విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మెరిట్‌ విద్యార్ధులకు బహుమతుల ప్రదానం కార్యక్రమంలో మంత్రి కొప్పు ఈశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వరాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సెలెబ్రేటింగ్‌ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రసంగించారు. నాడు పాలకల నిర్లక్ష్యం, వసతుల లేమితో కుదేలైన విద్యారంగం సర్కార్‌ నిర్ణయాలతో బలోపేతమయ్యిందన్నారు. తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు 298 గురుకుల విద్యాసంస్థలు ఉండగా నేడు 1030కి పెంచుకోవడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయల నిధులతో సకల వసతులు సమకూర్చుకుని కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ధీటుగా విద్యా బోధన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యారంగం అభివద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతి ఏటా గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం పోటీ పెరుగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రమే ఎడ్యుకేషన్‌ హబ్‌గా రూపుదిద్దుకున్నదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. ‘మనఊరు-మనబడి’తో ఎవరూ ఊహించనంతగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని చెప్పారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి చెప్పారు. ఇంగ్లీష్‌ మీడియంతోపాటు డిజిటల్‌ విద్యాబోధన అందించడం వల్ల ప్రతి ఏటా ఉత్తీర్ణతా శాతం పెరుగుతున్నదన్నారు. పోటీ పరీక్షల్లో గురుకుల విద్యార్ధులు ప్రతిభచాటుతూ తెలంగాణ ఖ్యాతిని దేశ వ్యాప్తంగా తెలియచేస్తున్నారని అన్నారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో మంచి గైడ్‌ లైన్స్‌ పాటించడంతో 95 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఇది తెలంగాణ ప్రభుత్వం గొప్పతనం అన్నారు. జాతీయ స్థాయిలో మూడు వేల మంది విద్యార్ధులకు వివిధ స్థాయిల్లో అవకాశం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగంలో మరిన్ని విజయాలు తప్పక చేకూరుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌, ట్రైబల్‌ వెల్పేర్‌ విద్యాసంస్థల కమిషనర్‌ క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.