అర్థరాత్రి సింహం ఉలిక్కి పడి లేచింది. పక్క మీద కూర్చొని, చలి జ్వరం వచ్చినట్టు గడగడా వణక సాగింది. అలికిడి విని, కింద నిద్రపోతున్న నక్క మేలుకుంది. ఆశ్చర్యంతో కండ్లింత చేసుకొని సింహం వైపు చూసింది.
‘ఏమైంది మహారాజా అలా భయపడుతున్నారు? ప్రాణ భయమా…?” అంది నక్క మంత్రి.
”అవును. నా పాలిట మృత్యు దేవత కల్లో కొచ్చింది. ఏకంగా నా ప్రాణమే తీసింది ” అన్నది చెమటలు తుడ్చుకుంటూ…
”ఎవరది మహారాజా. కాస్త వివరంగా చెప్పండి. మన జంతువులు అయితే, నా కోర దంతాలతో దాన్ని చీల్చి దాని గుండెను పళ్ళెంలో పెట్టి మీ ముందు పెడతాను” అంది శివాలు తొక్కుతూ నక్క.
”అదే… ఆ బారు దంతాల పెద్ద ఏనుగు….. కల్లోకొచ్చి….” అంది సింహం కాస్త భయంగా.
గతుక్కుమంది నక్క. ఏ కుందేలో, అడవి పిల్లో అనుకుంది. వాటినైతే వేటాడి చంపి సింహం పాదాల ముందు పడేసి తన స్వామి భక్తి చాటుకునేదే. కానీ బారు కొమ్ముల ఏనుగు అనే సరికి నక్క నోట్లో తడారి పోయింది. అది ఒక చిన్న పర్వతం ఆకారంలో ఉంటుంది. దాని దంతాలు మొనతేలి బారెడు ఉంటాయి. దాని కాళ్ళు ఉక్కు స్తంబాల్లా ఉండి, శుత్రువులను చీమల్లా నలిపేస్తాయి. దానితో తలపడిన ఏ జంతువూ ఇంతవరకూ బతికి బట్ట కట్టలేదు. మూడు పులుల్ని, నాలుగు ఎలుగు బంట్లని చంపి ఉంది. తోడేళ్ళు, దుమ్మల గొండులైతే లెక్కేలేదు. కానీ అకారణంగా ఏ జంతువు జోలికి పోదు. తన జోలికి వస్తే, ప్రాణాలతో విడిచి పెట్టదు. అదీగాక దాని వెంట ఎప్పుడూ బలమైన ఏనుగుల మంద…” ఆలోచించంగా, కంగారు పుట్టి ముంతెడు నీళ్లు తాగింది భయంతో….
”ఆ ఏనుగు మంచిదనే విన్నాను, మీ జోలికి రాదే. రాజంటే భక్తి కూడా ఉందని, తోడెలు అన్న చెప్పాడు కూడా…’ అంది పోట్లాటను నివారించాలని.
”మంచిదా? అది మంచిదే అయితే చక్కగా నడిచి, చిరుత పులి ఇంటికి విందుకు వెళుతున్న నన్ను తొండంతో చుట్టి, బండకేసి ఎందుకు కొట్టింది? దాని దెబ్బకు నా ప్రాణం హరీ మంది. కలలో చంపిన ఏనుగు, బైట చంపదనే నమ్మకమేముంది? అది ఎప్పటికైనా నన్ను చంపే తీరుద్ది. అది నా శత్రువు. రాజైన వాడు శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. ముందే మనం చంపితే, ఇంక మనకీ అడవిలో తిరుగుండదు” అంది సింహం.
”అరతేనంటారా మహారాజా” అంది సన్నగా వణకుతూ. ”చంపి తీరాల్సిందే లేకుంటే నాకు నిద్ర పట్టదు. ఇప్పుడే మంచి సమయం ఏనుగులన్నీ నిద్ర పోతుంటాయి. దాని ఇంటికి వెళ్ళి, ఎగరి అమాంతం కుంభస్థలం మీద కూర్చొని నా పంజాతో దాని తల చీల్చి, మెత్తటి మెదడు తినే దాకా నాకు మనశ్శాంతి ఉండదు. బయలు దేరు” అంది సింహం హూంకరిస్తూ.
”కలలో జరిగినవన్నీ, ఇలలో జరగవంటారు. ఆ ఏనుగు ఎప్పటికైనా మిమ్ము చంపుతుందనే భయంతో మీరలా కలగని ఉంటారు. నిజానికి ఎప్పుడూ ఆ ఏనుగు సింహాల మీద పోట్లాడడం నేను చూడలేదు” అంది శయన మందిరం నుంచి అడుగు బయటకు పెడుతూ.
అర్థరాత్రి.. ముందు సింహ నడుస్తుంటే, వెనకాల దూరంగా, కాస్త నెమ్మదిగా నక్క అనుసరించ సాగింది.
కొద్ది దూరం వెళ్ళిన సింహం దబేల్మని వెటగాళ్ళు తీసిన పెద్ద గోతిలో పడిపోయింది. కంగారు పడ్డ సింహంపైకి రావాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆ గొయ్యి బాగా లోతుగా ఉండడంతో, ఎంత ఎగిరినా వెలుపలకు రాలేక పోయింది. నక్క ఒడ్డున కూర్చోని సలహాలు చెప్ప సాగింది. పైకి వచ్చేందుకు ఏ సలహా పని చేయలేదు. ఏ ఉపాయమూ ఫలించక రాత్రి మొత్తం సింహం గోతిలోనే ఉండిపోయింది మరణ భయంతో.
ఉదయమే ఆహారానికి బయలు దేరిన ఏనుగుల గుంపును చూసిన నక్క భయంతో పరిగెత్తి పెద్ద గుండు మీద కూర్చుంది. ”మహా బలశాలులైన ఏనుగులారా, సింహ రాజు గారు గోతిలో పడిపోయారు. దయచేసి, కాస్త వేటగాడు రాక ముందే వెలుపలకు తీయండి” అని అభ్యర్థించింది.
”అయ్యో, మన రాజు గారు గోతిలో పడిపోయారా? ఎంత అవమానం వారు ఎప్పుడూ, ఉన్నత స్థానంలో సింహాసనం మీద దర్జాగా ఉండాలి. అడవిలోని జంతువులను చల్లగా కాపాడుతుండాలి. ఇప్పుడే వారిని వెలుపలకు తీద్దాం” అంది బారు దంతాల పెద్ద ఏనుగు. వెంటనే పక్కనున్న ఒక పెద్ద ఈత చెట్టును తన కుంభ స్థలంతో గుద్దింది. ఆ చెట్టు నేలకూలగానే, తన తొండంతో ఎత్తి, ఏటవాలుగా గోతిలోకి జారవిడిచింది. సింహం ఆ చెట్టు మీదుగా గబ గబా పైకి ఎక్కి వెలుపలకు వచ్చింది.
”నన్ను క్షమించు ఏనుగు అన్నా, నిన్ను చంపుదామని బయలు దేరి, నేనే ప్రమాదంలో చిక్కుకున్నాను. నువ్వు పరోపకార బుద్ధితో నన్ను రక్షించావు. నన్ను చంపాలనుకుంటే నీకో లెక్క కాదు. ఒక రాయి ఎత్తి నా మీద పడేస్తే గోతిలోనే నా ప్రాణాలు పోయేవి. లేదా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయినా వేటగాళ్ల చేతితో పడి, చనిపోయే దాన్ని. అలాంటిది నన్ను రక్షించావు నీ మేలు జన్మలో మరచిపోను. నన్ను క్షమించు” అని ఏనుగు కాళ్ళ మీద పడ్డది సింహం. మన మధ్య క్షమాపణలెందుకు తమ్ముడూ? మీరు క్షేమంగా ఉంటేనే అడవిలోని జంతువులన్నీ భద్రంగా ఉంటాయి. మీరు మహా రాజులు, మిమ్ము రక్షించుకోవలసిన బాధ్యత కూడా మా మీదే ఉంది” అంది ఏనుగు సింహాన్ని లేవనెత్తి కౌగిలించుకుంటూ ”హమ్మయ్య యుద్ధం ముగిసింది. అడవిలో శాంతి నెలకొంది” అని హాయిగా ఊపిరి పీల్చుకుంది మంత్రి నక్క.
– పుప్పాల కృష్ణమూర్తి, 9912359345