కాంగ్రెస్‌తోనే ఉద్యమ లక్ష్యాలు నెరవేరుతాయి

కాంగ్రెస్‌తోనే ఉద్యమ లక్ష్యాలు నెరవేరుతాయి– ఐదేండ్లలో ఆరు లక్షల ఉద్యోగాల భర్తీ
– బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
– 10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ ఆకృత్యాలపై విచారణ జరపాలి
– కమీషన్ల కోసమే మిషన్‌ భగీరథ
– కాళేశ్వరం, మేడిగడ్డపై న్యాయ విచారణ చేపట్టాలి : మండలిలో కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ఉద్యమ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ పార్టీ సభ్యుడు టి జీవన్‌రెడ్డి చెప్పారు. శానసమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన శనివారం ప్రవేశపెట్టారు. దాన్ని స్వతంత్ర సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించాలని చెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సాంకేతిక, నిర్మాణ లోపానికి కారకులైన దోషులను శిక్షించాలని కోరారు. రూ.నాలుగు వేల కోట్లతో తాగునీరు అందించాల్సి ఉండగా, రూ.40 వేల కోట్లతో మిషన్‌ భగీరథ చేపట్టారని అన్నారు. కమీషన్ల కోసమే ఆ పథకాన్ని అమలు చేశారని ఆరోపించారు. ఐటీఐఆర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే బీఆర్‌ఎస్‌ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. బిశ్వాల్‌ కమిటీ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటి భర్తీకి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ పనితీరు, ప్రశ్నాపత్రాల లీకేజీ, గ్రూప్‌-1 రద్దు కావడం వంటి పరిణామాలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని అన్నారు. చైర్మెన్‌, సభ్యులను తొలగించి నియామకాలు చేపడితే బాగుండేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు జరిగితే, ఉద్యోగాల కోసం ప్రత్యేక రాష్ట్రంలోనూ అవి కొనసాగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరు వేల సర్కారు బడులు మూతపడ్డాయనీ, వాటిని తెరిపించాలని కోరారు. పర్యవేక్షణకు ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవోలు లేరనీ, అంతా ఇన్‌చార్జీలు కొనసాగుతున్నారని వివరించారు. 20 వేల ఉపాధ్యాయ ఖాళీలుంటే ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారని అన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఓ జోన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత జోనల్‌ విధానంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాలుగు జోన్ల పరిధిలో ఉందన్నారు. 317 జీవోను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమీక్షించాలని కోరారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కాకుండా నాలుగు నుంచి పదో తరగతి వరకు ప్రాతిపదికన స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. గురుకులాలకు శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రయోజనం కలిగిస్తున్నా, ఆటో కార్మికులను ఆదుకోవాలనీ, ఏటా రూ.12 వేలు చెల్లించాలని కోరారు. మద్యం నియంత్రణ శాఖకు బదులుగా మద్యం ప్రోత్సాహక శాఖగా మారిపోయిందన్నారు. ఆబ్కారీ శాఖకు గతంలో రూ.ఎనిమిది వేలున్న ఆదాయం ఇప్పుడు రూ.40 వేల కోట్లకు చేరిందని వివరించారు. బెల్టుషాపులను అరికట్టాలని కోరారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పున:ప్రారంభించాలని సూచించారు. రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టాలని చెప్పారు. రూ.లక్షలోపు రుణాలు మాఫీ కానివారుంటే అవి పూర్తి చేయాలని అన్నారు. ధరణిలో లోపాలను సరిదిద్దాలని కోరారు. తొలిఏడాది రెండు లక్షలు, ఆ తర్వాత నాలుగేండ్లలో ఏడాదికి లక్ష చొప్పున నాలుగు లక్షల ఉద్యోగాలు కలిపి ఐదేండ్లలో ఆరు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తేవాలని కోరారు. ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలివ్వాలనీ, పెండింగ్‌ బిల్లులను చెల్లించాలనీ, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని చెప్పారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సూచించారు. కులగణన చేపట్టాలని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అందుకే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆమోదిస్తున్నానని చెప్పారు.