకటించింది. ఈ పార్టీలు ఇంత హడావుడి చేయడం వెనక నైజాం ఫ్యూడల్‌ పాలన నుండి తెలంగాణకు విముక్తి జరిగిన సందర్భాన్ని నెమరు వేసుకోవడం కన్నా, రాబోయే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలన్న యావ ఎక్కువగా కనిపిస్తున్నది. అందుకే ఈ పార్టీలు ఎవరి రాజకీయ, ఎన్నికల అవసరాలకు తగినట్టు వారు సెప్టెంబరు 17 చారిత్రాత్మక సందర్భాన్ని వ్యాఖ్యానిస్తూ, వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులోను బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ శక్తులు ఫ్యూడల్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత ప్రజాపోరాటానికి మతం రంగు పులిమి దానిని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు చేసిన తిరుగుబాటుగా అబద్ధాలతో, వక్రీకరణతో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. వీటికి భిన్నంగా కమ్యూనిస్టులు మాత్రమే నిజాం పాలన నుండి హైదరాబాద్‌ రాజ్య విముక్తి కోసం జరిగిన వీరోచిత రైతాంగ పోరాట వారసత్వాన్ని, వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నారు.
సెప్టెంబరు 17ను విలీనదినమని, విమోచనదినమని, నవాబు లొంగిపోయిన దినమని… ఎవరి దృక్పథాలను, అవసరాలను బట్టి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యానాలన్నింటిలో కొన్ని వాస్తవాలు ఉండవచ్చు. సెప్టెంబర్‌ 17న నైజాం సైనికులు యూనియన్‌ సైన్యాలకు లొంగిపోయాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం జేయడానికి నిజాం అంగీకరించాడు. ఆ రకంగా నిజాం పాలననుండి హైదరాబాద్‌ ప్రజలకు విమోచన కలిగింది. ఈ వివరాలతో ఎవరికీ పేచీ ఉండదు. ఈ వివరాలు మాత్రమే ప్రస్తావించుకుంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గొప్పతనాన్ని మరుగుపరిచే ప్రయత్నమే అవుతుంది. ఇంకాస్త ముందుకుపోయి బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ శక్తులు సెప్టెంబర్‌ 17 ప్రత్యేకతను ఆసరా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారాలు, వక్రీకరణలు తెలంగాణ రైతాంగ త్యాగాలను అవమానపరుస్తున్నాయి.
హైదరాబాద్‌ సంస్థాన విలీనం లేక విమోచనతో గానీ ఏమాత్రం సంబంధంలేని సంఫ్‌ు పరివార్‌, దాని రాజకీయ సంస్థ అయిన బీజేపీ ‘విమోచనదినం’ గురించి అదేపనిగా గొంతుచించుకుంటున్నాయి. సెప్టెంబర్‌ 17 గురించి వీరు చేస్తున్న హడావిడి జుగుప్స కలిగిస్తున్నది. ఎవరినుండి ఎవరు విమోచన పొందారు? విమోచన ఉద్యమానికి పూనుకున్నవారెవరు? దానికి త్యాగాలు చేసినవారెవరు? అని అంటే గుటకలు మింగుతాయి. వారివద్ద ఒక్కటే సమాధానం ఉంటుంది. నిజాం నవాబు ముస్లిం కాబట్టి, సంస్థానంలోని ప్రజలు అత్యధికులు హిందువులు కాబట్టి, సెప్టెంబరు 17న నిజాం పాలన అంతమయినందున ముస్లిం రాజు నుండి హిందూ ప్రజలకు విమోచన జరిగినట్లు చెపుతున్నది. ఇది ఎంత చవకబారు వాదనో వేరే చెప్పనవసరం లేదు. ఆగస్టు 15 రోజును ఇంగ్లండు రాణి విక్టోరియా పాలననుండి హిందూ ప్రజలు విమోచన పొందిన దినంగా ప్రకటిస్తే ఎంత వికృతంగా ఉంటుందో తెలంగాణ విమోచన గురించి బీజేపీ వాదన కూడా అలాగే ఉంది. హైదరాబాద్‌ సంస్థానం కన్నా ముందే 1947 అక్టోబర్‌ 26న కాశ్మీర్‌ సంస్థానం దేశంలో విలీనమైంది. కానీ బీజేపీ కాశ్మీర్‌లో విమోచన సంబరాలను చేయదు. ఎందుకంటే అక్కడ హిందూ రాజు నుండి ముస్లిం ప్రజలు విమోచన పొందినట్లుగా చెప్పాల్సివస్తుంది. కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన సమరశీల పోరాటం వలన ట్రావెంకూర్‌ సంస్థానం 1947 జూన్‌ 30న యూనియన్‌లో విలీనమయ్యింది. బీజేపీ భాష్యం ప్రకారం అయితే అక్కడ హిందూ రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాటంలో పాల్గొన్నారని చెప్పాలి. త్రిపుర సంస్థానం 1949 సెప్టెంబర్‌ 9న కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన సాయుధ పోరాటం ప్రభావంతో దేశంలో విలీనమైంది. అక్కడ గిరిజన రాజరికానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వాన తిరుగుబాటు చేసారని చెప్పాలి. బీజేపీ వీటి గురించి మాట్లాడదు. ఎందుకంటే మత వక్రీకరణలతో వ్యాఖ్యానించడం కుదరదు కాబట్టి.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి త్యాగాలు చేసినవారిలో హిందువులున్నారు. ముస్లింలున్నారు. అన్ని మతాలవారున్నారు. గ్రామీణ సమాజంలోని అన్ని కులాలు, వర్గాలవారున్నారు. అన్నిరకాల భాషల వారున్నారు. నిజాం ఫ్యూడల్‌ పాలన అన్యాయాలు, అక్రమాలు ఏ తరగతినీ వదిలిపెట్టలేదు. సామాజిక వ్యత్యాసాలన్నింటినీ మర్చిపోయి అందరూ ఐక్యంగా ప్రతిఘటించారు. ఈ ఐక్యతను సాధించడంలో దేశవ్యాపితంగా ప్రజ్వరిల్లిన స్వాతంత్య్రోద్యమంతో ప్రభావితమైన జాతీయవాదులు, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ముఖ్యపాత్రను పోషించారు. ఈ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా కనిపించదు. అది దేశంలో పెల్లుబికిన జాతీయోద్యమానికి దూరంగా ఉంది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి బాసటగా నిలిచింది. దేశంలో ఉన్న సంస్థానాధీశులకు అండగా నిలిచింది. అటువంటి ఆర్‌ఎస్‌ఎస్‌ రాజరిక నిజాం వ్యతిరేక పోరాటంలో ఎక్కడా కనిపించకపోవడం యాదృచ్ఛికం కాదు. ఆనాడు కాంగ్రెస్‌ కూడా జమీందారీ, సంస్థానాధీశుల ప్రాంతాలలో ఉద్యమాలను
నిరుత్సాహపరిచింది. కాంగ్రెస్‌ పాల్గొన కూడదని నిర్ణయించింది. అందుకే తెలంగాణ పోరాటంలో కాంగ్రెస్‌ చురుకుగా వ్యవహరించలేకపోయింది. ఒక రాజకీయ సంస్థగా కమ్యూనిస్టు పార్టీ, అలాగే మరికొన్ని అభ్యుదయ శక్తులు నైజాం ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటాన్ని నిర్వహించాల్సి వచ్చింది. తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని, అశేష త్యాగాలు చేసి ఆ బాధ్యతను నిర్వర్తించింది. ఈ వీరోచిత పోరాట ఫలితమే సెప్టెంబరు 17న నిజాం లొంగుబాటైనా, హైదరాబాదు సంస్థానం విలీనమైనా!
కమ్యూనిస్టులను ఖాశీం రజ్వీ నిజాం రజాకార్లకన్నా దుర్మార్గులుగా సంఫ్‌ు పరివార్‌ శక్తులు చిత్రీకరిస్తాయి. వారికి రైతులు, కూలీలు, వృత్తిదారులు, దళితులు, మహిళలపై భూస్వాములు, వారి గూండాలు చేసే దౌర్జన్యాలు కనిపించవు. నిజాం ఫ్యూడల్‌ పాలనలో జమీందార్లు, జాగీరుదార్లు అత్యధికులు హిందువులేనన్న విషయాన్ని వారు చెప్పరు. ఫ్యూడల్‌ దోపిడీకి మతం రంగు అంటదు అని తెలిసినా, గమనించనట్టు నటిస్తారు. ఎందుకంటే ఫ్యూడల్‌ దోపిడీకి, అణచివేతకు వత్తాసు పలికే వీరు భూస్వాముల రక్షణకు మత వైషమ్యాలే సమర్థమైన సాధనమని నమ్ముతారు.
నైజాం పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కాదు, ఆర్య సమాజం పోరాడిందని చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసారు. ఆర్య సమాజ్‌ హైదరాబాద్‌ సంస్థానంలో మరాట్వాడా ప్రాంతాలలో ఎక్కువగా పనిచేసింది. శుద్ధి కార్యక్రమాలను, హిందూమత హక్కులకోసం కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూమత పునరుద్ధరణ కార్యక్రమాలను నిర్వహించింది. ముస్లిం మత చాందస శక్తులు కూడా రజాకార్ల మద్దతుతో చురుకుగా ఉండేవి. ఈ పరిస్థితి మత వైషమ్యాలకు దారితీసేదిగా ఉండేది. సెప్టెంబర్‌ 17 అనంతరం ఈ వాతావరణం తీవ్ర మతఘర్షణలకు దారితీసింది. సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక ప్రకారం ఈ ఘర్షణల్లో 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆర్యసమాజ్‌ ఎప్పుడూ భూస్వాముల జోలికి పోలేదు. వెట్టిచాకిరీ గురించి, ఆడబాపలు, జోగినీ వ్యవస్థ గురించి మాట్లాడలేదు. హిందూ ముస్లిం వ్యత్యాసాన్నే ముందుకు తెచ్చింది. దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణలో ప్రజలు కులమతాలతో నిమిత్తం లేకుండా ఐక్యమై ఫ్యూడల్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందునే ఎటువంటి మత కలహాలు జరగలేదు. మారణకాండ లేదు. ఇప్పటికి కూడా ఆ మతసామరస్య వాతావరణం కొనసాగడానికి ఆ వారసత్వమే కారణం. అప్పుడు సృష్టించలేని వైషమ్యాలను ఇప్పుడు సృష్టించాలనే దురుద్ధేశంతోనే సంఫ్‌ు పరివార్‌ శక్తులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నది.
ఫ్యూడల్‌ నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను అంగీకరించడానికి బీఆర్‌ఎస్‌కుగాని, కాంగ్రెస్‌కుగాని ఇష్టంలేదు. అవి భూస్వాములకు వత్తాసునిచ్చే పార్టీలు. పోరాట కాలంలో గ్రామసీమలలో దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్‌దార్ల భూములు వేల ఎకరాలను తీసి రైతాంగానికి కమ్యూనిస్టులు పంచిపెట్టారు. కౌల్దార్ల బేదఖళ్ళను అరికట్టారు. వెట్టిచాకిరీని తుదముట్టించారు. ఆడబాపలు, దేవదాసీ వ్యవస్థలను తుదముట్టించారు. కులవివక్షను అడ్డుకున్నారు. ప్రజా ఉద్యమానికి భయపడి పట్టణాలకు పారిపోయిన భూస్వాములు టోపీలు మార్చి సెప్టెంబర్‌ 17 తర్వాత ధైర్యం తెచ్చుకుని, మిలిటరీ సహాయంతో రైతులనుండి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గ్రామాలకు వచ్చారు. రైతాంగం సాధించుకున్న హక్కుల రక్షణ కోసం కమ్యూనిస్టులు 1951 దాకా ప్రతిఘటన కొనసాగించారు. వారి సహాయంతో రైతులు ప్రతిఘటించారు. బడా భూస్వాముల నుండి లక్షలాది ఎకరాలను కాపాడుకోగలిగారు. అటువంటి భూస్వామ్య శక్తులకు అండగా ఉండే పార్టీలకు ఈ పోరాటం నచ్చుతుందని చెప్పలేము. అందుకే ఈ పార్టీలు కమ్యూనిస్టుల పాత్రను గుర్తించడానికి నిరాకరిస్తాయి.
నైజాం ఫ్యూడల్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆనాడు దేశవ్యాపితంగా ప్రారంభమైన పోరాటాల వెల్లువలో అగ్రభాగాన ఉన్నది. ముఖ్యంగా పున్నప్రవాయిలార్‌, తెభాగా, వర్లీ, త్రిపుర పోరాటాలు ఈ కోవలోకి వస్తాయి. వీటన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఈ పోరాటాలు, సంస్థానాలన్నీ దేశంలో విలీనం కావాల్సిన భూమికను సృష్టించాయి. భూసమస్యను, సమాఖ్య రూపం అవసరాన్ని, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, కౌల్దారీ రక్షణ చర్యల అవసరాన్ని రాజకీయ అజెండాలోకి తెచ్చాయి. ఇటువంటి ముఖ్యపాత్ర కమ్యూనిస్టు పార్టీ పోషించినందునే దేశంలో మొదట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కమ్యూనిస్టులకు బ్రహ్మరధం పట్టారు. అత్యధిక మెజార్టీలతో ప్రజాప్రతినిధులుగా గెలిపించారు. తెలంగాణలో సైతం అత్యధిక స్థానాలు కమ్యూనిస్టులు పోటీ చేసిన పీడీఎఫ్‌కు దక్కడం యాదృచ్చికం కాదు. కమ్యూనిస్టుల గురించి అవాకులు చవాకులు మాట్లాడేవారు, ఇప్పుడు సెప్టెంబర్‌ 17 వారసత్వం గురించి వెంపర్లాడుతున్న పార్టీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నైజాం ఫ్యూడల్‌ పాలన అంతమొందించి యూనియన్‌లో విలీనం కావడంలో ముఖ్యపాత్ర నిర్వహించి పాక్షిక విజయాన్ని సాధించింది. రైతాంగం పొందిన భూమి అత్యధికం తిరిగి భూస్వాముల స్వాధీనం కాకుండా నిరోధించగలిగింది. అయితే భూస్వామ్య వ్యవస్థ కూకటివేళ్ళతో పెకలించి వేయాలన్న లక్ష్యం తెలంగాణలోను, దేశంలో ఇంకా మిగిలే ఉంది.

బి.వి. రాఘవులు