ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది

The government is strangling us– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
– అసెంబ్లీ మీడియా పాయింటు వద్దకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
– బారికేడ్ల వద్ద ఎమ్మెల్యేల బైటాయింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కుతోందని, అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కూడా మాట్లాడొద్దా అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు బుధవారం వాకౌట్‌ చేసి మీడియా పాయింట్‌ వద్దకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్‌ అడ్డుకున్నారు. పోలీసులు బారీకేడ్లు అడ్డుపెట్టారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్‌ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదనడంతో వాగ్వాదం జరిగింది. దాంతో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్‌ రెడ్డిు ఆగ్రహం వ్యక్తం చేశారు.అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదని, ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కుతోందని అన్నారు. ఉత్తర్వులు చూపాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తూ అక్కడే బైటాయించారు. ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.. కానీ తమకు సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా పాయింట్‌ వద్ద కూడా మాట్లాడేందుకు అవకాశం లేదా అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో నిర్బంధాలుండవని, కంచెలు తొలగిస్తామని మాటలు చెబుతూనే శాసన సభ్యులకు మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడే అవకాశం లేకుండా కంచెలు ఏర్పాటు చేసి, వందలాది మంది పోలీస్‌లు, మార్షల్స్‌తో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తాను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రిగా పని చేశానని, తనకు మాట్లాడే అవకాశం స్పీకర్‌ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సీఎం చెప్పేదొకటి చేసేదొకటని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
అసెంబ్లీలో సీఎం చెప్పలేని భాషలో మాట్లాడుతున్నారని, రేవంత్‌ రెడ్డి అనుచిత భాషను ఖండిస్తున్నామన్నారు. రికార్డుల నుంచి వాటిని తొలగించాలన్నారు. రెండు నెలలోనే కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కడియం ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణకు రాజీవ్‌ గాంధీకి ఏం సంబంధమని, సెక్రటేరియట్‌ ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.అక్కడ ఇంతకుముందు కేసీఆర్‌ ప్రతి పాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నారు.