ప్రభుత్వం దళితులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని అమలు చేయాలి..

Govt should implement all the promises given to dalits..– కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నర్సింహ డిమాండ్. 
నవతెలంగాణ – భువనగిరి
కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి డాక్టర్ బిఆర్. అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలతో పాటు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూముల పంపిణీ, దళిత వాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు లాంటి అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్న ఏ ఒక్క హామీని  అమలు చేయలేదని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కెవిపిఎస్ జిల్లా కార్యాలయం, భువనగిరిలో కుల వివక్షవ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు దుబ్బ లింగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా ఎస్సీ సంక్షేమం కోసం ఉన్న ఎస్సీ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం చాలా దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూటికి 18% పైగా దళితులు ఉంటే వారి సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ దళితులు విద్య, వైద్యం, ఉపాధికి, దళిత వాడల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు. పాలకులు మారుతున్నారు తప్ప దళితుల బతుకుల్లో మార్పులు మాత్రం రావడంలేదని తెలిపారు. నేటికీ అనేక రకాలైన వివక్ష రూపాలు ఎదుర్కొంటున్నారని , కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యల గురవుతున్నారని అన్నారు. కులాంతర వివాహేతుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందిస్తామన్న ఈ ప్రభుత్వాలు వందల మంది ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే నేటికీ వారికి సహాయం అందిస్తలేరని ఇప్పటికైనా వారికి రావలసిన ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేసినారు. వీటి అమలు కోసం రానున్న కాలంలో దళితులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ కార్యదర్శి సిరుపంగి స్వామి, కార్యదర్శి అన్నంపట్ల కృష్ణ పాల్గొని మాట్లాడగా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గ్యార అశోక్, అబ్దుల్లాపురం వెంకటేష్ , వడ్డేపల్లి యాదగిరి , జిల్లా సహాయ కార్యదర్శి పాపగళ్ళ లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు మంద కిరణ్, కొంపెల్లి గంగయ్య, ఎటెల్లి నర్సింహ, కొంపెల్లి అనిల్, పోలపాక గణేష్, వెంకటేశం  పాల్గొన్నారు.