హామీల అమలులో సర్కార్‌ విఫలం

– బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
– నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-వెల్దుర్తి
హామీల అమలులో రాష్ట్ర సర్కార్‌ విఫలమైందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్‌ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి మాసాయిపేట్‌ వెల్దుర్తి మండలాలలోని ముఖ్య కార్యకర్తలతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. బీఆర్‌ఎస్‌ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి తనకు భారీ మెజార్టీ ఇచ్చిన వారికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తానన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి అక్కున చేర్చుకుంటానన్నారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. పార్లమెంట్‌ అభ్యర్థి విజయం రానున్న జెడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచి, ఎన్నికలకు బాసటగా ఉంటుందన్నారు. కెసీఆర్‌ నాయకత్వంలో ముందుకు కొనసాగుదామన్నారు.మెదక్‌ పార్లమెంట్‌ బి ఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోతున్నారన్నారు. తాను కలెక్టర్‌ హౌదాలో ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి అందరి మన్ననలను పొందానన్నారు. ఒక ప్రాంతానికి మాత్రమే ప్రభుత్వ అధికారిగా పని చేశానన్నారు. ఇప్పుడు మాత్రం మెదక్‌ పార్లమెంటు ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని, ఆదరించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ట్రస్టు ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించి ఉచితంగా పుస్తకాలను అందజేసి కోచింగ్‌లను ఇప్పిస్తానన్నారు. నిరుద్యోగ యువతీ యువకులను అక్కున చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి జాబ్‌ మేళ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల కోసం ఓ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసి ఉచిత వివాహాల కోసం తోడ్పాటు అందిస్తానన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ ఇన్చార్జి ఉమ్మన్నగారి దేవేందర్‌ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని అన్ని రకాల పనులను చేయించుకుందామన్నారు. వెల్దుర్తి పిఎసిఎస్‌ చైర్మన్‌ అనంతరెడ్డి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి వెంకటరామిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రమేష్‌ గౌడ్‌ గ్రంధాలయ చైర్మన్‌ చంద్ర గౌడ్‌ శివంపేట ఎంపీపీ హరికష్ణ ఎంపీటీసీ మోహన్‌ రెడ్డి ప్రతాప్‌ రెడ్డి సింగేపల్లి గోపి మాసాయిపేట మండలం బి ఆర్‌ ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి కోదండ కష్ణ గౌడ్‌ తోట నరసింహులు పిఎసిఎస్‌ డైరెక్టర్‌ రమేష్‌ చందర్‌ ఆయాగ్రాముల తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.